శివ సూక్తులు – పెద్ది సాంబశివరావు-94410 65414, peddissrgnt@gmail.com

గబ్బిలముల చేత గళమెత్తి పాడించి
ఖండకావ్యములను మెండు వ్రాసె
భాష తెలుగునందు జాషువా కోకిల
కలము నుండి కురిసె కరుణ రసము.

పాత్రమీది మూత పడిలేచుటను జూచి
జయము పొందినాడు జేమ్సు వాటు
తాను కనుగొనంగ ఆవిరి యంత్రంబు
తర్కబుద్ధి వలన తరుగు భ్రమ.

అజహరుద్దీన గునె ఆరంభశూరుడు
త్రిశతకములు వరుస బాద
బద్దలయ్యె గద ప్రపంచ మానాలు
ఓర్పు నేర్పులున్న ఒనరు నన్ని.

విశ్వవిజయులమని విర్రవీగి, పిదప
ఓడె చిత్తుగ మన క్రికెటు జట్టు
స్వంత నేలమీద ఇంగ్లాండు చేతిలో
పిట్టపిట్ట పోరు పిల్లి దీర్చె.

ఓడ, బుద్దివచ్చి, ఓర్మిని కోల్పోక
ఐకమత్యముగను ఆట ఆడి
తెచ్చినారు మరల విశ్వజ్ఞాపిక మరల  
ఓటమయ్యె గెల్పునకు పునాది.

గుర్రం జాషువా

కామెంట్‌లు