ఒక *అడవి* దగ్గరలోని ఒక గ్రామశివారులో ఒక *చెరువు* ఉంది. అందులో నీరు కనబడనంతగా *తామరలు* వికసించి ఉన్నాయి.పైన నీలిమేఘాలతోనిండిన *ఆకాశం* ఎంతో అందంగా ఉంది. ఆ ప్రదేశమంతా వృక్షాలు, మొక్కలు రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉంది.
దేశాటనం చేస్తున్న ఒక బౌద్ధ గురువు ఆదారిన వెళుతూ అక్కడి ప్రశాంత వాతావరణంచూసి ఆగిపోయి అక్కడే ధ్యానం చేసుకోసాగాడు.
ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న *బంగార్రాజు* అనే పేరుగల *రాజు* తన *మంత్రి* తో సహా బయలుదేరాడు. ఆ రాజుగారికి కొంతకాలంగా అనారోగ్యంగా ఉంది. మూఢనమ్మకాలు గల రాజుగారు తమ ఆస్థానంలోని గణాచారిని ఈవిషయమై అడిగాడు.
దానికి గణాచారి సమాధానమిస్తూ "రాజా! మీకు దిష్టి తగిలింది.అందుకే మీ ఆరోగ్యం క్షీణించింది.దీని నివారణకోసం ఒక *నల్లకోడిపెట్ట* ను మీచుట్టూతిప్పి *బంగారుకత్తి* తో దాని మెడనరికి అవతలపడేయాలి" అన్నాడు. రాజుగారు నల్లకోడిపెట్ట కోసం రాజ్యమంతా వెతికించినా అదేమి ఆశ్చర్యమోగాని ఎక్కడా అది లభించలేదు. అప్పుడు రాజుగారు తన మంత్రి తో కలిసి నల్లకోడిపెట్ట కోసం స్వయంగా బయలుదేరాడు.
అలా వెళుతున్న రాజుగారు ఈ బౌద్ధగురువును చూసి ఆగిపోయాడు.దగ్గరగా వెళ్ళి నమస్కరించి "గురువుగారూ! తమరు దేశదేశాలూ తిరుగుతున్నారు కదా.ఎక్కడైనా మీరు నల్లకోడిపెట్టను చూశారా? చూసిఉంటే దయచేసి నాకు చెప్పండి.అందుకు ప్రతిగా మీకు నామెడలోఉన్న విలువైన *రత్నాలహారం* మీకు సమర్పించుకుంటాను" అన్నాడు.
అదివిన్న బౌద్ధగురువు రాజు పరిస్థితిని అడిగి తెలుసుకుని ఇలా అన్నాడు. "రాజా! మీరు మూఢాచారాలను, మూఢనమ్మకాలను వదిలిపెట్టండి.మంచి వైద్యులతో వైద్యంచేయించుకొనండి.త్వరలో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు.ఆ బుధ్ధభగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు" అని ఎంతో కరుణాపూరిత దృష్టితో చూస్తూ పలికాడు.
అంతకుముందు ఎవరు చెప్పినా వినని రాజుగారి మనసు ఆశ్చర్యకరంగా ఈ బౌధ్ధగురువు మాటల ప్రభావంతో మారిపోయింది.గురువుగారికి సాగిలపడి నమస్కరించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు.గురువుగారు చెప్పినట్లుగానే వైద్యులను సంప్రదించి ఔషధసేవనం చేసి స్వస్థతచెందాడు.
ఇక అప్పటినుండి మూఢాచారాలను, మూఢనమ్మకాలను వదిలేసుకోవడమేగాక తన రాజ్యంలో కూడా వాటిని నిర్మూలించాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి