అంతా మా మంచికే గదా (అద్భుత జానపద నీతి కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒకూర్లో ఒక రైతున్నాడు. ఆయన బాగా డబ్బున్నోడు. ఆయనకి ముగ్గురు కూతుళ్ళు. ఆ ముగ్గురిదీ చూడచక్కని అందం. చందమామల్లెక్క మెరిసిపోతా వుండేటోళ్ళు. నవ్వితే మల్లెపూలు కురిసినట్టుండేది. అది చూసి అందరూ “అబ్బ... ఎంత ముచ్చటగా వున్నారయ్యా నీ కూతుళ్ళు. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. పెండ్లి చేయాలనుకుంటే మాకోసారి చెప్పండి. పైసా డబ్బులు తీసుకోకుండా మా పిల్లోళ్ళకు చేసుకుంటాం" అనేటోళ్ళు. ఆ పిల్లలు గూడా చానాచానా మంచోళ్ళు. అందరికీ సాయం చేస్తా... పక్షులకూ, జంతువులకు అన్నం పెడ్తా, ఎంత వున్నా ఏమీ లేనోళ్ళ లెక్క అణిగిమణిగి వుండేటోళ్ళు. ఎవ్వరినీ పళ్ళెత్తు మాట గూడా అనేటోళ్ళు గాదు. ఎంతందంగా వున్నా కొంచం గూడా పొగరుగా మాట్లాడేటోళ్ళు కాదు. ఆ రైతు ఆ పిల్లలకి ఏది కావాలంటే అది కొనిస్తా అల్లారుముద్దుగా చూసుకునేటోడు. అట్లా కొద్ది రోజులు గడిచిపోయినాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు గదా...
ఒకరోజు ఏమయిందంటే ఆయన పెండ్లానికి పెద్ద రోగమొచ్చి అనుకోకుండా చచ్చిపోయింది. దాంతో పిల్లల్ని చూసుకునేటోళ్ళు లేక, వాళ్ళకు వండి పెట్టేలోళ్ళు లేక చానా బాధ పడసాగినాడు. దాంతో చుట్టుపక్కల వున్నోళ్ళు, బంధువులు అందరూ ఒక్కటై “ఎన్నాళ్ళిలా ఒక్కనివే బాధపడతా వుంటావు. దేవుని దగ్గర దీపం పెట్టేటోళ్ళు, బైట ముగ్గులేసేటోళ్ళు, వంటింట్లో పొయ్యి వెలిగించేటోళ్ళు లేని ఇల్లు వున్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇంకో పెండ్లి చేసుకో... నీకూ నీ పిల్లలకు అందరికీ మేలు" అని ఒకటే పోరు పెట్టినారు. దాంతో ఆయన సరేనని ఇంగో పెండ్లి చేసుకున్నాడు.
ఆ వచ్చినామె మొదట్లో ముగ్గురు పిల్లల్ని బాగానే చూసుకోనింది గానీ ఆమెకు ఒక కూతురు పుట్టినాక ప్రేమ తగ్గిపోయింది. ఆ అమ్మాయిలతో ఎప్పుడూ పనులు చేయిస్తా, చీటికీ మాటికీ నోటికొచ్చినట్టల్లా తిడతా .... అన్నం గూడా సరిగా పెట్టేది కాదు. ఎట్లాగయినా సరే ఆ అమ్మాయిల్ని ఇండ్లు వదిలి పారిపోయేలా చేయాలని చానా కష్టమైన పనులన్నీ చెబుతా వుండేది. ఒకరోజు ఆమె ముగ్గురినీ పిలిచి "పోండి... పోయి అడవిలో కట్టెలు తీసుకోని రాపోండి.
కానీ దాండ్లను కట్టడానికి తాడూ వుండగూడదు. మీ నెత్తి మీద గుడ్డా వుండగూడదు. జాగ్రత్త" అని హెచ్చరించింది. ఆ పిల్లలు అట్లా ఎట్లా తేవాల్నో అర్థం గాక అడవిలోనికి పోయి ఏడుస్తా కూచున్నారు.
అంతలో ఒక పాము వాళ్ళ దగ్గరికి వచ్చింది. “ఏం అమ్మాయిలూ... ఏమిట్లా అడవిలో కూచోని అట్లా ఏడుస్తా వున్నారు. ఏమి మీ బాధ" అనడిగింది. దానికా ముగ్గురు పిల్లలు కళ్ళల్లో నీళ్ళు కారిపోతా వుంటే వెక్కివెక్కి ఏడుస్తా "ఏం చెప్పమంటావు నాగరాజా మా బాధ... మా రెండో అమ్మ కట్టడానికి తాడు లేకుండా
మోసుకురావడానికి గుడ్డ లేకుండా కట్టెలు తీసుకోని రమ్మనింది. అట్లా ఎట్లా తేవాల్నో అర్థంగాక ఏడుస్తా వున్నాం" అని చెప్పినారు.
