శివ సూక్తులు – పెద్ది సాంబశివరావు-94410 65414, peddissrgnt@gmail.com

పిల్లవాండ్రు కారు పిడుగులు బాలలు
అక్షరాల కన్న ఆటలన్ని
ముందు నేర్వ గలిగె ముంజేతి ఫోనులో 
అమ్మఅయ్యలెంతొ హర్షమొంద.

తడబడ అడుగుల బుడతడు మూడోయేట
వడివడిగను ఏబి బడిని చేరె 
పుస్తకములు, బూట్లు, దుస్తులు, టైకట్టి
మూడుగాళ్ల బండి ముందు ఎక్కె.  

పొరుగు ఇరుగు తోడ పోల్చుకొనుచు
వారు చేసినట్లు మీరు చేయ
నక్క పులిని పోల్చి పెక్కు వాతలుపొందె
నీదు రూక రాకను నిక్కమెరుగు.

విరివిగాను కొనకు వినియోగదారుడా
ఉచిత కానుకలన్ని ఉత్త డాబు
ఆఫరులును, హామి ఆకర్షకవలలు
ఏది నీకు వలయు నదియె కొనుము.

చౌక గనక కొనకు రూకలు జాగ్రత్త
పెట్టె జూచి వలదు పెట్టుబడులు
మాయ కబురు నమ్మి మోసపోడు జ్ఞాని
సరుకు నాణ్యతలును సరిగ జూడు.
కామెంట్‌లు