ప్రతిబింబం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445

  గార్గేయపురంలో నాగయ్యకు చిన్న కిరాణా దుకాణం ఉంది.అతని దుకాణానికి ఎదురుగా శాంతయ్య అనే అతను కిరాణా దుకాణం నడుపుతున్నాడు.
        నాగయ్య దుకాణంలో ఎక్కువమంది సరుకులు కొనేవారుకాదు.పైగా నాగయ్యతో వారు ముక్త సరిగా మాట్లాడేవారు.తనకెందుకు ఈ పరిస్థితి అని నాగయ్య ఒకరోజు ఆలోచించాడు.ఎంత ఆలోచించినా నాగయ్యకు కారణం కనబడలేదు.
        ఒకరోజు గార్గేయపురం రాములవారి గుడికి సుకేతుడు అనే జ్ఞాని వచ్చి అనేక జీవిత సత్యాలు,పురాణాల్లో సూక్ష్మాలను గురించి వివరించి జీవితాలను ఏవిధంగా ఉత్తమమార్గం వైపు మలచుకోవచ్చో చెబుతున్నాడు..
        అతను చెబుతున్న మంచివిషయాలు వినాలని,తన సమస్యను అతనితో చెప్పుకోవాలని నాగయ్య అనుకుని, సుకేతుడు ప్రవచనాలు చెప్పే రోజున గుడికి వెళ్ళాడు.
         మనిషి గుణగణాలు,నడవడికలను గురించి మహత్తరంగా ఉపన్యసించాడు.అంతా అయ్యాక నాగయ్య సుకేతుడు వద్దకు వెళ్ళి తన వ్యాపారం పెరగడం లేదని,ఎవరూ తనతో సరిగ్గా మాట్లాడటం లేదని తన బాధలు చెప్పాడు.
        అంతావిని సుకేతుడు చిరునవ్వుతో కొంచెం సేపు ఆలోచించి,నాగయ్యను గుడిలోని అద్దాల మంటపానికి తీసుకవెళ్ళి ఒక్కసారి నవ్వమని చెప్పాడు.అద్దాల్లో నవ్వుతున్న నాగయ్య తనకుతానే అందంగా కనబడ్డాడు.
        "ఇప్పుడు కొంచెం ఏడుపు మొహం పెట్టు"అన్నాడు సుకేతుడు.
        అద్దాల్లో నాగయ్య తనకుతానే అందవిహీనంగా కనబడ్డాడు."ఇదీమిటి నేను ఇలా ఉన్నాను"అనుకున్నాడు.
       "ఇప్పుడు కోపంగా మొహంపెట్టు"అన్నాడు సుకేతుడు.
       ఎట్టో ప్రయత్నించి నాగయ్య కోపంగా మొహం పెట్టాడు.అంతే తనమొహం తనకే అసహ్యంగా కనబడింది.
       "చూశావా నాగయ్యా నీవు నవ్వినపుడు ఎంతో అందంగా కనబడ్డావు,మరికోపంగా ఉన్నప్పడు,ఏడుపు మొహం పెట్టినపుడు అందవిహీనంగా కనబడ్డావు,దీని అర్థం ఏమిటంటే నీవు నవ్వుతో సంతోషంతో పలకరిస్తే నీవంటే అందరికీ ఇష్టం ఏర్పడుతుంది.నీ దుకాణంలో అందరూ సరుకులు కొనడానికి ఆసక్తి చూపుతారు.
ఒక సారి నీ ఎదురు దుకాణంలోని శాంతయ్యను పరిశీలించు,విషయం నీకు పూర్తిగా అర్థం అవుతుంది.మంచి మాట,మొహంలో ప్రశాంతత అనేవి ఎదుటి వ్యక్తిలో మనమీద సదభిప్రాయం కలిగిస్తాయి అర్థం చేసుకో" అని చెప్పాడు.
         "నా కళ్ళు తెరిపించారు,ఇకమీదట మీరు చెప్పినట్టు నడచుకుంటాను"చెప్పాడు నాగయ్య.
          "ఆరాముడు నీకు మేలు చేస్తాడు"అని రాముల వారి విగ్రహాన్నిచూపిస్తూ చెప్పాడు సుకేతుడు.
       సుకేతుడికి నమస్కారం పెట్టి శాంతయ్య దుకాణానికి వెళ్ళాడు.శాంతయ్య వచ్చిన కొనుగోలు దారులతో ఎంతో చక్కగా మాట్లాడుతూ,నవ్వుతూ సరకులు అమ్మతున్నాడు.వచ్చిన వాళ్ళు ఎంతో ఆనందంగా ఆయనతో మాట్లాడుతున్నారు.
        ఇప్పుడు సుకేతుడి మాటలు నాగయ్యకు పూర్తిగా అర్థంఅయ్యాయి.నగుమోము,మంచిమాటలే జీవితానికి అవసరం అని తెలుసుకున్నాడు.
                ************

కామెంట్‌లు