అసలు గురువు:- రామ్మోహన్ రావు తుమ్మూరి

 అక్షరాలు ఆంతర్యంలోకి ఎలా దూరాయో
అక్షర ప్రస్తారాలు
అర్థవంతమైన పదాలై
అనుభవం లోకి ఎప్పుడు 
ఏ ఘడియలో వచ్చాయో
కనులు చూచిన దాన్ని
చెవులు విన్న దాన్ని
నాసిక వాసన గ్రహించిన దాన్ని
రసన రసాస్వాదన చేసిన దాన్ని
శరీరం తాకిన దాన్ని
మస్తిష్కం ఎలా ఎప్పుడు 
భద్రపరిచిందో
ఆకళింపును అనువదించి
మాటల ఊటలుగా
గొంతుక ఎన్నడు బయట పెట్టిందో
అప్పటికి అయిదేళ్లు వచ్చుంటాయి
పలకా బలపం రెండు చేతుల్నీ 
ఆక్రమించాయి
నలుపును తెలుపు చేయడం
ఎడతెగని  అలుపెరుగని పని 
అదే ఆట అదే పాట కొన్నాళ్లు
పదేళ్లు వచ్చాయి
పలకా బలపాలు తమ్ముళ్ల పాలయ్యాయి
ఇక తెలుపును నలుపు చేసే
కాగితం కలం చేతులకు చిక్కాయి
అలా ఇరవయ్యేళ్ల దాకా
తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు పయనం
బాల్యాన్ని కౌమారం 
కౌమారాన్ని యౌవనం ఆవరించాయి
చదువు బతుకు వైపుకు చూసింది
మెదడు కూడబెట్టిన తెలివి
కూడుకోసం  తోడుకోసం గూడుకోసం
అని తెలిసింది 
రాసే చేతులు  మోసే చేతులయ్యాయి
జీవితమనే కొత్త చదువుకు 
అనుభవాలు ఆరాటపోరాటాలయ్యాయి
జీవనవిద్య అంటే 
మనుషుల్ని చదవటం 
మనుషుల్ని కొలవటం 
అదివరకు తరగతుల్లో నెలకో మూణ్నెల్లకో 
ఆర్నెల్లకో ఏడాదికో పరీక్షలుండేవి
జీవితపాఠశాలలో 
అడుగడుగునా పాఠాలే 
క్షణక్షణం పరీక్షలే 
బడి చదువులకైతే పట్టాలు వస్తాయి
జీవితం బడిలో కష్టాలు వస్తాయి
ఎక్కడానికి ఎదురుగా నిచ్చెనలు నిలుస్తాయి
అప్పుడు నీలోని నువ్వు విద్యార్థి వౌతావు
చిన్నప్పుడు చెవినులిమి తొడపాశం పెట్టే గురువులుంటే
ఇక్కడ సవాళ్లు విసిరే అవసరాలు ఆశలు ఆశయాలు
చిన్నప్పటి అనుభవం 
నలుపును తెలుపు చేయడం 
తెలుపును నలుపు చేయడం
ఇక్కడ నిన్ను కొత్తగా పలుకరిస్తాయి
అవి నిన్ను మనిషి యంత్రంగానో 
యంత్రపు మనిషిగానో మారుస్తాయి
నీచే బతుకు బండి లాగిస్తాయి
అప్పుడ కాలం 
నీకు రోజుకో పాఠం చెబుతూ 
నిన్ను నిత్యవిద్యార్థిగా దీవిస్తుంది
కాలం అసలైన గురువు
కాలమా! నీకు గురువందనం.
                  _(||)_
సెప్టెంబరు 5, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా
కామెంట్‌లు