1.బీజం నుండి వృక్షం పుట్టు!
వృక్షం ఫలాల్లో బీజాలు,
మూటకట్టు!
కవి కవిత్వానికి పుట్టు!
జన హితానికి పట్టం కట్టు!
పట్టుతో విప్పుతాడు గుట్టు!
అతడో అక్షరమధువుల,
తేనెపట్టు!
2. కవి తల కవితల పుట్ట!
శోకం పాలిట అడ్డుకట్ట!
హర్షం వాకిట చెలియలికట్ట!
ఆది కాలమైనా,
ఆధునిక కాలమైనా,
నడయాడే,
వాణి స్వరూపం కవి!
చీకట్లు చీల్చడానికి,
దిగి వచ్చిన రవి!
ప్రతిభ,అభ్యాసం, ఉత్పత్తుల, త్రివేణీసంగమం ఆ హృదయం,
జనానికి నిత్యం రసోదయం!
జగానికి సత్యం అభ్యుదయం!
3.కవి అల్లిన అక్షరం!
మట్టియై జీవితాన్నిస్తుంది!
నీరయి దాహం తీరుస్తుంది!
గాలయి ఊపిరి పోస్తుంది!
జ్వాలై బుద్ధి ప్రజ్వలిస్తుంది!
నింగై లోకాన్ని రక్షిస్తుంది!
4.కవి పలికిన శబ్దం!
సౌజన్యం విస్తరిస్తుంది!
పాంచజన్యం పూరిస్తుంది!
దౌర్జన్యం ఎదిరిస్తుంది!
శతఘ్నుల్ని పేలుస్తుంది!
కృతఘ్నల్ని నేల రాస్తుంది!
కవి అంటే ఓ కట్టుబాటు!
అతడి కర్తవ్యం తిరుగుబాటు!
5.కవి కవిత్వంతో,
అరూపం,
అపురూపమవుతుంది!
శిల-శిల్పం!
కొండ-కోవెల!
వెదురు-వేణువు!
అణువు-మేరువు!
వామనుడు-త్రివిక్రముడే!
6.కవి మన కళ్ళ ముందు,
ఉన్నా! లేకున్నా!
కనిపించని లోకం చేరుకున్నా!
అతడి ఆత్మ అక్షరమవుతుంది!
విశ్వమంతా విస్తరించి,
ఉంటుంది!
వేనకువేల చైతన్య జ్యోతులు,
వెలిగిస్తూనే ఉంటుంది!
-----------------------------------------------------------------------------------------------------
మాతృభాషా దినోత్సవం(గిడుగు రామమూర్తి జయంతి)శ్రీ కుసుమంచి సుబ్బారావు గారి నిర్వహణ లో ,భారతీయ జనతాపార్టీ కార్యాలయం, విజయనగరం.లో జరిగిన కవి సమ్మేళనం.కవి:డా.పి.వి.ఎల్.సుబ్బారావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి