ఓ చిన్న సహాయం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  పొద్దుటనుండి వాన పడుతోంది.చేయాల్సిన పని ఏమీ లేకపోయేసరికి మాఇంటి వరండాలో నిలబడి చినుకులు రోడ్డు మీద సృష్టిస్తున్న వింత వలయాలు చూస్తున్నాను.
         చల్లని గాలి మనసుకు హాయిగా ఉంది.ఈ చినుకల వలన రోడ్డు మీద జన సంచారంలేదు!అప్పుడప్పుడూ రోడ్డు మీద వెళ్ళే కారో,ఆటోనో రోడ్డు మీద నిలచిన నీళ్ళను ఇటు అటు చిమ్మి వెళ్ళి పోతున్నాయి.
       అలా చూస్తుండగానే ఓ అబ్బాయి బహుశా 25 ఏళ్ళు ఉండవచ్చు, గొడుగుతో చంకలో ఫైల్ తో మా ఇంటి ముందునుంచి రోడ్డు మీద నీటి చెరువుల్ని(గుంటలు) తప్పించుకొంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.
       అతన్ని గమనిస్తున్నాను.బహుశా అర్జంటు ఫైల్ అంద చేయాలనో లేక ఏదైనా ఇంటర్వూ ఉందో తెల్లని షర్ట్ బ్లాక్ ఫాంటుతో వెడుతున్నాడు.అతడిని గురించి పరి పరి ఆలోచనలు నామెదడులో పుట్టుక రాసాగాయి!
       ఏదైతే జరగకూడదో అదే జరిగి పోయింది.ఓ కారు కొంత వేగంతో రావడం,రోడ్డుమీద బురద నీళ్ళను ఎగ చిమ్మడం, ఆ ఎగిరిన బురదనీరు ఆ అబ్బాయి తెల్లని షర్ట్ మీద బురద డిజైన్ వెయ్యడం జరిగి పోయాయి! ఆ అబ్బాయి మొహంలో ముఖ కవళికలు అతి ఘోర స్థితికి మారి పోయాయి! విషాద వదనంతో ఆ మరకల్ని చూసుకో సాగాడు.అంతే అతన్ని చూసి నా మనసు కాకావికలం అయిపోయింది.
        ఏది ఏమైనా ఆ అబ్బాయికి హెల్ప్ చేయాలనుకొన్నాను."మిస్టర్"అని గట్టిగా అరచాను.నావైపు చూశాడు.నా దగ్గరకు రమ్మని పిలిచాను.జాగ్రత్తగా నడచుకుంటూ నా వద్దకు వచ్చాడు.
      "అర్జంటు పని మీద పోతున్నట్లున్నావు,నీకు టైం ఉందోలేదో,నీ ఫాంటు మీద మరకల్ని తుడుచుకో,నీ షర్ట్ బురద మరకలతో బాగా పాడయింది,ఇంట్లో మా అబ్బాయి ఇస్త్రీ చేసిన తెల్ల షర్టు ఉంది వేసుకో.ఆ షర్ట్
మా ఇంట్లో వదిలెయ్,మా చాకలి ఉతికి ఆరేస్తాడు. ప్రస్తుతానికి మావాడి షర్ట్ వేసుకుని పని కానించు" చెప్పాను.
      "మీకు శ్రమ ఇస్తున్నాను సార్,ఇప్పుడు నేను ఇంటర్వూకి వెళ్ళాలి,మీ అబ్బాయి షర్ట్ వేసుకుని వెడతాను"అంటూ నమస్కారం పెట్టి చెప్పాడు.
       అతనికి చిన్న సహాయం చేస్తున్నందుకు నాకు సంతోషం కలిగింది.ఆ అబ్బాయిని ఇంట్లోకి రమ్మనమని మా అబ్బాయి షర్ట్ ఇచ్చాను.షర్ట్ అతికినట్టు సరిపోయింది.
      "థాంక్స్,సర్" అన్నాడు
      "ఆల్ ద బెస్ట్" చెప్పి "ఉండునాకారులో ఇంటర్వూ ప్లేస్ కి తీసుకవెడతాను,వీధి కొసకి నడిచి వెడితే మళ్ళా ఏ కారో బురద చల్లవచ్చు"అని అతనిని నాకారులో ఎక్కమని డోర్ తీసాను.
     మరలా థాంక్స్ చెప్పి కారు ఎక్కాడు.అతని మొహంలో సంతోషం స్పష్టంగా కనబడింది.అతనిని టైముకి ఇంటర్వూ చేసే ఆఫీసులో వదలి పెట్టాను.
      ఆ రెండో రోజు ఆ అబ్బాయి మా అబ్బాయి షర్ట్ ఉతికించి ఇస్త్రీ చేసి తేవడమే కాకుండా ఒక స్వీట్ డబ్బా నాచేతిలో పెట్టి నా కళ్ళకు నమస్కారం పెట్టి,  "సార్  నిన్న మీరు హెల్ప్ చేయకపోతే ఉద్యోగం వచ్చి ఉండేది కాదు.
      "అంతా పైవాడి దయ" అని చెప్పి ఒక స్వీటు అతని నోట్లో పెట్టాను.
       అతను తన గురించి ఉద్యోగం గురించి నాకు వివరించాడు.
       అనుకోకుండా అతనికి సహాయం చేసినందుకు ఆనందంతో నా హృదయం పొంగింది.అతను పైకి రావాలని మనస్ఫూర్తిగా దీవించి పంపాను.
      అప్పుడే మా చాకలి అబ్బాయి అతడి షర్ట్ ఉతికి ఇస్త్రీ చేసితెచ్చాడు.అది అతనికి ఇచ్చాను.
       ఆ గోడమీద ఫోటోలోవెంకటేశ్వరస్వామి నన్ను ఆశీర్వదిస్తున్నట్టు కనబడింది.
                ********

కామెంట్‌లు