దానికా పాము చిరునవ్వుతో “మీరేం బాధపడకండి. మీరు కట్టెలన్నీ కొట్టుకోండి. నేను పోయి మా స్నేహితులను ఐదుమందిని పిలుచుకొని వస్తాను. ముగ్గురమేమో
మోపుకు తాడులాగా వుంటాం. మరో ముగ్గురమేమో చుట్టచుట్టుకోని మీ నెత్తి మీద గుడ్డలాగా వుంటాము" అని చెప్పి వెళ్ళిపోయింది. దాంతో ఆ ముగ్గురు అమ్మాయిలు సంబరంగా కట్టెలన్నీ విరగొట్టి కుప్పలు చేసుకున్నారు. అంతలో ఆ పాము ఇంకో అయిదు పొడవాటి పాములతో అక్కడకు చేరుకోనింది. మూడేమో మోపులకు తాడులాగా తయారయితే, మరో మూడేమో నెత్తి మీద గుడ్డలాగా చుట్ట చుట్టుకున్నాయి. ఆ అమ్మాయిలు ఆ పాములతో మోపు కట్టుకొని ఇంటికి చేరినారు. ఇంట్లో కట్టెల మోపులు దించగానే పాములు ఎక్కడివక్కడ సరసరసర వెళ్ళిపోయినాయి. సవతి తల్లి వచ్చి చూస్తే ఇంగేముంది కట్టెలన్నీ కుప్పలుగా కనిపించినాయిగానీ తాడుగానీ, బట్టగానీ ఏమీ కన్పించలేదు. దాంతో ఏమీ అనలేక వాళ్ళను లోపలికి రానిచ్చింది.
అట్లా కొంత కాలం గడిచినాక ఒకరోజు ఆ సవతితల్లి మూడు కుండలు తెచ్చి వాళ్ళకిచ్చింది. వాటి కింద పెద్ద పెద్ద కన్నాలున్నాయి. "పొండి... పోయి ఈ కుండలతో చెరువు దగ్గరనుంచి నీళ్ళు తెచ్చి ఇంట్లో గచ్చులన్నీ నింపండి. వేరే కుండలు తెచ్చినా, కన్నాలకు ఏమన్నా అతికిచ్చినా మళ్ళా ఈ ఇంట్లోకి అడుగు పెట్టనీయను జాగ్రత్త" అని హెచ్చరించింది. దాంతో ఆ అమ్మాయిలు చెరువు దగ్గరికి పోయి నీళ్ళు అట్లా ఎట్లా తావాల్నో అర్ధంగాక ఏడుస్తా కూచున్నారు. ఆ
అంతలో ఒక కప్ప ఎగురుకుంటా వాళ్ళ దగ్గరికి వచ్చింది. “ఏం అమ్మాయిలూ... ఏమిట్లా చెరువుకాడ కూచోని ఏడుస్తా వున్నారు. ఏమి మీ బాధ" అనడిగింది. దానికా ముగ్గురు పిల్లలు కళ్ళమ్మట నీళ్ళు కారిపోతా వుంటే వెక్కి వెక్కి ఏడుస్తా "ఏం చెప్పమంటావు కప్పరాజా మా బాధ... మా రెండో అమ్మ ఈ కన్నం పడిన కడవలనిచ్చి వేరే కడవలు తీసుకురాకుండా, వీటికి ఏమీ అతికియ్యకుండా నీళ్ళు తెచ్చి గచ్చు నింపమనింది. అట్లా ఎట్లా తేవాల్నో అర్ధం గాక ఏడుస్తా వున్నాం" అన్నారు.
దానికా కప్ప "మీరేమీ బాధ పడకండి. నేను పోయి మా స్నేహితుల్ని మరో ఇద్దరిని పిలుచుకోనొస్తా... మేం కడవల్లోకి పోయి రంధ్రానికి అడ్డంగా, నీళ్ళు బైటకి పోకుండా కూచుంటాం. మీరు హాయిగా కడవలతో నీళ్ళు ముంచుకోని గచ్చునంతా నింపెయ్యండి" అనింది. ఆ అమ్మాయిలు సంబరంగా సరే అన్నారు. వెంటనే ఆ కప్ప చెరువులోనికి పోయి మరో రెండు కప్పల్ని పిలుచుకోనొచ్చింది. ఆ మూడూ మూడు కడవల్లో దూరి కన్నాల కడ్డంగా కూచున్నాయి. దాంతో పిల్లలు నీళ్ళు తీసుకోనొచ్చి గచ్చునంతా నింపేసినారు. వెంటనే ఆ మూడు కప్పులూ ఎక్కడివక్కడ ఎగురుకుంటా వెళ్ళిపోయినాయి. సవతితల్లి వచ్చి చూస్తే ఇంగేముంది... గచ్చు నిండా నీళ్ళు కనిపించినాయిగానీ ఆ కడవలకడ్డంగా ఏమీ కనిపించలేదు. దాంతో ఏమీ అనలేక వాళ్ళను లోపలికి రానిచ్చింది.
