గ్రామ సింహం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   గోవిందపురం రామాలయంలో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణదాసు అనే పేరుమోసిన హరికథకుడు ఎంతో చక్కగా సుందరాకాండను హరికథారూపంలో చెబుతున్నాడు.
       అక్కడ భక్తులందరూ ఎంతో ఆసక్తితో తన్మయత్వంతో సుందరాకాండను వింటున్నారు.
     కథ ఆసక్తిగా జరుగుతున్నప్పుడు  అక్కడికి ఊరు పెద్ద మల్లయ్య నలుగురు వ్యక్తులతో వచ్చాడు. వచ్చిన మల్లయ్య నిశ్శబ్దంగా హరికథ వినకుండా పక్కవారితో ఏవో గట్టిగా తన గొప్పలు చెబుతూ,గట్టిగా నవ్వుతూ మాట్లాడసాగాడు!
      అతడి మాటలు,నవ్వులు అక్కడి హరికథా వాతావరణాన్ని  భంగపరిచాయి.కానీ,నారాయణదాసు మల్లయ్యను నేరుగా హెచ్చరించకుండా ఓ పిట్ట కథను ఈవిధంగా చెప్పాడు.
       "ఓ రాజుగారి తోటలో ప్రశాంత వాతావరణంలో పండిత గోష్టి జరుగుతోంది.అక్కడి కవులు అనేక పద్యాలు కమ్మగా చెబుతూ సభను రంజింప చేస్తున్నారు.ఇంతలో అక్కడికి ఎక్కడినుండో ఓ కుక్క వచ్చి వింతగా అరచింది! సభికులంతా ఆ కవితా శ్రవణాన్ని వినకుండా, ఆ కుక్కకేసి చూస్తున్నారు. అందరూ అలా  చూసేసరికి  కుక్కకి ఒక విధమైన భయం పుట్టుకొచ్చి  తోకముడుచుకుని వెళ్ళిపోయింది! చూసారా  రసవత్తరమైన ఆ సభ ఒక అల్ప జీవి అయిన కుక్క వలన రసాభాస అయింది. అందుకే మంచి కథాగోష్టి,కవితా గోష్టి ,హరికథ జరిగేటప్పుడు గ్రామ సింహాలు రాకుండా చూసుకోవాలి" అని నర్మ గర్భంగా చెప్పాడు.
      ఆ కథ విన్న మల్లయ్య తన నుద్దేశించే ఆ పిట్టకథ చెప్పాడని అర్థం చేసుకుని,ఆ క్షణం నుండి నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
       నారాయణదాసు సుందరాకాండను యదావిధిగా  రసవత్తరంగా పూర్తిచేసాడు.
      చూసారా ఏ సభకు వెళ్ళినా నిశ్శబ్దం పాటించి వక్త చెప్పే విషయాలను ఆకళింపు చేసుకోవాలి సభలో గట్టిగా మాట్లాడితే మనవలన పక్కవారికి కూడా ఇబ్బంది కలుగవచ్చు.
             

కామెంట్‌లు