నిర్లక్ష్యం:-- డా.. కందేపి రాణీప్రసాద్.

 మా బాబు రెండో పుట్టిన రోజు జరుపుకున్నామన్న ఆనందం తెల్లవారి నుంచే మాయమైంది. ఎందుకంటే రెండు పుట్టిన రోజులు అయిపోయాయి కాబట్టి మూడో ఏడూ వచ్చేసినట్లే కదా! మూడో ఏడు వచ్చేసిందంటే స్కూల్లో వెయ్యాలి కదా! ఏ స్కూల్లో వేయాలి? ఎలాంటి స్కూల్లో వేయాలి? మంచి స్కూలును ఎలా నిర్ణయించుకోవాలి? ఇలాంటి ప్రశ్నలతో బుర్రంత వేడెక్కిపోయింది. మా ఊర్లో అన్ని తెలుగు మీడియం స్కూళ్ళే ఉన్నాయి. అందువలన చాలామంది తమ పిల్లల్ని హైదరాబాదు హాస్టళ్ళలో వేసేవారు. మాకేమో ఇంత చిన్న వయసులో హాస్టల్లో వేయడం ఇష్టం లేదు. మేలుకొని వున్నా, నిద్రపోయినా, పని చేస్తున్నా ఇదే ఆలోచన మనసుని తొలిచేస్తూ ఉంది. ఆ తరుణంలో కొత్తగా ఇంగ్లిషు మీడియం స్కూలు పెడుతున్నారనే వార్త తెలిసింది. ఊర్లోని వారందరూ తామర తంపరగా తమ పిల్లల్ని ఆ స్కూల్లో వేయడం మొదలు పెట్టారు. వాళ్ళ అంచనాలకు మించి జనం వచ్చేసరికి వాళ్ళకు నిర్లక్ష్యం వచ్చేసింది.
ఒకానొక శుభ ముహూర్తాన మా బాబును తీసుకెళ్ళి ఆ స్కూలులో జాయిన్ చేశాం. ఆ సమయంలో ప్రిన్సిపాల్ కు ఎన్నో విషయాలు చెప్పాము మా అబ్బాయి గురించి. ఇంకా అన్నం తినటం రాలేదు. రెండు గంటలకోసారి పాలు మాత్రమే తాగుతాడు. వీడికి కాలు ఒక్కచోట నిలవదు. అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాడు. పొరపాటున గేటు తలుపులు తీశారో చక్కగా బయటకు వెళ్ళిపోతాడు. చాల జాగ్రత్తగా ఉండాలి. ఇలా వాడి గురించి ఎన్నో విషయాలు చెప్తున్నాం. ప్రిన్సిపాల్ చాలా క్యాజువల్ గా ‘ఇవన్ని ఇంటి దగ్గర కానీ స్కూల్లో ఏం ఉండదండి. మీకెందుకు మీరు వెళ్ళిపొండి. మేం చూసుకుంటాంగా’ అన్నది. కాదు మేడం ఇప్పుడే కదా ఇంట్లో నుంచీ బయటకు రావడం, అని ఎదో చెప్పబోయేంతలో ‘మీరింక వెళ్ళండి మేం చూసుకుంటాం’ అంటూ సీరియస్ గా చెప్పేసింది. ఏం చెయ్యలేక బయటి కొచ్చి ఆయమ్మ కు చెప్పాం. ‘తలుపులు తీసి ఉంటె బయటకు వెళ్ళిపోతాడు చూస్తుండాలి’ అని. ఆమె “లేదమ్మా ఎప్పుడూ తలుపులు వేసే ఉంటాయి. అక్కడ వాచ్ మెన్ కూడా ఉంటాడు. అందరూ చిన్న పిల్లలే కదా. మేం చూస్తూనే ఉంటాం. మీకు కొత్తగాని మాకిది మాములే” అన్నది. సరే అని దైర్యంగా వాడి నొదిలి ఇంటికొచ్చేశాం.
