*ఒక చల్లని మేఘం (తల్లిదండ్రులు తప్పక చదవాల్సిన కథ)* డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 మురళి బ్యాట్‌ పట్టుకోని రెడీగా నిలబడ్డాడు. లత తడబడుకుంటూ నాలుగడుగులు ముందుకేసి బలంగా బంతి విసిరింది. అది నేల మీద నాలుగు పిల్లిమొగ్గలేసి బ్యాట్తో కొట్టక ముందే ఆగిపోయింది. మురళి చెల్లెలు వంక కోపంగా చూస్తూ ''ఏయ్‌... పిచ్చిపిల్లా... సరిగ్గా వెయ్యలేవా'' అన్నాడు.

లత పెదాలు సున్నాలా చుట్టి ''నేనేం పిచ్చిపిల్లను కాను. మన్చిపిల్లను'' ముద్దుముద్దుగా అంది. మురళి నవ్వుతూ చెల్లిని మరింత ఉడికించడానికి ''నువ్వేం మన్చిపిల్లవుకాదు. పిచ్చి కుక్కవి'' అన్నాడు. లత ఉక్రోషంగా తలెత్తి ''నేనేం పిచ్చికుక్కను కాను. నువ్వే పిచ్చికుక్కవి. నేను మన్చికుక్కను'' అంది. మురళి పగలబడి కిలకిల నవ్వసాగాడు. అన్నయ్యెందుకు నవ్వుతున్నాడో అర్థంగాక ''నీతో ఆన్ను ఫో... కచ్చి'' అంటూ లత ఆన్నించి వెళ్ళిపోయింది.
:-
మురళి నవ్వుకుంటూ బ్యాట్‌ భుజంపై పెట్టుకోని బైటికి పోడానికి కదిలాడు. అంతలో వాళ్ళ నాన్న సంచితో లోపలికడుగు పెట్టాడు. కొడుకు చేతిలో బ్యాట్‌ చూసి,
''రేయ్‌... ఏందిరా... ఎప్పుడూ వెధవాటలూ నువ్వూనూ. వచ్చినప్పన్నించి చూస్తున్నా... ఎప్పుడన్నా పుస్తకం పట్టుకొని పట్టుమని పది నిముషాలన్నా కూర్చున్నావా. సందు దొరికితే చాలు బైటకురుక్తావ్‌. ఐపాయలే ఇదే ఆఖర్రోజు. ఇంతకీ అన్నీ సర్దుకున్నావా... లేదా... ఇదిగో స్కూల్‌డ్రస్‌. సూట్‌కేస్లో పెట్కో. రేప్పొద్దున్నే బైల్దేరాల'' అంటూ సంచి అందించాడు.
మురళికొక్కసారిగా నీరసమావహించింది. బట్టల్తీస్కోని కాల్లీడుస్తూ రూంలోకి చేరుకున్నాడు. స్కూలు గుర్తుకు రాగానే కళ్ళ నిండా నీళ్ళు కమ్ముకొన్నాయి. మంచమ్మీద వాలిపోయాడు. అంతలో లతొచ్చి చేయి పట్టుకొని లాగుతూ ''అనా... దానా... ఆడుకుందాం. నువ్వు బాలెయ్యి నేను కొడ్తా'' అంది. మురళి విసుగ్గా ''యేయ్‌... పోతావా లేదా ఈన్నించి'' కసురుకుంటూ విసురుగా దొబ్బాడు. లత గోడకు కొట్టుకోని కిందపడి ఏడుస్తూ బైటికి పోయింది.
