"మీరు భారత దేశానికే ఆస్తి":-- యామిజాల జగదీశ్ తమిళనాడు రాజకీయ చరిత్రలో "జీవా" గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న మహనీయుడే జీవానందంగారు.
తమిళనాడులో ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు, సాహితీవేత్తలు, త్యాగమూర్తులు ఉండేవారు. వారిలో ఒకరు "తోయర్ జీవా". ఆయన అసలు పేరు పి. జీవానందం. కానీ అందరూ ఆయనను తోయర్ జీవా అనే పిలుస్తారు.
1907 ఆగస్ట్ 21న కన్యాకుమారి జిల్లా నాగర్కోవిల్ సమీపంలోని పూత్తప్పాండి అనే పల్లెలో జన్మించారు జీవా. ఆయన తల్లిదండ్రులు పట్టక్కార్ పిళ్ళై, ఉడయమ్మాళ్. 
చిన్న వయస్సులోనే సాహిత్యంపట్ల ఆసక్తి కలిగిన జీవా పదో తరగతి చదువుతున్నప్పుడే సుగుణరాజన్, సుందిరవీరన్ వంటి నవలలు రాశారు. నాటకాలు రాసి దర్శకత్వం వహించడమే కాక వాటిలో నటించే వారు. 
జీవా తనను కమ్యూనిస్ట్ - సోసలిస్ట్ కార్యకర్తగా చెప్పుకుంటూ సమధర్మగీతాలు, సోవియట్ సాహిత్యం గురించి జీవా, సోషలిస్ట్ తత్వాలు వంటి పుస్తకాలుకూడా రాశారు
కుల నిర్మూలన, స్వీయాభిమానం అనఘ అంశాలకు సంబంధించి పుదుమైప్పెణ్ (ఆధునిక స్త్రీ), పెణ్ణురిమై గీతాలు (మహిళల హక్కు గీతాలు),  మతము - మనిషి జీవితం వంటి పుస్తకాలనూ రాసిన జీవా నూటికి నూరు పైసలన్నట్టు అసలు సిసలు పోరాటయోధుడు. కార్మికులు నిర్వహించిన పోరాటాలలో చురుగ్గా పాల్గొనేవారు. అంతేకాదు కలసికట్టుగా ఎలా పోరాడాలి అనేది చేతల్లో చూపారు. 1946లో జరిగిన కార్మికుల పోరాటాన్ని విరమించుకోవాలని బ్రిటీష్ ప్రభుత్వం ఆదేశించింది. కానీ పోరాటాన్ని విరమించక జీవా సారథ్యంలో పెద్ద ఎత్తున సాగింది. దాంతో బ్రిటీష్ పాలకులు ఆగ్రహోదగ్రులై "ఇక ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఒక్క అడుగు ముందుకు వేసినా కాల్చిపారేస్తామాని" హెచ్చరించినా 
జీవా తన గుండెను చూపించారు కాల్చమన్నట్టు. దాంతో బ్రిటీష్ పాలకులు వెనక్కు తగ్గారు. 
గాంధీజీ లక్ష్యాలకు ప్రభావితులై ఆయన మార్గంలో నడవటం ప్రారంభించిన జీవా సహాయనిరాకరణ ఉద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణలో పాలుపంచుకున్నారు 
 1927 లో గాంధీజీ పేరిట జీవా  ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. అది తెలిసి చూడటానికి గాంధీజీ వెళ్ళారు. 
అప్పుడు గాంధీజీ "మీ ఆస్తి ఎంత?" అఅని అడిగారు జీవాను.
 "మాతృభూమే నా ఆస్తి" అని జవాబిచ్చారు జీవా.
ఆ మాట విని విస్తుపోయారు గాంధీజీ.
"మీరే భారతదేశ ఆస్తి" అని గాంధీజీ ప్రశంసించారు జీవాను.
 తమకు ఆదర్శమని అనుకుంటూ ఉండే జీవా గాంధీజీ తననట్లా అభివర్ణించడాన్ని విని ఆశ్చర్యపోయారు జీవా.
 ఓమారు కామరాజర్ ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడాని తిరిగొస్తూ గుడిసెలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జీవా ఇల్లు ఉన్నట్టు తెలుసుకున్నారు. వెంటనే స్వాతంత్ర్య సమరయోధులకు ఇళ్ళు కేటాయించే పథకం కింద జీవాకు  కామరాజర్ ఒక ఇల్లు కేటాయించే చర్యలు తీసుకున్నారు. కానీ జీవా తనకక్కరలేదని సున్నితంగా తోసిపుచ్చారు. కార్మికులకోసం పోరాడిన రోజులు గుర్తు చేసుకుని చివరి రోజు వరకూ గుడిసెలోనే ఉంటానన్నారు.
"నేనెందుకు నాస్తికుడినయ్యాను" అనే తన రచనను భగత్ సింగ్ అనువదించే పని జీవాకు అప్పగించారు. జీవా అది అనువదించారని తెలిసి బ్రిటీష్ పాలకులు ఆయనను కొట్టి వేధించి వీధుల్లో తిప్పారు.
అయినా ఆయన ఎన్నడూ తాను నమ్మిన సిద్ధాంతాల నించి ఇవతలకు రాలేదు. సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే పోరాటాలకు నడుం బిగించేవారు జీవా.
కులనిర్మూలన, స్వీయాభిమానం వంటి ఉద్యమాలలో తందై పెరియార్ తో కలిసి పాల్గొన్న జీవా సొంత ఊళ్ళో తీవ్రవిమర్శలకు గురయ్యారు. మాట పడ్డారు. అయినప్పటికీ ఆయన వెనక్కుతగ్గలేదు. ఆయనపై దాడికూడా జరిగింది.
జీవా మంచి వక్త. ఆయన మాటలు వినడం కోసం జనం భారీ సంఖ్యలో తరలివచ్చేవారు. 1932లో ఆయన మాట్లాడిన మాటలను తెలుసుకున్న నాటి బ్రిటీష్ పాలకులు ఆయనను ఇలాగే మాట్లాడిస్తూ పోతే తమ అధికారానికి మున్ముందు ముప్పేర్పడుతుందని భావించి అరెస్ట్ చేశారు. ఆయన జైలుకు వెళ్ళడం అదే మొదటిసారి. అయినా ఆయన ఏమత్రం వెరవక తన లక్ష్యసాధనకోసం పోరాడుతూనే వచ్చారు జీవా.
ఓమారు జీవా ఇంటికి వచ్చిన కామరాజర్ అక్కడి సంఘటన చూసి నివ్వెరపోయారు.
తనను చూడటానికి వచ్చిన కామరాజర్ ని ఇంటి బయటే నిలబెట్టి లోపలకు వెళ్ళిన జీవా ఎంతసేపటికీ బయటకు రాలేదు. జీవా కోసం నిరీక్షించిన కామరాజర్ ఇక లాభంలేదని ఆయనే లోపలకు వెళ్ళారు. తీరా నడుముకో తువ్వాలు చుట్టుకుని పంచను ఎండబెట్టుకుంటున్నారు జీవా. కారణం, ఆయనకున్నది ఒకటే పంచ. దానినే ఉతికి ఆరబెట్టి కట్టుకోవడం ఆయన అలవాటు. ఇది ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పటి సంగతి ఇది. 
విలాసవంతమైన భవనాలు కట్టుకుని బతికిన నేతల మధ్య ఇంత నిరాడంబరతతో గుడిసెలో జీవించిన మహామనిషి జీవా 1963 జనవరి 18వ తేదీన చెన్నైలో సిపిఐ నేతగా కన్నుమూశారు.

కామెంట్‌లు