మావారు హాస్పిటల్ కు వెళ్ళిపోయారు. నేను పని చేస్తున్నాను గానీ పిల్లోడు స్కూల్లో ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తూనే ఉన్నాను. అయినా నాకు కొత్త కాబట్టి అలా ఆలోచిస్తున్నాను గానీ స్కూలు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారులే వాళ్ళకు పిల్లల మనస్తత్వం బాగా తెలుసుకదా! నేను అనవసరంగా భయపడుతున్నాను” అని నాకు నేనుగా ధైర్యం తుచ్చుకున్నాను. “అయినా ఏమో వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో? ఏడుస్తున్నాడేమో” ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తున్నాను.
ఇలా టెన్షన్ లో ఉండగానే బయట నెలలు మోగింది. తలుపు తీయగానే ఎదురుగా మా బాబును ఎత్తుకొని ఒకతను నిలబడి ఉన్నాడు. ఏమైంది అన్నాను ఆతృతగా మా బాబును తీసుకుంటూ. గాంధీ చౌరస్తా దగ్గర నిలబడి ఉన్నాడు రోడ్డు దాటటానికి ప్రయత్నిస్తుంటే నన్ను గుర్తుపట్టి ‘డాక్టరు గారి అబ్బాయి కదా!’ అని తీసుకొచ్చాను.
ఊర్లోని పెద్ద కూడలి అది. అసలు అక్కడ ఎందుకున్నాడు? స్కూల్లో వదిలిపెట్టి వచ్చాం కదా! ఆ చౌరస్తా నుండి చాలా దూరం ఉంది స్కూలు. వెంటనే నేను, మావారు స్కూలు కెళ్లాము. ప్రిన్సిపాల్ నవ్వుతూ ఎదురొచ్చి ‘ఇంకా అరగంట ఉండండి స్కూలు వదలటానికి. మీ అబ్బాయి ఎం ఏడవలేదు’ అన్నది. అంటే మా బాబు బయటి కొచ్చేసిన విషయమే వీళ్ళింత వరకు గుర్తించలేదన్నమాట. వామ్మో వీళ్ళను నమ్ముకుంటే ఇంకేమన్నా ఉందా! అని మనసులో అనుకున్నాను.
ప్రిన్సిపాల్ కు విషయమంతా చెప్పాము. ఆయమ్మను పిలిపించింది. “వాచ్ మన్ కోసం ఎవరో వస్తే తలుపు తీసి బయటకు వెళ్ళి మాట్లాడి వచ్చాడమ్మా’ అన్నది ఆయమ్మ. ప్రిన్సిపాల్ ‘సరే ఇంకోసారి ఇలా జరగకుండా చూస్తాం లెండి’ అని చాల మామూలుగా చెప్తున్నది. ‘మనం తప్పు చేశామన్న పశ్చాతాపం లేదు’ వాళ్ళ మోహంలో కనీస జాగ్రత్తల తీసుకోవటం లేదు. వెంటనే స్కూలు మార్చాలి అని మనసులో నిర్ణయించుకున్నాను.
చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు కారణం. పిల్లలకు డిసిప్లిన్ నేర్పించాల్సిన స్కూళ్ళే ఇంత అధ్మానంగా ఉంటె భావి భారత పౌరులు ఎలా తయరౌతారు వీళ్ళ చేతుల్లో నిర్లక్ష్యమే పెద్ద నేరం అని తెలియాలి. రెండేళ్ళ పసివాడు ఏ ప్రమాదమూ జరగకుండా ఇంటి దాకా రావడం మా అదృష్టం. స్కూలు వాళ్ళు కనీసం సారీ కూడా చెప్పలేదు. నేనీ విషయాన్నీ సాక్షి ద్వారా అందరికి తెలియజేయాలనుకుంటున్నాను. ఇది ఇరవై సంవత్సరాల క్రిందటి విషయమైనప్పటికి ఈనాటికీ స్కూళ్ళలో ఏ మార్పూ లేదు. స్కూళ్ళనే కాదు ఎక్కడైనా నిర్లక్ష్యం క్షమించరాని నేరమే. 
కామెంట్‌లు