కనుమరుగైన పనితనం >: రచన >శీరంశెట్టి కాంతరావు >పాల్వంచ *

నారుపోసి నలభైరోజులు దాటిపోతుండడంతో బాపు నాటుకు సాగాలన్న ఆలోచనతో 
వారం రోజుల్లో పొలం మొత్తం బురదన సాలిరవాలు దున్నే వాడు, తరాలను తొక్కి పొల మంతా వారంరోజుల పాటు  మురగబెట్టినంక  ఏటా మాకు నాటేసే మేస్త్రమ్మ దగ్గరకెళ్ళి నాటుకి ఎప్పుడొస్తావని అడిగేది ఆవిడ చెప్పినరోజుకల్లా  నాలుగైదు సాయితా అరకల్ని తయారుచేసేది ఎప్పుడైనా 
బురదగొర్రు మాత్రం బాపే కట్టేది
అనుకున్నరోజు పొద్దున్నే మేస్త్రీ  ఇంటికెళ్ళి కొబ్బరికాయ, అగ రొత్తులడబ్బా ఇచ్చి గోవింద కొట్టడానికి ఏం కావాలో అడిగేది ఇరవైమంది ముఠాలో మనిషికి అరసోలెడు పుట్నాలు తెమ్మ నేది మేస్త్రమ్మ  బాపు అట్నుండటే షా‌వుకారు దుకాణానికెళ్ళి ఐదుమానికల పుట్నాలు మూటకట్టించుకొచ్చి అమ్మ చేతికిచ్చేది
ఆవకాయ పెరుగన్నం కడుపు నిండా తిని ఇంటికొచ్చిన పై కూలిలకు దుక్కిమందుకట్టలెత్తి తను బురదగొర్రు కోటేరేసుకుని పొలందారిపట్టేది నాటునాడు మేం బడికి ఎగనామం బెట్టి పొలానికే పొయ్యేది సాయితా అరకలు సాలిరవాలు దున్నుతుంటే బాపు గొర్రుతోలేది 
ఇంతలో ముఠావాళ్ళొచ్చి నారుమడికి  కొబ్బరికాయ కొట్టి నారుతీత మొదలు పెట్టేది పైకూలీలిద్దరు దుక్కి మందుచల్లి చిలప తొక్కుతూ నారుకట్టలు పంచేవాళ్ళు
కొంతసేపు నారుతీత తీసిన ముఠాల నల్గురు ముసిలోళ్ళను అక్కడుంచి మిగతా వాళ్ళంతా నాటుకు వంగేది ఇక బురదపొలం రంగస్థలంగా ఒక పరాశి కాలేనా!ఒక పాటలేనా! అక్కడో సంపూర్ణ కళాజాత ఆవిష్కృత మయ్యేది
పొద్దు నెత్తికొస్తుండగా అమ్మ పదిమందికి సరిపడ అన్నం, ఆవకాయ‌‌,కూరా, పెరుగు తీసుకొచ్చేది అంతా రెండు గంటలకు పైటన్నా లకు లేసేది పొద్దు గూట్లో పడ బోతుందనగా నాటువేత పూర్తిజేసి ఒడ్డెక్కిన ముఠా మహిళలంతా మడవ ముందర పసుపు కుంకుమల్తో పూదించిన మూడురాళ్ళను నిలబెట్టి కొబ్బరికాయ కొట్టి గోవిందా! గోవిందా!అంటూ గోవింద కొట్టుకుంటూ పసుపు కుంకుమల్ని పొలమంతా చల్లుకుంటూ నలుగురు యువతులు పరుగులుతీసి వచ్చే వాళ్ళు అమ్మ! షావుకారు దగ్గర తీసుకొచ్చిన పుట్నాలను ముఠామేస్త్రమ్మ చేతికిస్తే తన వాళ్ళందరికీ తలో అరసోలెడు పంచిపెట్టేది మిగిలిన వాటిని అక్కడున్న వాళ్ళందరికీ తలా ఇన్ని  పంచిపెట్టిన తరువాత ఇండ్లకు మల్లేది
ఇప్పుడా అరకలు లేవు           ఆ గోవిందలు కొట్టడాలు లేవు అసలు పశువుల మనుషుల ప్రమేయమేలేని వ్యవసాయ  వ్యవస్థ పాదుకుంటున్న రోజులు దాపురించాయి
                              *** 
కామెంట్‌లు