మురళి ఒంటరిగా పండుకున్నాడు. పదే పదే స్కూలు, వార్డెను, టీచర్లు, బెత్తాలు గుర్తుకు రాసాగాయి. రాత్రి అన్నం సయించలేదు. నిద్ర రాలేదు. పొద్దున్నే తండ్రి వెంట సూట్‌కేస్తో మౌనంగా బైలుదేరాడు. లత చిరునవ్వుతో టాటా చెప్పసాగింది. మురళికి పోవాలన్పించడంలేదు. దుఃఖం తన్నుకొస్తా వుంది. మొదట్లో పోడానికి నానా గందరగోళం చేసేవాడు. ఏడ్చేవాడు. కిందామీదా పడి పొర్లేవాడు. దొరక్కుండా పారిపోయేవాడు. ఎలాగోలా పట్టుకొనేవారు. కొట్టి, తిట్టి, బలవంతంగా ఈడ్చుకు పోయేవారు. ఏమ్చేసినా లాభం లేదని తర్వాత్తర్వాత గ్రహించాడు. అప్పన్నించీ మౌనంగా వెళ్ళడం నేర్చుకున్నాడు.
బస్సు బైల్దేరింది. ఊరు దూరం కాసాగింది. దిగులుగా కిటికీలోంచి అలాగే చూడసాగాడు. కాసేపటికి కళ్ళు మూతలు పడ్డాయి. నాన్న లేపుతుంటే మెలకువొచ్చింది. బస్సు కర్నూల్‌ బస్టాండులో ఆగి వుంది. ఆటో మాట్లాడుకొని వూరి బైటున్న స్కూలుకి చేరారు. తండ్రి ఆఫీస్‌ రూమ్లో ఫీజులు కట్టాడు. వాళ్ళ సంరక్షణలో మురళిని వదిలి వెళ్ళిపోతూ...
''బాగా బుద్ధిగా చదువుకో... ఇప్పున్నువ్‌ సెవెన్త్‌ క్లాస్‌. పబ్లిక్‌. మార్కులు అదిరిపోవాలి. అందరి ముందు నేను తలెత్తుకొని గర్వంగా తిర్గాలి. నీ కోసం యెంత ఖర్చు పెడ్తున్నానో చూస్తున్నావు గదా. జాగ్రత్త. అల్లరి చిల్లరిగా తిరగొద్దు. ఏదైనా కంప్లెయింటొచ్చిందనుకో... నా గురించి తెల్సుగదా... కాళ్ళూ చేతులిరగ్గొట్టి రైలు కింద పన్నబెడ్తా. ఈసారి క్లాస్‌ఫస్ట్‌ రావాలి. గుర్తుంచుకో'' అంటూ వెళ్ళిపోయాడు. మురళికి టాటా గూడా చెప్పాలనిపించలేదు. సూట్‌కేస్‌ తీసుకుని కాళ్ళీడ్చుకుంటూ హాస్టల్‌ వైపు అడుగులేయసాగాడు.
''హలో! వెనుక నుండి భుజమ్మీద చెయ్యి పడింది. తల తిప్పాడు. తన రూమ్మేట్‌. ''ఏయ్‌! హరీ! బాగున్నావా... ఎప్పుడొచ్చావ్‌'' ఆనందంగా చెయ్యి కలుపుతూ ప్రశ్నించాడు.
''నెలైందిలే... మనం లెక్కల్లో డల్‌ గదా. ఈనాకొడుకులు డబ్బుల్కోసం సమ్మర్లో ఇంప్రూవ్‌మెంట్‌ కోచింగ్‌ పెట్నారు. మా ఇంట్లో నన్ను భరించలేక ఈన్నే పడేసిపోయినారు. దొంగనాకొడుకులు'' గట్టిగా నవ్వేశాడు.
''అరెరే... ఐతే సెలవులంతా ఈన్నే వున్నావా'' మురళి సానుభూతిగా అన్నాడు. హరి తలూప్తూ ''ఐనా ఇంకెన్ని రోజుల్లే... చూస్తుండు. ఈ సారి ప్లాన్‌ కరెక్టుగా వేస్తున్నా. చచ్చినా దొరకను'' అన్నాడు.