అట్లా కొంతకాలం గడిచినాక ఒక రోజు ఆ సవతి తల్లి ముగ్గురినీ పొలానికి తీసుకొని పోయి మూడు బస్తాల వడ్లు ఇచ్చి వీటిని తీసుకోని పోయి ఒక్కగింజ గూడా విరగకుండా సాయంకాలానికంతా బియ్యం చేసుకోని రాండి... లేకపోతే ఈ ఇంటి గడప తొక్కకండి" అనింది. ముగ్గురూ ఆ మూడు మూటలు ముందు పెట్టుకోని అన్ని గింజలను ముక్క విరగకుండా పొట్టు ఎట్లా తీయాల్నో అర్ధంగాక ఏడుస్తా కూచున్నారు.
అంతలో ఒక పిచుక ఎగురుకుంటా వాళ్ళ దగ్గరికి వచ్చింది. "ఏం అమ్మాయిలూ... ఏమిట్లా పొలంలో కూచోని ఏడుస్తా వున్నారు. ఏమి మీ బాధ" అనడిగింది. దానికా ముగ్గురు అమ్మాయిలు కళ్ళమ్మట నీళ్ళు కారిపోతా వుంటే వెక్కి వెక్కి ఏడుస్తా "ఏం చెప్పమంటావు  పిచుక రాజా మా బాధ...  మా రెండో అమ్మ ఈ మూడు బస్తాల వడ్లు ఇచ్చి ముక్క విరగకుండా వీటన్నిటినీ సాయకాలానికంతా బియ్యంగా చేసుకోని రమ్మనింది. అట్లా ఎట్లా చేయాల్నో అర్ధం గాక ఏడుస్తా వున్నాం" అన్నారు.
దానికా పిచుక “మీరేమీ బాధ పడకండి. నేను పోయి మా స్నేహితులందర్నీ పిలుచుకోనొస్తా... ఎంతసేపు. కండ్లు మూసి తెరిచేలోగా ఒక్క వడ్లగింజ కూడా మిగలకుండా అన్నిటినీ పొట్టు తీసేస్తాం" అనింది. దాంతో ఆ అమ్మాయిలు సంబరంగా సరేనంటూ శుభ్రంగా కసువుకొట్టి వడ్లన్నీ కింద పరిచినారు. అంతలో యాడి నుంచి వచ్చినాయోగానీ ఒకటిగాదు, రెండుగాదు వందలవందల పిచుకలు కిచకిచకిచమంటా అట్లా వాలినాయి. కండ్లు మూసి తెరిచేలోగా చకచకచక ముక్క విరగకుండా పొట్టంతా వలిచి మూటల్లో వేసి వెళ్ళిపోయినాయి. దాంతో ఆ ముగ్గురు అమ్మాయిలూ మూడు మూటలు తీసుకోని ఇంటికి పోయినారు. సవతి తల్లి దాంట్లో చూస్తే ఒక వలవని గింజగానీ, విరిగిన బియ్యం ముక్కగానీ కనబడలేదు. దాంతో ఏమీ అనలేక వాళ్ళను లోపలికి రానిచ్చింది.
ఆ సవతి తల్లికి వాళ్ళను ఇంట్లోంచి ఎట్లా బైటకు తరమాల్నో అర్థం గాక ఒకరోజు ఎవరూ లేని సమయంలో మొగునితో కొట్లాట పెట్టుకోనింది. "నీవు వాళ్ళని అడవిలో వదిలిపెట్టి వస్తావా లేక నేనూ నా పిల్ల విషం తాగి చావమంటావా అని పట్టుపట్టింది. దాంతో ఆమె మొగుడు ఏమీ చేయలేక తర్వాత రోజు ముగ్గురు పిల్లలతో “అమ్మా... పక్కవూరిలో పెద్ద తిరుణాల జరుగుతావుంది. మీ చిన్నమ్మ, చిన్న చెల్లి రేపొస్తారంట. మనము ఈ రోజే పోదాం. తయారుకాండి" అని చెప్పినాడు. పాపం... ఆ ముగ్గురు అమ్మాయిలూ తిరుణాలనగానే సంబరంగా
మంచి బట్టలు కట్టుకోని, మొగానికి బొట్టు పెట్టుకోని, తల్లో పూలు తురుముకోని, కళ్ళకు కాటుక దిద్దుకోని మల్లెపూలలెక్క మెరిసిపోతా బైలుదేరినారు. వాళ్ళనాన్న ఒక పెద్ద అడవిలోనికి వాళ్ళను తీసుకోని పోయి ఒకచోట కూచోబెట్టి “మీరు ఇంటికాన్నుంచి తెచ్చుకున్న సద్ది తింటా వుండండి. ఈ పక్కనొక మంచి మాగిన మామిడికాయల చెట్టొకటి వుంది. పోయి పండ్లు పట్టుకోనాస్తా" అని పోయినాడు. అట్లా పోయినోడు మరలా వెనక్కి గూడా తిరిగి చూడకుండా "అయ్యో... పాపం... ఆడపిల్లలని" గూడా అనుకోకుండా అదే సందని ఇంటికి వెళ్ళిపోయినాడు.
పాపం... ఆ ముగ్గురు అమ్మాయిలు ఆ అడవిలో నాన్నా... నాన్నా... అంటూ ప్రతి కొమ్మా రెమ్మా వెదికినారు. భయంతో కేకలు వేసినారు. ముగ్గురూ కలసి కిందామీదా పడి ఏడ్చినారు. చీకటి పడతా వుంటే ఎప్పుడు ఏ జంతువులు వచ్చి మీద పడతాయోనని గజగజా వణికిపోసాగినారు.
అదే సమయంలో ఆ పక్కవూరికి చెందిన ముగ్గురు రాకుమారులు అడవి జంతువులను వేటాడి ఇంటికి తిరిగిపోతా వున్నారు. వాళ్ళు ఏడుస్తా వున్న ఆ ముగ్గురు అమ్మాయిల్ని చూసినారు. వాళ్ళ కథంతా విన్నారు. “అబ్బ... ఎంతందంగా వున్నారు ముగ్గురూ ముత్యాల్లెక్క... చేసుకుంటే ఇట్లాంటి చక్కని చుక్కల్నే చేసుకోవాల" అనుకోని ఆ ముగ్గురినీ వాళ్ళింటికి పిలుచుకోని పోయి పెండ్లి చేసుకున్నారు. దాంతో వాళ్ళ దశ తిరిగి హాయిగా కాలు మీద కాలేసుకోని కులాసాగా బతకసాగినారు.
ఇక్కడ వాళ్ళ నాన్న, చిన్నమ్మ వున్నారు గదా... ఆ వూళ్ళో పెద్ద కరువొచ్చింది. ఒక్క వాన చుక్కగూడా భూమి మీదకు రాలలేదు. దానికితోడు ఒకరోజు రాత్రి కొందరు దొంగలు వాళ్ళింటి మీద పడి వున్నదంతా నున్నగా పూడ్చుకోని పోయినారు. ఒకవైపు డబ్బుల్లేక, మరొక వైపు పంటల్లేక వాళ్ళు వీధిన పడినారు. ఆ వూరిలో బతకలేక వేరే వూర్లలో తినడానికి తిండి లేక ఆడుక్కోసాగినారు.
అట్లా ఒకొక్క వూళ్ళో అడుక్కుంటా అడుక్కుంటా ఒకరోజు ఈ ముగ్గురూ వున్న వూరొచ్చినారు. వాళ్ళు అట్లా అడుక్కుంటా వుంటే మిద్దె మీది నుంచి ముగ్గురూ చూసి "అయ్యో.... మన నాన్నా, చిన్నమ్మా, చిన్న చెల్లెలే గదా" అని వురుక్కుంటా వచ్చి కళ్ళనీళ్ళు బెట్టుకున్నారు. వాళ్ళని చూసిన చిన్నమ్మ "మిమ్మల్ని బాధ పెట్టినందుకేనమ్మా మాకీ కష్టాలు. మంచి వాళ్ళని బాధపెట్టి బాగుపన్నవాళ్ళు ఈ లోకంలో ఎవరూ వుండరు" అంటూ భోరున ఏడ్చింది. "అయ్యయ్యో... అంతమాట అనకమ్మా... మీరు ఆ రోజు అట్లా చేయబట్టేగదా... మాకీరోజు ఇన్ని భోగభాగ్యాలు, అంతా మా మంచికే జరిగింది" అంటూ అందర్నీ ఇంటికి పిలుచుకోనొచ్చినారు. వాళ్ళ మొగుళ్ళకు చెప్పి మోయలేనంత బంగారమిచ్చి పసుపూకుంకుమలతో పంపిచ్చినారు.
కామెంట్‌లు