*అత్తా నలుగురు కోడళ్ళు (సరదా జానపద నీతి కథ)* - డా.ఎం.హరికిషన్ - కర్నూలు -9441032212

  ఒకూర్లో ఒక ముసలామె వుండేది. ఆమె చానా మంచిది. ఆ ముసలామెకి నలుగురు కోడళ్ళున్నారు. కోడళ్ళకేమో అత్తంటే అస్సలు పడదు. ఇంట్లో ఏమన్నా పిండివంటలు చేసుకుంటే అత్తకు కూడా పెట్టాల గదా.... అందుకని ఆమె వున్నప్పుడు ఎవరూ ఏమీ చేసుకునేటోళ్ళు కాదు. ఐతే అత్త ఎప్పుడన్నా ఏదన్నా పనిబడి ఏదైనా వూరికి పోయిందంటే చాలు... ఎవరికిష్టమైనవి వాళ్ళు కొనుకొక్కొచ్చుకునేటోళ్ళు. రకరకాల పిండివంటలు చేసుకునేటోళ్ళు. అత్త వచ్చేలోపల అన్నీ నున్నగా తినేసి, శుభ్రంగా గిన్నెలు కడిగేసి ఎమీ ఎరుగని నంగనాచుల్లెక్క గమ్మున ఉండేటోళ్ళు. అత్తకు మాత్రం కొంచంగూడా అస్సలు పెట్టేటోళ్ళు కాదు. నెమ్మదిగా అత్తకు విషయం అర్థమైంది. ఎట్లాగయినా సరే కోడళ్ళకు బుద్ధి చెప్పాలని ఒక ఉపాయం ఆలోచించింది.
ఒకరోజు పొద్దున్నే అత్త పెట్టె తీసుకోని కోడళ్ళందరినీ పిలిచి "నాక్కొంచెం పనుంది. మా అన్నోళ్ళు వూరికి పోతా వున్నా... మళ్ళీ రేపు పొద్దునొస్తా" అని చెప్పి పెట్టె తీసుకోని బైలుదేరింది. అట్లా కొంచం దూరం పోయినట్లే పోయి ఎవరూ చూడకుండా మళ్ళీ వెనక్కు తిరిగొచ్చి ఇంటి వెనుకవైపు నుండి లోపలికి దూరింది. ఎవరి కంటా వడకుండా జాగ్రత్తగా మచ్చు ఎక్కి పైన కూచోని ఇంట్లో ఏం జరుగుతుందో అంతా చూడసాగింది.
ఇదంతా కోడళ్లకు తెలీదు గదా... దాంతో వాళ్ళకు పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. మొదటి కోడలేమో కొత్తకోక కట్టుకోని సంతకు పోయి పెద్ద పెద్ద బెల్లం చెరుకులు కొనుక్కొచ్చుకుంది. రెండో కోడలేమో బాగా బెల్లమేసి తియ్యతియ్యని బచ్చాలు చేట నిండా చేసుకోనింది. మూడో కోడలేమో బాగా ఘుమఘుమలాడేటట్లు నెయ్యేసి గోధుమ పాయసం గిన్నె నిండా వండుకోనింది. నాలుగో కోడలేమో వూర్లో నేరేడు పండ్లు అమ్ముతా వుంటే పోయి లావులావువి బాగా మాగినేవి కొనుక్కొచ్చుకోనింది.
అత్త మచ్చు పైనుంది గదా.... ఎవరెవరు ఏమేమి కొంటా వున్నారు... ఏమేమి చేసుకుంటా వున్నారు... ఎక్కడెక్కడ పెడతా వున్నారు... అన్నీ బాగా చూసింది. నెమ్మదిగా ఎవరి కంటా పడకుండా మచ్చు దిగి వెనుక తలుపు తెరుచుకోని బైటకి వెళ్ళి పోయింది. కాసేపటికి పెట్టె చేత్తో పట్టుకోని ముందువైపు నుంచి ఇంట్లోకొచ్చింది. అత్తను చూస్తానే అందరూ అదిరిపడ్డారు. "అదేందబ్బా... రేపటి వరకూ రానని అప్పుడే వచ్చేసిందీ దొంగ సచ్చినేది" అని లోపల్లోపల తిట్టుకుంటా.... "ఏమత్తా... ఇప్పుడే గదా పోయింది... మళ్ళీ అప్పుడే తిరిగొచ్చేసినావు.... ఏమైంది. ఏమైనా మర్చిపోయినావా" అనడిగినారు. అత్త అందరి వంకా చూస్తా "ఏం చెయ్యమంటారు చెప్పండి. నేను పోతా వుంటే దారిలో ఒక పెద్ద నాగుబాము పడగ విప్పుకోని ఎదురొచ్చింది. దాంతో భయపడి తిరిగొస్తి" అనింది.
పెద్ద పాము కనబడిందని చెప్పగానే అందరికీ ఆసక్తి మొదలయింది. మొదటి కోడలు పామెంతుందో కనుక్కుందామని “అత్తా... అత్తా... ఎంత పెద్దగుందత్తా పాము" అనడిగింది. వెంటనే ముసల్ది “నువ్వు సంతలో బెల్లం చెరుకు కొనలా.... దానంత పొడవుంది" అనింది. అంతే కోడలు అదిరిపడి గమ్మున నోర్మూసుకొనింది. అంతలో రెండో కోడలు "అత్తా.... అత్తా... దాని పడగ ఎంతుందత్తా" అనడిగింది. ముసల్ది నవ్వుతా "సువ్వు చేటలో బచ్చాలు చేసి గూట్లో దాచి పెట్టినావు గదా... అచ్చం ఆ బచ్చమంత ఉంది" అనింది. అంతే రెండో కోడలు మారు మాట్లాడకుండా నోరు మూసుకోనింది.
అంతలో మూడో కోడలు "అత్తా... అత్తా... దాని ఒల్లు ఏ రంగులో వుందత్తా" అనడిగింది. వెంటనే ఆ ముసల్ది నువ్వు గోధుమ పాయసం వండు కొన్నావు గదా... అచ్చం అ పాయసం రంగుంది" అనింది. "నేను పాయసం చేసుకున్నది ఈ అత్తకెట్లా తెలిసిందబ్బా" అని ఆశ్చర్యపోతా మూడో కోడలు గమ్మున నోరు మూసుకొంది. అంతలో నాలుగో కోడలు "అత్తా... అత్తా... దాని కనుగుడ్లు, ఎంత లావున్నాయత్త" అనడిగింది. వెంటనే ఆ ముసల్ది "నువ్వు గూట్లో దాచి పెట్టినావు చూడు... ఆ నేరేడు పండ్లంత లావున్నాయి" అనింది.
దాంతో ఆ నలుగురు కోడళ్ళకు తాము ఏమేం కొనుక్కున్నది... ఏమేం చేసుకున్నది... ఎక్కడెక్కడ దాచిపెట్టింది... అన్నీ అత్తకు తెలిసిపోయాయని అర్ధమయింది. "అత్తేదో అమాయకురాలు అనుకుంటిమి గానీ పెద్ద అసాధ్యురాలు" అనుకోని అందరూ ఆమె కాళ్ళ మీద క్షమించామని పడ్డారు. అప్పటి నుంచీ తాము ఏమి చేసుకున్నా అత్తకు ముందు పెట్టి తాము తినేటోళ్లు.
కామెంట్‌లు