మా ఊళ్ళో మంగలోళ్ళకూ ప్రత్యేకంగా ఓ బజారుండేది
ఆ బజార్ల వాళ్ళవి ఎన్ని కుటుంబాలున్నా వాళ్ళకే స్వంతమైన రైతుకుటుంబాలూ వుండేవి వాళ్ళంతా తమ తమ రైతుల ఇండ్లల్ల మంచికి చెడ్డకు అక్కర కొచ్చేది, రైతుల ఇండ్లల్ల ఎంత మంది మగ వాళ్ళుంటే అంతమంది తల ఒక్కింటికి ఏడాదికి రెండుసార్లు కుండెడు చొప్పున మేర కొలిపించుకు పోయేది అందుకే మంగళ్ళంతా తమ ఆసాముల ఇండ్లల్ల మగసంతానం కలగాల్నని కోరుకునేది పదిహేనురోజుల కోపాలి పొది పట్టుకోని ఇంటిముందటి కొచ్చి గడ్డాలు, సవరాలుజేసి, గోరుగల తోటి గోర్లుదీసి, బోడగుండ్లు గొరిగి పొయ్యేది
అదేందోగాని ఆరోజుల్ల పిల్లగాండ్లకు ఊకే తలల్ల పుండ్లు పడేది వాటికెన్ని మందులు,పసర్లు పూసినా తగ్గేవికావు ఆఖరికి మంగలికత్తి తగిల్తెనే తగ్గుతయని తలంతా నున్నగా గుండు గొట్టిచ్చేది దాంతోటి నిజంగనే ఆపుండ్లు తగ్గిపోయేటియి అంతేగాదు కాల్లకు ముండ్లు గొట్టిన, ఒంటి మీద చెడుగడ్డలైనా మంగలోళ్ళే ఇండ్లకొచ్చి సుతారంగా కోసి బైల్జేసి బాధ బాపేటోళ్ళు అందుకే మంగలోళ్ళను ప్రాచీన శస్త్రకారులంటారు మనిషి పుట్టుక నుంచి చావుదాక వాళ్ళ ప్రమేయం అనివార్యం
పిల్లల పుట్టెంటికలు తియ్యనికి మేనమామ ఎంతవసరమో ఇంటి మంగలాయనా అంతే అవసరం
రైతుల ఇండ్లల్ల పెండ్లిల్లప్పుడు వాళ్ళ బంధువుల ఊర్లకెళ్ళి శుభపత్రికలిచ్చొచ్చేటోళ్ళు
పెండ్లి పిల్లకు పిల్లగానికి పెండ్లి తంతుల తొల్దొల్త ఇంటి ముందట పెండ్లరుగేసి,దాని మీద చాపేసి, దానిమీద వడ్లతోటి పోలు రాసినంక పీటేసి కూర్చోబెట్టి మైలపోలు (కాళ్ళగోళ్ళు) దీసేది
సన్నాయిలోళ్ళు లేని ఊళ్ళల్ల మేళ్ళం వాయించేదిగూడా మంగళ్ళే ఆఖరికి మనిషి పోయినంక అతని వారసులకు రేవుకొచ్చి గుండ్లు కొట్టేది, ఒక్కమాటలో చెప్పాల్నంటే నాటి వ్యవసాయ ప్రధాన గ్రామీణ వ్యవస్థలో మంగళ్ళ పాత్ర మరువలేనిది
ఇప్పుడా గ్రామవ్యవస్థలో అన్నీ మారిపోయినట్టే మంగళ్ళ ప్రాధాన్యతా మరుగున పడిపోయింది
రైతుల, వృత్తిదారుల మధ్య సంబంధం సమసిపోయింది అసలు మేరలంటేనే తెలియని రోజులొచ్చాయి ఊరూరికి మంగలి షాపులెలిశాయి అవీ వెనుక బట్టి సెలూన్లొచ్చాయి
వాటినీ తలదన్ని ఆడ మగలకు విడి విడిగా బ్యూటీ పార్లర్లొచ్చాయి
జనం జేబులకు చిల్లులుపడి పైసలు జారి పోతున్నా గ్రహింపులేని రోజులొచ్చాయి
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి