తొలి గురువు సత్తయ్య సార్!:-- దోర్బల బాలశేఖరశర్మ

 మా రామాయంపేటలో అయిదేళ్ల వయసు (1966) లో నాకు అక్షర శ్రీకారం చేయించి, తన ప్రైవేట్ బడిలో ఓనమాలు దిద్దించింది దివంగత కీ.శే. అయ్యవారి సత్తయ్య పంతులు.  ఈ అరవై ఏళ్ల వయసులో ఇంకా సాగుతున్న నా జ్ఞానోపాసనకు అసలు పునాది అక్కడే, ఆయన వల్లే పడింది. అమ్మానాన్నల తర్వాత నాకు విద్యాగంధం అద్దిన ఆ తొలి గురువును నేనెప్పటికీ మరిచిపోలేను.

నల్ల పలకపై బలపంతో 'అ ఆ' లు దిద్దుకున్న ఆనాటి రోజులు నాకిప్పటికీ బాగా గుర్తు. 'సత్తయ్య సార్ స్కూల్' మా ఇంటికి దగ్గర్లోని మార్కెట్ కు అవతల వుండేది. అక్కడ అరవై, డెబ్బై మంది వరకైనా పిల్లలు వుండేవారు. మొదట్లో సత్తయ్య సార్ అంటే నేను భయపడినా తర్వాత దాని స్థానంలో భక్తి, శ్రద్ద వచ్చాయి. పొద్దుటి నుంచి మధ్యాహ్నం ఒటిగంట దాకా, తర్వాత రెండింటి నుంచి నాలుగింటి వరకు స్కూల్ వుండేది. పిల్లలంతా ఓనమాలు గట్టిగా పైకి వినపడేలా అంటూ దిద్దేవారు. పిల్లల అక్షరాల అరుపులు ఆ ఆవరణంతా వినపడేవి. 
ఈ స్కూలులో రెండేళ్లు (1966-68) చదివాను. అ, ఆ లనుండి రౌతి (బండి ర) వరకూ 56 అక్షరాలు వచ్చాక, ఒత్తులు, గుణింతాలు, తర్వాత ఒక్కట్లు (అంకెలు), ఎక్కాలు (20 వరకు), చిన్న చిన్న లెక్కలు, నీతి భక్తి పద్యాలు చదివింప చేసేవారు. అన్నీ నోటికి కంఠస్థం అయ్యేవరకూ చదవాల్సిందే. మధ్యాహ్నం మూడున్నర అయిందంటే చాలు, త్వరగా 'ఇరవై ఎక్కాలు' చదివేసి ఇళ్ళకు వెళ్లిపోవచ్చునన్న ఆనందం అందరిలో వుండేది. ఇరవై ఎక్కాలు నోటికి వచ్చిన వాళ్ళలో ఎవరో ఒకరిని లేచి నిలబడి అందరికీ చెప్పమనే వారు సారు. 'ఒక్కెక్కం ఒకటి, ఒక రెండు రెండు...' అని అతను చెబుతుంటే పిల్లలందరూ బిగ్గరగా అనేవారు. కంఠస్థం చేయించే విధానమిది. నేనూ అలా నిలబడి ఎన్నోసార్లు ఎక్కాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి  
దసరా పండుగకు ముందే ఒకరోజు సారు మా పిల్లలందరినీ ఊరేగింపుగా అందరి ఇళ్ళకు తిప్పేవారు. ఎవరి ఇంట్లో వాళ్ళ పిల్లలచేత తాము నేర్చిన పద్యాలు కంఠతా చెప్పించేవారు. 'అయ్యవారికి చాలు అయిదు వరహాలు, పిల్లలకు చాలు పప్పు బెల్లాలు, జయీ భవ, విజయీ భవ!' అని చదివేవాళ్ళం. ఇది తల్లితండ్రులకు గొప్ప తృప్తినిచ్చేది. నిజంగా అప్పుడు చదువంటే ఎంత భయమో, అంత భక్తీ (ఇష్టం) చాలామంది పిల్లల్లో వుండేది. ఇలా రెండేళ్ల తర్వాత, నా ఏడేళ్ల వయసులో బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూలులో చేర్పించారు. నేనే కాదు, చిన్నతనంలో ప్రాథమిక విద్యకు ముందు, ఎవరైనా చదివేది రెండేళ్ళే అయినా తదనంతర  చదువులకు ఆ శ్రద్ధాసక్తులు వేసే పునాది అత్యంత అమూల్యమంది.

కామెంట్‌లు