*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౯౯ - 99)

 శార్దూలము:
*జాతుల్సెప్పుట, సేవచేయుట మృషల్ | సంధించుట న్యాయాప*
*ఖ్యాతింబొందుట, కొండెగాడవుట, హిం | సారంభకుండౌట, మి*
*థ్యాతాత్పర్యము లాడుటన్నియు పర | ద్రవ్యంబు నాశించి, యా*
*శ్రీతా నెన్ని యుగంబులుండగలదో |   శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
 మా మనుషులు జాతకాలు చెప్పించుకుంటారు.  ఎదుటి వారి మీద చాడీలు చెపుతారు.  అబద్దాలు అడుతారు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టడానికి, అవసరమనిపిస్తే కొట్టడానికి కూడా తయారు అవుతారు.  వున్నవీ లేనివీ కలిపించి చెప్తారు.  ఇవన్నీ కూడా ఎదుటి వారి వద్ద వున్న డబ్బును తనకు కావాలి అని, తను సొంతం చేసుకోవాలి అని చేసే పనులు.  ఇలా కానీ ఏ విధంగా అయినా కానీ సంపాదించుకున్న డబ్బు మన దగ్గర ఎంత కాలం వుంటుంది. శాస్వతంగా అయితే వుండదు కదా!  మనిషి జీవితమే శాస్వతము కానప్పుడు డబ్బు శాస్వతంగా వుండి మాత్రము వుపయోగము ఏమిటి.....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*"ధనమూలం ఇదం జగత్" అన్నారు కదా పెద్ద వాళ్లు.  ఈ నానుడి రావడానికి కారణం మనిషి ప్రవర్తనే.   మనసు లేని మనుషులు సంచరించే ఈ  భూ ప్రపంచంలో, ఐహిక సుఖాలను ఇచ్చే ధన సముపార్జన మీదే మక్కువ ఎక్కువ. సామ, దాన, బేధ, దండోపాయలు వుపయోగించి అయినా సరే అవసరానికి మించిన ధనాన్ని సముపార్జించాలి.  ధనలక్ష్మి చంచల అని తెలుసి కూడా ఆమె మీద వుండే దురభిమానంతో అశాస్వతమైన ఆ డబ్బునే కోరుకుంటాము.  పరమేశ్వర మాయ ఆ స్థాయిలో మన మీద పనిచేస్తోంది.  అందువలన, నిత్యము, శాస్వతము, స్థిరము అయిన పరమేశ్వర పాదలు పట్టుకుని, ఆయన ధ్యానంలో వుండే అవకాశాన్ని కల్పించమని ఆయననే ప్రార్థించాలి.  పరామాత్మని కృపతో ఆయనలో చేరే ప్రయత్నం చేయాలి. ఇది సత్యం. ఇదే నిత్యం.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు