సూరీడుని చూడకుండా ఉండలేను: పెన్మత్స సత్యనారాయణ రాజు...---సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 వీరు  ఈతరానికి తెలీదు. కానీ కవిగా ప్రసిద్ధులు. పేరు పెన్మత్స  సత్యనారాయణ రాజు.కవితాశ్రీ.   కవినభోమణి బిరుదులు. భార్య నాగేశ్వరి తోడుగా ఉండటం వల్లనే రాణించానని చెప్పారు.కూకట్ పల్లి లో నాగేశ్వరి అక్షరాలయం పేరు తో ఫ్రీగా  మూడు వేల పుస్తకాల లైబ్రరీ నడిపి సాహితీవేత్తల తో ఎన్నో  ప్రోగ్రామ్స్ చేశారు. ఆచార్య తిరుమల పురస్కారం పొందారు. మునిపల్లెరాజు గారు సన్నిహిత మిత్రులు.  . మరి వీరి బాల్యాన్ని తన మాటల్లోనే  ఒకసారి తెలుసుకుందామా ?
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
"నా నాల్గవ ఏటనే తల్లిని కోల్పోయాను.అమ్మా నాన్న అస్సలు గుర్తు లేరు.నాకు పదేళ్లు వచ్చాక గాని ఆసంగతి నాకు తెలీలేదు అని అంటే మీరు నమ్మరు.ఇంట్రావర్ట్ ని.పైకి మంచి చెడు చెప్పేవాడిని కాదు.
: పెద్దమ్మ అంటే తల్లి అక్క(కన్నమ్మ)పెంచింది. పట్టింపాలెంఅనే పల్లెలో పుట్టాను. ఆరోజులలో ఏకోపాధ్యాయబడిలో5వ ఏట చేరాను.హోమియో వైద్యం తోపాటు  బడిలో పనిచేసే మాష్టారు శ్రీ వాడపల్లి కేశవకృష్ణమాచార్యులుగారు చెప్పే పద్యాలు వెంటనే చెప్పే ధారణశక్తి అబ్బింది. ఒక రోజు క్లాస్ లో ఎవరూ పద్యం చెప్పలేదు. నేను ఒక్కడినే చెప్పాను.అందరికీ బెత్తం దెబ్బలు వీపుపై వడ్డించిన ఆయన నన్ను కూడా కొట్టారు.పిల్లలు అంతాలబోదిబో ఏడుస్తూ అమ్మలకి చెప్పారు. నేను దెబ్బలు తిన్న సంగతి కూడా వారేచెప్పారు.మా ఊరి అమ్మలు నన్ను తమకొడుకు కన్నా ఎక్కువగా ప్రేమించే వారు. మరి అదేంవిచిత్రమో?నాకు పెట్టిన తర్వాతనే తమ పిల్లలకు పెట్టేవారు.ఆపిల్లలుకూడా అసూయ లేకుండా నన్ను ముద్దు చేసేవారు. వారు మాఇంటికి వచ్చి కన్నమ్మతో చెప్పి  నాచొక్కా ఎత్తి వాతలుచూసి లబలబలాడుతూ మాష్టారుని మాఇంటికి పిల్చారు.మాకన్నమ్మ అడిగింది "మాష్టారూ!తల్లి లేని పిల్లాడు అని తెలిసినా  రాజు ని ఎందుకు కొట్టారు?"అప్పుడు తెలిసింది నాకు కన్నతల్లి లేదు అన్న విషయం. మాష్టారు క్షమాపణ చెప్పి ఇంటికెళ్లి  వారి కొడుకు ని పంపి నన్ను తన ఇంటికి పిలిపించి "బాబు!నేను పెద్దతప్పు చేశాను. ఆవేశంలో  పద్యం చెప్పిన నిన్నుకూడా  అందరితో కలిపి కొట్టాను."అని చాలా బాధ పడ్డారు. ఇక అమ్మలు పిల్లలు  నన్ను పూవులాగా అపురూపం గా చూసుకునేవారు. ఒకరోజు అందరూ వారిస్తున్నా వినకుండా చెట్టుఎక్కి కొమ్మ విరగటంతో కింద పడ్డాను. దెబ్బలు తగిలాయి. పిల్లలకు భయం పట్టుకుంది.వాళ్ళ అమ్మలు బడితె పూజచేస్తారు నామీద  ఈగవాలితే.అంతా నాకు శైత్యోపచారాలు చేశారు. ఒకరు వెన్నపూస ఇంటికెళ్లి పట్టుకొస్తే  దానితో మర్దనచేశారు.మా కన్నమ్మ ఇతరులకు తెలీకుండా  రోజు నాకు వెన్నతో వైద్యం చేసి గుట్టు బైట పడకుండా బతుకు జీవుడా అని బైట పడ్డాము అందరం.ఇంకోసారి పిల్లలు అంతా  చెరువు మట్టితో బొంగరాలు చేయాలని చెరువులోకి దిగారు. నన్ను హెచ్చరించి గట్టు పై కూచోపెట్టారు.అక్కడున్న గుంతలో జర్ర్ న జారాను."రాజు చెరువులో మునిగిపోయాడు.సత్తిబాబు చెరువులో మునిగి పోయాడు"
అని పిల్లలు ఘొల్లుమన్నారు.వడ్రంగి కొడుకు పేరు సత్యం. తన కొడుకే పడిపోయాడు అనుకుని   పైకి కనిపించని నన్ను  వెతికి బైటికి తీశాడు. అప్పటినుండి నాకు  నీరు చెట్టు ఆటలు అంటే భయం.స్కూల్ ఫస్ట్.నాటకాలు  డైరెక్టర్ గా  అందరి ప్రశంసలు బహుమతులు అందుకున్నాను.డ్రాయింగ్ అద్భుతంగా వేసేవాడిని.కృష్ణుడంటే భక్తి ప్రేమ ఇప్పటికీ. నాచేత కృష్ణుని బొమ్మలు వేయించుకుని మహిళలంతా ఎంబ్రాయిడరీ చేసి మురిసి పోయేవారు.పాలకొల్లు దగ్గరున్న జిన్నూర్ లో పీశపాటి రామనాథం గారు తెలుగు పండితులు. ఒకరోజు నారఫ్ బుక్ లో ఆయనపై నాల్గుపద్యాలు రాశాను."రాజు మీమీద పద్యాలు రాశాడు మాష్టారూ" అని నాగుట్టు రట్టు చేశారు పిల్లలు. వెంటనే ఆయన చూసి ఆమరునాడు విజయవిలాసం తెచ్చి నాచేత చదివించి అర్ధం చెప్పించారు.రవీంద్ర నాధ్ టాగూర్ పాఠం చెప్పి సొంతం గా కధ రాయమన్నారు."మీపూర్వీకులు కాకరపర్రు(తణుకు)వారు కాబోలు!ఆభాష లో టాగూర్ ని వర్ణించావు"అని మెచ్చుకున్నారు. అదివేదపండితుల గ్రామం. మాపెదనాన్నగారు ఒరిస్సా రాజు విక్రమదేవవర్మ ఆస్థాన కవి. మా నాయనమ్మలు మంచి కవయిత్రులు అని చెప్పుకునేవారు.మాచిన్నాన్న గారి తో పొలం వెళ్లి  ప్రకృతి పరిశీలనలో మునిగేవాడిని.సూర్యుని ఆరాధనగా చూడటం నాకు ఇష్టం. బాల్యం నించి ఇప్పటిదాకా  సూరీడుని చూడకుండా ఉండలేను.వేమూరి నరసింహమూర్తి గారి ప్రోత్సాహంతో రాణించాను.పెద్దబాలశిక్షతో  ఎంతో నేర్చాను.ఆఖరుగా ఒకమాట!పి.యు.సి.తోమానేసి హైదరాబాద్ కి జాబ్ కోసం వచ్చాను.19వ ఏట మా మూడవ మేనమామ కూతురు నాగేశ్వరి పట్టుబట్టి  నన్ను చేపట్టి నాసాహితీజీవితంలో కూడా అర్ధాంగి అయింది. "
అలా ఆయనవాక్ప్రవాహం సాగింది. దైవం పూర్వ జన్మ సుకృతం ఉంటేనే సాహిత్యం అబ్బుతుంది అని నాకు అనిపించింది..
(వీరు ఫోన్ ద్వారా తన బాల్య స్మృతులను నాకు వివరించి చెప్పారు.మొలక కోసం నేను అడిగిన వెంటనే  ఆరోగ్యం బాగా లేకున్నా  వివరించారు. ఆయనకు ధన్యవాదములు )
కామెంట్‌లు