కాలం కలిసి రావాలి:- సత్యవాణి

 చీమల పుట్టలో పాము దూరింది 
దొరతనాన్ని చూపిస్తోంది
మఠం వేసుకు కూర్చుంది 
చీమలను కదలాడనవ్వటంలేదు
కదిలితే బుస్సుమంటోంది
రెండు నాలుకలు జాపి నాకేస్తోంది చీమలను
నాలుకలకంటుకొని నలిగిపోతున్నాయి చీమలు
అల్లాడిపోతున్నాయి చీమలు
ఆవేదన చెందుతున్నాయి
ఆలోచన చేస్తున్నాయి 
వృధ్ధచీమకి బుధ్ధి వికసించింది
సుమతీ శతకం గుర్తుకు తెచ్చుకొంది
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుటమేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ
 చదివి వినిపించింది
విన్నాయి చీమలు
వివరించింది వృధ్ధ చీమ
టీకా తాతపర్యాలను
ఆకళింపు చేసుకొన్నాయవి
ఆచరణకు పూనుకొన్నాయి చీమలు
కాలం కలిసివస్తే చీమలకు
కాలసర్పం కాలం ముగిసినట్టే 
         
కామెంట్‌లు