మురళికి అంతకుముందు సంవత్సరం జరిగింది గుర్తుకొచ్చింది. ఒళ్ళు భయంతో వణికింది. ఓరోజు పొద్దున్నే హరి కడుపునొప్పంటూ పడిపోయాడు. గిలగిలా కొట్టుకోసాగాడు. ఏవేవో మందులు తెప్పించారు. తగ్గలేదు. ర్నూలుకి వార్డెన్ని తోడిచ్చి పంపారు. వార్డెన్‌ డాక్టర్తో మాట్లాడ్తున్నప్పుడు హరి నెమ్మదిగా జారుకున్నాడు. గంటలో విషయం స్కూలు సిబ్బందికి తెలిసిపోయింది. వెంటనే అలర్టయ్యారు. వేట మొదలెట్టారు. సాయంత్రం రైలెక్కబోతూ స్టేషన్లో దొరికిపోయాడు.
తర్వాత రోజు ప్రేయర్లో అందరి ముందూ విపరీతంగా కొట్టారు. రెండు చేతులూ విరిచి కట్టి గ్రౌండ్లో అందరికీ కనబడేటట్లు సాయంత్రం వరకు ఉంచారు. వారం రోజులు గదిలో ఒక్కన్నే బందీ చేశారు. యెంత చేసినా హరి చెక్కుచెదరలేదు. ఏడ్చలేదు. కొడ్తుంటే వాళ్ళ వంకే సూటిగా చూస్తుండేవాడు. ఆ కళ్ళలో కోపం, అసహ్యం, కసి, నిర్లక్ష్యం ఉట్టిపడేవి.
క్లాసులో విపరీతంగా అల్లరి చేసేవాడు. గోడల మీద ఏవేవో రాసేవాడు. టీచర్లను లెక్కజేసేవాడు కాదు. తోటి పిల్లలతో ఎప్పుడూ గొడవలు పెట్టుకొనేవాడు. అందరూ వాన్ని తిట్టేవారు. మొద్దబ్బాయని ఎగతాళి చేసేవారు. కానీ మురళికి వాడు ఓ హీరోలా కన్పించేవాడు. ఇద్దరూ ప్రాణస్నేహితులయ్యారు. కలిసి తిరిగేవారు. ఆడుకునేవారు. మనసు విప్పి మాట్లాడుకొనేవారు.
''యేందిరా ఆలోచిస్తున్నావ్‌'' హరి ప్రశ్నతో మురళి ఈ లోకంలోకొచ్చాడు. ఇద్దరూ మాట్లాడుకొంటూ గదికి చేరుకున్నారు. తరువాత రోజు నుండి యాంత్రిక జీవితం ప్రారంభమైంది.
**************************
ఓ రోజు మధ్యాహ్నం భోజనం ముగించి ఇద్దరూ గదికి చేరుకున్నారు. మురళి అలసటగా మంచమ్మీద వాలిపోయాడు. హరి వాని పక్కన కూర్చోని ''రేయ్‌! నిన్న రాత్రి మంచి బొమ్మేశాను తెల్సా'' అన్నాడు. మురళి లేచి కూర్చుంటూ ''యేదీ... చూపియ్‌... చూపియ్‌'' ఆసక్తిగా అడిగాడు.
హరి తలుపులు మూసి గడేశాడు. బుక్కుల కింద జాగ్రత్తగా దాచిన బొమ్మన్తీస్కొచ్చి మంచమ్మీద పరిచాడు. మురళి ఆత్రంగా దానొంక చూశాడు. అందులో ఒకడు నేల మీద వెల్లకిలా పడుకున్నాడు. దాదాపు నలభైయేళ్ళుంటాయి. వాని గుండెల మీద చిన్న పిల్లవాడు కూర్చోని గొంతు పిసుకుతున్నాడు.
బొమ్మను పరిశీలనగా చూస్తున్న మురళితో ''ఆ కిందున్నోడెవడో కనుక్కో చూద్దాం'' అన్నాడు హరి.''మన హెడ్మాస్టర్‌'' మురళి ఠక్కున సమాధానమిచ్చాడు. కాదన్నట్టు హరి తలడ్డంగా ఊపాడు. మురళి ఒక్క క్షణమాలోచించి ''మన వార్డెన్‌. కరెక్టేనా'' అన్నాడు. హరి పెదవి విరిచాడు. మురళి దీర్ఘంగా ఆలోచించసాగాడు. ఎవరో అర్థంకాక ''నువ్వే చెప్పురా'' అన్నాడు. హరి అదిగూడా తెలీదా అన్నట్లుగా చూసి ''మా నాన్న'' అన్నాడు ఫక్కున నవ్వుతూ. మురళి నవ్వుతున్న హరి వంక అలాగే చూశాడు. కళ్ళూ కళ్ళూ కలిశాయి. కాసేపటికి మురళి పెదాల మీద కూడా చిరునవ్వు చేరింది. హరి భుజమ్మీద చేయేసి ''మీ నాన్నేగాదు. మానాన్న గూడా'' అన్నాడు. నవ్వులతో గది మార్మ్రోగింది.
**************************
హరి ప్రతిరోజూ ఏవేవో పక్షుల ఈకలు తెచ్చి గదిలో దాచిపెట్టసాగాడు. గూళ్ళలో, పుస్తకాలలో, మంచం కింద... ఎక్కడ చూసినా ఈకలు నిండిపోసాగాయి. మురళికేమీ అర్థం కాలేదు. ''ఎందుకురా ఇవన్నీ'' చాలాసార్లడిగాడు. ''చెబ్తాలేరా... ఇప్పుడుగాదు'' హరి ప్రతిసారీ దాటవేయసాగాడు.
ఓరోజు అర్ధరాత్రి తడుతుంటే మురళికి మెలకువొచ్చింది. 
ఎదురుగా హరి.... ''ష్‌''... అంటూ చేయి పట్టుకొని ''నాతోరా'' అన్నాడు. నిశ్శబ్దంగా తలుపు తెరిచాడు. కారిడార్లో ఎవరూ లేరు. మురళి చేయి పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ మెట్ల వద్దకు చేరుకున్నాడు. ఒకొక్క అంతస్తూ ఎక్కుతూ డాబా మీదకు చేరుకున్నారు. అమావాస్య. చీకటిగా ఉంది. దూరం నుండి బార్లైట్‌ వెలుగు మసకమసకగా ప్రసరిస్తోంది. మురళికి అంతా అయోమయంగా వుంది.
''ఒక్క నిముషం'' అంటూ ఓ పెద్ద బండచాటు నుంచి ఏవో తీసుకువచ్చాడు. ధగ ధగా మెరిసిపోతున్నాయి. పరిశీలనగా చూశాడు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దగయ్యాయి. రెక్కలు... అందమైన రంగురంగుల ఈకలతో... మనోహరమైన రెక్కలు. ''ఎందుకివి'' మురళి ఆత్రంగా ప్రశ్నించాడు.
హరి మిలమిలలాడే కళ్ళతో, వాటిని ఆప్యాయంగా నిమురుతూ ''ఎగిరిపోడానికి'' అన్నాడు.
''ఎగిరిపోవచ్చా'' మురళి కళ్ళలో ఆశ్చర్యం. హరి ఔనన్నట్లుగా తలూప్తూ
''ఈ రెక్కల గురించి నీకింతవరకు చెప్పలేదు గదూ... నాక్కూడా మొన్న వేసవి సెలవుల్లోనే తెలిసింది. మా ముందింట్లో ఇమ్మానియేలని ఒకడున్నాడ్లే. వాడు నేర్పాడు వీటినెలా చేయాలో. ఇక్కడ మంచి ఈకలు దొరకలేదుగానీ... ఇంటి దగ్గర యెంత అద్భుతంగా తయార్చేశానో తెల్సా. రంగురంగుల చిన్నిచిన్ని పక్షుల ఈకలతో... మధ్యన కాంతులీనే మనోహరమైన నెమలిపింఛాలతో... అబ్బ... చెప్పలేను. చూచి తీరాల్సిందే. రెండు భుజాలకూ కట్టుకొన్నాను. ఒక్క మాటున గాలిపటంలా రివ్వున పైకెగిరా... అలా అలా గాలిలో తేలిపోతూ... పైకి పైపైకి... నల్లని మబ్బుల్లోకి... చెట్లు, బిల్డింగులు, రైళ్ళు... చిన్నగా... మరింత చిన్నగా... ఆటబొమ్మల్లా...
దూరంగా... తెల్లని మంచుపర్వతం. చల్లని గాలి. సువాసనలు వెదజల్లుతున్న రంగు రంగుల పూలు. విశాలమైన పచ్చనిచెట్లు. మనోహరమైన పక్షులు. కొండ మీంచి జలజలా దూకుతున్న సెలయేళ్ళు... వాటి మధ్య... ఎక్కడ చూసినా... యెటు చూసినా.. పిల్లలు... చిన్నచిన్న పిల్లలు. మనీడు పిల్లలు. చిన్న చిన్న రెక్కలతో... నవ్వుతూ, తుళ్ళుతూ, ఎగురుతూ... నన్ను చూసి చిరునవ్వులు చిందించారు. కేరింతలు కొట్టారు. తమలోకి ఆహ్వానం పలికారు.
అక్కడ నాన్నల్లేరు. అమ్మల్లేరు. టీచర్లు లేరు. భోజనం గంటల్లేవు. ప్రార్థన పిలుపుల్లేవు. బలవంతపు చదువుల్లేవు... బూట్లు లేవు. టక్కుల్లేవు. టైలు లేవు... అరుపులు, తిట్లు, తన్నులు అస్సల్లేవు. మన కోసం. మనలాంటి బాలల కోసం దేవుడెంతో శ్రమించీ, శ్రమించీ సృష్టించిన అద్భుతలోకమది.
మేము నీళ్ళలో చేపలమయ్యాం. చెట్లలో కోతులమయ్యాం. ఆకాశంలో పక్షులమయ్యాం. కోయిలలమయ్యాం. లేగదూడలమయ్యాం. కుక్కపిల్లలమయ్యాం... మా కోసం చెట్లు పండ్లిచ్చాయి. పూలు తేనిచ్చాయి. చెరువులు నీళ్ళిచ్చాయి... ఎండ వెన్నెలైంది. ముళ్ళు పూలయ్యాయి. రాళ్ళు రబ్బరు ముక్కలయినాయి... చినిగిన అంగీలతో, రేగిన జుట్టుతో, మట్టి కొట్టుకున్న ఒంటితో... ఎగిరాం. ఎగిరి దుంకాం. కిందపడ్డాం. లేచాం. కొట్టుకున్నాం. దొబ్బుకున్నాం. మమ్మల్ని చూసి చెట్లు నవ్వాయి. పువ్వులు నవ్వాయి. కొండలు నవ్వాయి.
చీకటి ఎప్పుడౌతుందో తెలీదు. చందమామ ఎప్పుడొస్తాడో తెలీదు. గంటలు క్షణాలయ్యేవి. కళ్ళు మూసి తెరచినట్టుగా ఉండేది. కలలాగా ఉండేది. టాటాలు చెప్పుకుంటూ, రేపటి గురించి కలలు కంటూ, వీడ్కోలు తీసుకునేవాళ్ళం. సూర్యోదయం కోసం ఆతృతగా ఎదురుచూసేవాన్ని. మళ్ళా పొద్దున్నే... రెట్టించిన ఉత్సాహంతో... అమ్మా నాన్నా బైటికిపోగానే... ఎగురుతా, వురుకుతా వాళ్ళలో కలసిపోయేవాన్ని. కానీ...'' హరి చెప్పడం ఆపేశాడు. కళ్ళు వర్షించే మేఘాలయ్యాయి. గొంతు వణికింది.
