విశ్వాస జంతువు : -- యామిజాల జగదీశ్
 మనిషి ఎంతో ప్రేమతో పెంచే ప్రాణి శునకం. కారణం అది విశ్వాసంగా ఉంటుందని. ఈ ప్రాణి విశ్వాసానికి మారుపేరు. ఈరోజు అనేక ఇళ్ళల్లో కుక్కలను పెంచడం చూస్తూనే ఉంటాం. కుక్కలను పెంచేవారు అవి తమను దొంగల నుంచి కాపాడుతుందని నమ్ముతారు. అటువంటి కుక్క గురించి కొన్ని విషయాలు చూద్దాం. 
వాసనలను పసి కట్టడంలో మనిషి కన్నా కుక్కకున్న శక్తి పది వేల నుంచి లక్ష రెట్లు ఎక్కువట. అంతెందుకు మనుషుల అనుభూతులను కూడా ఇట్టే పసి కట్ట గలిగే శక్తి కుక్కలకుంటాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే మనం మనసులో భయపడుతున్నామంటే ఆ భయాన్ని సైతం గుర్తించగలదు కుక్క. అంతేకాదు, క్యాన్సరుతో బాధ పడే మనుషులను ఇట్టే పసి కట్టగలదు.
ప్రపంచంలోనే కుక్కలను పెంపుడు జంతువుగా పెంచే దేశాలలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో మూడు కుటుంబాలలో ఒక కుటుంబం తప్పనిసరిగా కుక్కలను పెంచడం సర్వసాధారణం. ఈ లెక్కన అమెరికాలో 75 మిలియన్ కుక్కలను పెంచుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
మొత్తంమీద ప్రపంచంలో వీధి కుక్కలు మినహాయిస్తే 400 మిలియన్ కుక్కలను ఇళ్ళల్లో పెంచుతున్నారట.
కుక్కలను పెంచడంవల్ల రక్తపోటు తగ్గుతుందని శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొన్నాయి 
కుక్క పిల్లలకు 28 దంతాలుంటాయి. ఎదిగిన పెద్ద కుక్కలకు 42 దంతాలుంటాయి.
కార్నల్ విశ్వవిద్యాలయ అధ్యయనాలనుబట్టి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే మనుషులు కుక్కలను పెంచుతున్నారట.
ఒక కుక్క గంటలో 19 మైళ్ళ దూరం వరకూ పరుగెత్తగలవు.
మనిషి మాట్లాడే మాటల్లో వెయ్యికిపైగా మాటలను కుక్కలు అర్థం చేసుకోగలవు.
కుక్క జాతిలో ప్రపంచంలోనే అధిక బరువున్న కుక్క మస్టిఫ్ అనే కుక్క. ఇవి దాదాపు రెండు వందల పౌండ్ల బరువును కలిగి ఉంటాయట.
కుక్కలు తమ పాదాలు, ముక్కు ద్వారా మాత్రమే చెమటను విడుదల చేస్తాయి. కుక్క ఇతర అవయవాలలో అసలు చెమటను చూడలేం.
కుక్కల జీవితకాలం పది నంచి పద్నాలుగేళ్ళు.
కుక్కపిల్లలు రోజుకు 18 నుంచి ఇరవై గంటలవరకూ నిద్రపోతాయి.
కుక్క తెలివితేటలు రెండేళ్ళ బిడ్డ తెలివికి సమానం.
లైకా అనే కుక్క రష్యాకు చెందినది. ఈ కుక్కే మొట్టమొదటిసారిగా అంతరిక్షానికి ప్రయాణం చేసింది. 1957లో రష్యా వాళ్ళు ఈ కుక్కను అంతరిక్షానికి పంపింది. కానీ ఈ కుక్క ఆరు రోజులలోపే ఆక్సిజన్ అందక చనిపోయింది 
మనిషికి నిద్దట్లో కలలు రావడం మామూలే. అలాగే కుక్కలకు కలలు వస్తుంటాయని పరిశోధనలో తేలింది.
కుక్కలకు తప్పు చేసాం అనే బాధే ఉండదట. అయితే కుక్కలకు అసూయ అనేదీ ఉంది. ఉదాహరణకు ఓ ఇంట్లో రెండు కుక్కలుండి ఒక కుక్కను ఎక్కువగా చూస్తే రెండో కుక్క అసూయ చెందుతుందట.
రాత్రి వేళల్లో మనిషి చూపుకన్నా కుక్కల కంటిచూపు శక్తి అధికం.
పిల్లులంటే కుక్కలకు పడవన్నది తప్పట. చాలాచోట్ల కుక్కలు పిల్లులతో కలసిమెలసి ఆడుకుంటాయట.
ప్రపంచంలోనే అతి పురాతనమైన కుక్కజాతికి చెందినది సలుకి. ఇది ఈజిప్టు దేశానికి చెందినది.

కామెంట్‌లు