మహనీయుడు మాలవ్యా!...అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం వారానికోసారి ఒక మహాపురుషుడి  జీవితచరిత్ర చదవటంవల్ల ఎన్నో విశేషాలు  వారి గొప్పతనం కూడా తెలుసు కోగలం.పుస్తక పఠనంతో భాషపై పట్టు  సృజనాత్మకత రచనలు చేసే ప్రేరణ కలుగుతుంది. ఈరోజు పండిత మదన్ మోహన్ మాలవ్య జీవితం లో కొన్ని సంఘటనలు తెలుసుకుందాం.
 కాలాకంకర్ కి చెందిన రాజారాం పాల్ సింగ్ హిందూ స్థాన్ అనే పేపర్ ని ప్రచురించటం ప్రారంభించాడు.250 రూపాయల జీతం తో ఆపేపరు నిర్వహణ బాధ్యతను   మాలవ్యాకి అప్పగించాడు. ఆరాజు మద్యపాన ప్రియుడు. అందుకే మొదట ఆయన తటపటాయించారు."నేను మద్యం సేవించకుండానే  మిమ్మల్ని కలుస్తా మాట్లాడుతా"అని రాజా హామీ ఇవ్వడం తో మాలవ్యా సరే నన్నారు.కానీ ఒకరోజు  రాజా మద్యం తాగి  ఆయనను కలవడానికి వచ్చాడు. అంతే ఎలాంటి మొహమాటం లేకుండా  మాలవ్యా తన పదవికి రాజీనామా చేసి బైట పడ్డారు. రాజా ఎన్ని సార్లు బతిమలాడినా ససేమిరా అన్నారు. మనిషి సత్ప్రవర్తనకు  ఆడినమాటతప్పనివారికి ఆయన విలువ ఇచ్చేవారు.
ఒకసారి  మాలవ్యాను ఎవరో ప్రశ్నించారు "మీరు  విగ్రహారాధన చేస్తారు. మరి సోమనాథ్ ఆలయాన్ని తురుష్కులు కొల్లగొట్టి నపుడు ఆదేవుడు ఏం చేయగలిగాడు?"దానికి ఆయన ఇలా జవాబు ఇచ్చారు "హిందీ లో క నుంచి  కబూతర్(పావురం) ఖ నుంచి  ఖరగోష్(కుందేలు)అని  పిల్లలకు  అక్షరం  పదం ని పరిచయం చేస్తాం.పిల్లలు తేలికగా అక్షరాలు గుర్తించి సులభం గా  చదవడం రాయడం చేస్తారు. అలా ఆసబ్జక్ట్  పై పిల్లలకు  అవగాహన ఆసక్తి ఏర్పడుతుంది. అలాగే దేవునిపై ఆసక్తి  భక్తి శ్రద్ధ ఏర్పడాలంటే హిందువులు  దేవతామూర్తులు  విగ్రహాన్ని  పెట్టి వాటిని చూస్తూ  స్తుతిస్తూ భక్తి మార్గం లో  తొలి అడుగు వేస్తారు. క్రమంగా ఆ భక్తులు నిరాకార నిర్గుణ బ్రహ్మని ఉపాసించ గలరు. అమ్మ అన్న పదం వినగానే  పిల్లలకు  తనను కనిపెంచి పోషించేది  అనే భావం కలుగుతుంది. క్రమంగా  ప్రతి స్త్రీలో తన తల్లి ని  ఆపై జగన్మాతను చూడగలరు. ఇదే హిందూమతంలోని గొప్పతనం  విగ్రహారాధన లోని ఆంతర్యం. అదే సాధనగా యోగవిద్యగా అర్ధం చేసుకుని పైపైకి ఎగబాకగలడు". అంతే అందరి నోళ్ళు మూతబడ్డాయి.
కామెంట్‌లు