''ఏమైంది... తర్వాతేమైంది'' మురళి కుదుపుతూ ప్రశ్నించాడు. కన్నీళ్ళు తుడుచుకుంటూ హరి కొనసాగించాడు.
''ఎలా తెలిసిందో అమ్మానాన్నలకు. తిట్టలేదు. కొట్టలేదు. ప్రశ్నించలేదు. ఎప్పట్లాగే ఓరోజు ఇద్దరూ ఉద్యోగానికెళ్ళగానే పరుగు పరుగున గదిలోకి చేరుకున్నా. మంచం కింద రెక్కలు కనబల్లేదు. వెతికాను. ఇల్లంతా... అణువణువునా... ఏడుస్తూ... కిందా మీదా బడుతూ... ఎక్కడా... ఎక్కడా కనబల్లేదు. ఆఖరికి వంటగదిలో... పొయ్యిలో... కాలి బూడిదైపోయి...
పిచ్చివానిలా కేకలు పెట్టాను. పొర్లి పొర్లి ఏడ్చాను. తాళం వేసి వున్న తలుపుకు తల బాదుకున్నాను. శాపనార్థాలు పెట్టాను. బూతులు తిట్టాను. ఆ తరువాతరోజే తీస్కొచ్చి నన్నిక్కడ పడేశారు.
అప్పన్నించి కన్నుమూస్తే అదే కల. చేతులు చాచి ఆహ్వానిస్తున్న స్నేహితులు. ఎలాగైనా వాళ్ళను చేరుకోవాలనుకున్నా. కాంపౌండంతా గాలించా. ఒక్కొక్క ఈకనే ఏరి దాచిపెట్టసాగా. ఇన్నాళ్ళకు రెక్కలకు సరిపడా ఈకలు దొరికాయి. నాలుగురోజులుగా రాత్రుళ్ళు మిద్దెపైన కూర్చోని దీన్ని తయారు చేశా. బాగున్నాయి కదూ'' రెక్కలను గాల్లో ఆడించాడు.
హరి మొహం చందమామలా వెలిగిపోతా వుంది. చిరునవ్వు పెదాల మీద నుండి జలపాతంలా దూకుతా ఉంది.
మురళి వంక చూస్తూ ''వస్తావా'' అన్నాడు. మురళికి వెళ్ళాలనిపించింది. ఆ కొత్తలోకాన్ని చూడాలని మనస్సు వువ్విళ్ళూరింది. కానీ ఏదో భయం... తటపటాయింపు.. విషాదవదనంతో ''ఈసారి వస్తాలే'' అన్నాడు.
హరి చిరునవ్వు నవ్వుతూ అంచు మీదికెక్కాడు. అమావాస్య. నల్లని చీకటి. స్కూలు చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ మసకమసకగా కనబడుతోంది. మురళి వంక చూశాడు. ఆప్యాయంగా చేతిని నొక్కి వదుల్తూ ''వస్తాను'' అంటూ చేయూపాడు. మురళి కన్నీళ్ళతో, నిరాశతో వీడ్కోలు చెబ్తూ చేయెత్తాడు.
హరి శక్తినంతా కూడగట్టుకోని, డాబా అంచు మీది నుండి ఒక్కుదుటున గాల్లోకెగిరాడు. అంతే... సర్రున నేల మీదకు జారిపోసాగాడు. రెక్కలు గాల్లో వేగంగా టపటపా కొట్టుకుంటున్నాయి. మురళి అదిరిపడి 'హరీ' అంటూ బిగ్గరగా అరుస్తూ, డాబా చివరకొచ్చి కిందికి తొంగి చూశాడు. చీకటిలో ఏమీ కనబల్లేదు. ఆకాశం ఎర్రగా భీతిగొల్పుతూ వుంది.

కామెంట్‌లు