భలే తెలివి:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  కమల వాళ్ళ అమ్మ నాన్నలతో మధురా పురంలో ఉంటోంది.కమల తెలివిగల పిల్ల,బాగా చదువుకుంటోంది.
        ఇంటా బయట ఎవరికిఏ కష్టం వచ్చినా మంచి సలహాలు ఇచ్చేది.అందుకే కమల అంటే అందరికీ ఇష్టం.
     ఇలా ఉండగా కమల నాన్నకు వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చింది.ఆఖరికి ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
       "నాన్నా భయపడకు తెలివితో మరలా మంచి ప్రణాళికతో వ్యాపారం చేస్తే మనం  నిలదక్కుకోగలం"అని తండ్రికి ధైర్యం చెప్పింది.
         ఒక రోజు పెరడులో ఉన్న జామచెట్టు కాయలు కోయాలని కమల కట్టెతో వెళ్ళింది.అలా కాయలు కోసుకుంటుంటే ఒక కాయ నేల మీద పడింది.ఆ కాయ తీసుకోవాలని చూస్తే కాయపక్కన ఓ వజ్రాల హారం పడి ఉంది.దానిని చూసి కమల ఆశ్చర్య పోయింది!అంత ఖరీదైన హారం తమ రాజ్యం రాణీ గారిది అయి ఉంటుందని ఆలోచించింది.ఏమైనా ఆ హారం వీలైతే రాణీగారికి చేర్చాలనుకుంది అంతేకాని అది ఉంచుకోవాలనుకోలేదు.మంచి ఆలోచన గల వాళ్ళకు అంతా మంచే జరుగుతుంది కదా!
      కమల ఊహించినట్టుగానే రెండో రోజు వీధిలో దండోరా డప్పు వినిపించింది.
         "రాణీ గారి వజ్రాల హారం ఎక్కడో పడిపోయింది,ఎవరికైనా దొరికితే తెచ్చి ఇస్తే తగిన బహుమతి ఇవ్వబడుతుంది"అని అరుస్తూ డప్పు వాయిస్తున్నారు.
       వెంటనే తల్లిదండ్రుల అనుమతి తీసుకుని కమల రాణీ గారి అంతఃపురానికి వెళ్ళి రాణీగారికి వజ్రాల హారం ఇచ్చింది.కమల మంచితనానికి రాణీ గారు ఎంతో మెచ్చుకుని మంచి బహుమతి కోరుకోమంది.
         "మహారాణీ, మరి నేను కోరింది ఇస్తారు కదా" 
       "అడుగు కమలా,మంచి ఇల్లు కావాలా? తగినంత డబ్బు కావాలా?ఏంకావాలి?" అని అడిగింది రాణి.
      "నాకు ఏదీవద్దు,నేను చెప్పినట్టు తమరు నగరంలో చాటింపు వెయ్యండి చాలు"అన్నది కమల.
      కమల కోరికకు రాణీ ఆశ్చర్య పోయి, "ఏం చాటింపు వేయించాలి?" అడిగింది.
       "మహారాణీ, రేపు దీపావళిరోజున ఎవ్వరూ దీపాలు వెలిగించకూడదు, మీరుకూడా,కానీ ఆ షరతు నాకు వర్తించదు" అని నమస్కారం పెట్టి చెప్పింది.
   "చిత్రంగా ఉంది నీ కోరిక,అయినా ఇచ్చిన మాట ప్రకారం చాటింపు వేయిస్తాను"అని చెప్పి మంత్రితో ఆ చాటింపు వేయమని ఆజ్ఞాపించింది.
        దీపావళి రోజున నగరమంతా చీకటిలో మునిగి పోయింది.ఒక కమల మటుకు ఇంట్లో దివ్వెలు వెలిగించింది.మరి ఆ లక్ష్మీదేవి నగరంలోకి ప్రవేశిస్తే అంతా చీకటి మయం,దీపాలు వెతుక్కుంటూ వెళితీ కమల ఇంట్లో ఆమెకు దీపాలు కనుపించాయి! లక్ష్మి లోపలికి వెళ్ళి కమలను ఆశీర్వదించింది ఆ ఇంట్లో దీపాలు చూసి ఎంతో సంతోషించి ఆ ఇంట సిరులు కురుపించింది! ఆ విధంగా అపార సంపద కమల ఇంట్లోకి వచ్చింది.
         లక్మీదేవి కమల అమ్మ,నాన్న నమస్కారం పెట్టి స్తుతించారు.ఆ విధంగా కమల సూక్ష్మ ఆలోచన వలన మరలా కమల కుటుంబానికి సంపద లభించింది.అది కమల తెలివి.
(ఇన్ఫోసిస్ సుధామూర్తి కథకు అనుసృజన)
         

కామెంట్‌లు