*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౯౮ - 98)

 శార్దూలము:
*తాతల్ తల్లియుతండ్రియున్ మరియు బె | ద్దల్చావగా చూడరో*
*భీతిం బొందంగ నేల చావునకుగా | పెండ్లాము బిడ్డల్హిత*
*వ్రాతంబు ల్తిలకింప, జంతువులకు | న్వాలాయమైయుండగా*
*చేతోవీధి నరుండు నిన్గొలవడో |  శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
 మనుషులు చావు వస్తుంది అంటే ఎందుకు భయపడుతారో తెలియదు.  మన ముత్తాతలు, అవ్వలు, తాతలు, నాన్నమ్మలు, అమ్మమలు, తండ్రులు తల్లులు చనిపోవడం మనం చూసాము కదా. ఇది మనకు తెలిసిన విషయమే.  పోనీ మనం కానీ, మన భార్యా, పిల్లలు, స్నేహితులు, మన మంచి కోరేవారు వీరందరూ శాస్వతంగా వుంటారా. వీరెవరికి చావు రాదా. వీరు అమరులా.  చావును ఎవరూ ఆపలేరు, ఒక్క నీవు తప్ప, అని ఎందుకు తెలుసుకోరు ప్రజలు.  నిన్ను పూజిస్తే చావును కాదు దేనినైనా ఆపవచ్చు అని ఒప్పుకోరెందుకో.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*మార్కండేయ చరిత్ర ఒగ్గు కథగా చెప్పుకుంటాము.  హరి కథగా చెప్పుకుంటాము.  కానీ, నిన్ను ఒప్పుకుని, నీ పూజ నిత్యమూ చేసుకుంటే మరణాన్ని జయించి, నక్షత్రం లాగా శాస్వతత్వం పొందవచ్చు కదా, ఈశానేశా!  మా మనుషులు మాత్రం, ఏమీ చేయ లేని నరపతుల చుట్టూ తిరుగుతూ సమయాలాన చేస్తుంటారు.  ఈ రాజులూ, మంత్రులూ వారి ఇబ్బందులనే వారు తొలగించుకోలేని అశక్తులు.  వేరొకరి కష్టాలు ఎలా తొలగించ గలరు.  ఇప్పటికైనా, మా ప్రజలు నీవే కల్పించిన భ్రమ లనుండి నీ సహాయం తోనే బయట పడి, నీ పాదార్చన వదలక చేసే బుద్ది నీవే కలిగించాలి, పన్నగేశా !*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు