*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౯౭ - 97)

 మత్తేభము:
*పదివేలైనను లోకకంటకులవే | ప్రాప్తించు సౌఖ్యంబు నా*
*మదికిన్ పథ్యముగాదు సర్వమునకున్ | మధ్యస్థుడై సత్య దా*
*న దయాదుల్గల రాజు నాకొసగు మే | నవ్వానినీయట్ల చూ*
*చి దినంబున్ముద మొందుదున్ కడపటన్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
 ప్రజలను ఇబ్బందులు పెట్టే రాజు, నాకు/మాకు ఒక్కొక్కరికీ పదివేల వరహాలు ఇచ్చినా నాకు/మాకు మనస్సులో సంతోషముగా వుండదు.  అందరి ప్రజలను, అన్ని మతములను సమానంగా చూసుకుంటూ, ధర్మం చూపిన దారిలో వుంటూ, నిజమే మాట్లాడుతూ, దాన గుణమూ, దయాగుణముతో ప్రజలను చక్కగా పాలించే రాజును మాకు ఇవ్వు, పరమేశా.  ఇటువంటి మంచి రాజు మాకు వుంటే, నువ్వే రాజులా వచ్చావు అనుకుని ఆ రాజులో నిన్ను చూసుకుంటూ సంతోషంగా బ్రతికేస్తాము చివరి వరకు.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*ప్రజా కంటకులైన కంస, త్రిపురాసుర, జరాసంధ మొదలుగా గల రాజుల వల్ల సంప్రాప్తించే సకల సంపదలూ ఏవిధముగానూ మానసిక ఆనందమును ఈయవు. పైగా, ఎప్పుడు వచ్చి మీద పడతారో అని ఆందోళనను కలిగిస్తారు. పెంచుతారు.  అలా కాకుండా, ఒక శిబి, ఒక ప్రహ్లాద, ఒక శ్రీరాముని వంటి రాజు పాలనలో మానసిక ఆనందంతో ఎంతో హాయిగా, సౌఖ్యంగా బ్రతుకు సాగదీయ వచ్చు. తన ప్రజల కష్టాలను, బాధలను తనవిగా అనుకునే రాజు వుంటే, ఆ దేశ, ప్రాంత ప్రజలు నిన్ను పొందినంత శాస్వత ఆనందాన్ని పొందుతారు కదా, కాత్యానీపతీ! నిన్ను పూజించి, నీ ధ్యన్నంలో వున్నప్పుడు కలిగే సౌఖ్యం, రాజు సేవలో లభిస్తే అంతకంటే ప్రజలకు కావలసింది ఏముంటుంది. అంత్యకాలంలో నీ దరికిజేరే దారి చూపించే ఆ రాజు నీ ప్రతినిధే అవుతాడు కదా, వ్యుప్తకేశా! నిన్న మించిన దైవం, నిన్ను మించిన రాజు లేడు, లేడు. ఇది నిజం. నిజం. ముమ్మాటికి నిజం, ముగురమ్మల మూలమూర్తీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు