ముందు పుట్టింది ఎవరు ?:- డా.. కందేపి రాణీప్రసాద్.

 అప్పటికి మా పిల్లలు చిన్న క్లాసులో ఉన్నారు. పరిక్షలు అయిపోయి శెలవులలో ఉన్నారు. శెలవులలో రోజూ చదవబోయే క్లాసు లెసన్స్ చెప్పేదాన్ని. పాఠం చదువుతున్నామని, అమ్మ క్లాసులో పాఠాలు చెబుతోందని తెలియకుండా పిల్లలకు చెబుతుండే దాన్ని. కాస్త కష్టంగా ఉండే పాఠాల్ని కూడా ఎదో ప్రయోగాలు చేసి చుపించో, ఆటల్లా అడించో, బొమ్మలు గీయించో, మొత్తానికి వాటిని కష్టంగా కాకుండా సరదాగా అనిపించేలా చెప్పడం నాకలవాటు. అందుకని మా పిల్లలు చదవనని మొండికేయకుండా చదువుకునేవారు. తరువాత ఆ పాఠంలోని వివరాలు, ప్రశ్నలు, ఆటలాడిస్తునో, వేరే పని చేస్తునో అడిగి సమాధానాలు రాబట్టి వారికి ఆ పాఠం మీద అవగాహన కలిగేలా చేసేదాన్ని. ఓ ఏడాది శెలవులకు మా ఆడపడుచు వాళ్ళు మా ఊరు వచ్చారు. వాళ్ళ పిల్లలిద్దరూ మా పిల్లలిద్దరూ అందరూ బాగా శెలవుల్ని ఎంజాయ్ చేస్తున్నారు.
ఓ రోజు సాయంత్రం కరెంట్ పోయింది. చూడటానికి టివి లేదు. అడుకుందామంటే చీకటి. కాబట్టి ఇంటి ముందున్న బాల్కనీ లో కూర్చొని అందరం పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నాం. పిల్లలు కథలు చెప్పుకుంటూ, చెప్పుకుంటూ ఎర్లిమాన్ గురించి (అంటే ఆదిమానవుడు) మాటల్లో పడ్డారు.నేనీశెలవుల్లో రెండు మూడు రోజులు ఆదిమానవుడి గురించి చెప్పాను. ఆదిమానవుడి బొమ్మ వేయించి రంగులు దిద్దించి మరీ ఆదిమానవుడి వివరాలు చెప్పాను. ఆదిమానవుడు అడవుల్లో ఉండేవాడని నదుల పక్కన నివాసం ఏర్పరచుకునే వాడని, రాళ్ళను రాపాడించి నిప్పును వెలిగించే వాడని చెప్తుంటే చాల ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని మరీ విన్నారు. పిల్లలు ఆ ప్రస్తావన తెచ్చారని నేను మరల ఆదిమానవుడు నాగరికత నేర్చుకొని ఎలా ఆధునిక మానవుడయ్యడో వివరంగా చెప్పాను. మనవ పరిణామ వికాస క్రమన్నంతా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి నానా తంటాలు పడ్డాను.నేనీ విషయాలు చెప్తున్నంత సేపూ ‘ఎర్లిమ్యాన్ మూతి మనకి మూతిలా ఉందేమిటి? వాళ్ళు డ్రెస్సులు లేకుండా ఆకులూ ఎందుకు కట్టుకున్నారు? కనీసం పేపర్లైన కట్టుకోవచ్చు కదా! జంతువుల్ని వేటాడి వండకుండా పచ్చిమాంసం ఎలా తినేవాళ్ళు? ఇలా ఎన్ని ప్రశ్నలో వాళ్ళ మెదళ్ళలో అవన్నీ అడుగుతూ వాళ్ళ అనుమానాలు తీర్చుకున్నారు. నాకిది అలవాటే కాబట్టి వారి ప్రశ్నలకు నేను విసుక్కోకుండా సమాధానాలు చెప్తూ వారికి ఎలాగైనా అవగాహన కలిగించాలని ప్రయత్నిస్తున్నాను.
అంతలో కరెంట్ వచ్చింది. ‘అన్నాలు తిందురుగానీ రండి’ అని అందర్నీ పిలిచాను. డైనింగ్ టేబుల్ దగ్గర కెళ్ళి అందరికి అన్నలు పెడుతూ ఇందాక చెప్పిన పాఠం ఎంత వరకు గుర్తుందో అని మెల్లిగా ప్రశ్నలు వేయడం మొదలు పెట్టాను. పిల్లల దృష్టంతా వాళ్ళకిష్టమైన డిష్ ల మీదా, స్వీట్ల మీదా ఉంది. నాకీ కర్రీ ఇష్టం, నాకు ఆ స్వీటు ఇష్టం అని పిల్లలు చెప్పుకుంటున్నారు. మధ్యలో నేను సడన్ గా “అరే పిల్లలూ! ఇప్పుడు చెప్పండిరా! అందరికన్నా ముందు పుట్టిందేవరు” అని అడిగాను. వెంటనే మా ఆడపడుచు కొడుకు “నాకు తెలుసు! నాకు తెలుసు! నేను చెప్తా అత్తా! అన్నాడు. ‘సరే చెప్పారా’! అన్నాను. “అందరికన్నా ఫస్ట్ పుట్టింది పెద్ద మామయ్య!” అన్నాడు వాడు. నాకేమి అర్థం కాలేదు. మా పిల్లలేమో “తప్పు తప్పు! రాంగ్ అన్సార్ మమ్మీ! అందరి కన్నా ఫస్ట్ పుట్టింది ఎర్లిమ్యాన్” అని గోలగోలగా అరుస్తున్నారు. వాడేమో ‘ఏం కాదు! పెద్ద మామయ్యే అందరి కన్నా ఫస్ట్ పుట్టింది. నేను చెప్పింది కరెక్టే కదమ్మా!’ అంటూ వాళ్ళమ్మ సపోర్ట్ కోసం అటువైపు చూశాడు. మా పిల్లలేమో ఎగతాళిగా నవ్వుతుంటే వాడేమో కోపంతో మొహం చిన్నబుచ్చుకున్నాడు. నాకప్పటికి అర్థం అయింది. నేను ఆదిమానవుడి గురించి అడిగినపుడు ‘అందరికన్నా పెద్దవాడి గురించి వాడు చెప్పాడు. ఆదిమానవుడి పాఠం గురించి మర్చిపోయాడు వాడు. ఈ విషయం గురించి ఎన్నిసార్లు నవ్వుకున్నామో! పిల్లల అమాయకత్వం, వారి ఆలోచనల్ని తలచుకుంటే ఎప్పుడైనా పెద్దల పెదవులపై నవ్వులు విరబూయక తప్పదు! బాలలు, బాల్యం, వారి ఆలోచనలు తమాషాగా ఉంటాయి. వారి విశ్లేషణ గమ్మత్తుగా ఉంటుంది. అందుకే ప్రతివారి జీవితంలో బాల్యం ఎంతో అందమైనది, అధ్బుతమైనది!
కామెంట్‌లు