"మా నాన్న":-- యామిజాల జగదీశ్

నాన్న చేయి పట్టుకుని 
నడిస్తున్నప్పుడు
వీధికే కొత్త అందొలొస్తాయి!

నాన్న ప్రేమతో 
నుదుటిపై ముద్దిచ్చినప్పుడు 
మీసాలు గుచ్చుకున్నా
కోపం వచ్చేది కాదు!

చూసేందుకే మనిషి 
కాస్తంత మురికిగా ఉంటారు!
కానీ
మల్లెపూవల్లే హాయిగా ఉంటుంది
నాన్న నవ్వు!

చొక్కా వేసుకున్నదీ లేదు!
కాళ్ళకు చెప్పులు అడిగిందీ లేదు!
చాప వేసుకుని పడుకున్నదీ లేదు!
చేసిన అప్పులతో నిద్ర పోయిందీ లేదు!

వీపుమీద ఎక్కించుకుని
ఊరంతా తిప్పేవారు!

పడుకున్నానని చూడక
నిద్రలేపి మిఠాయి ఇచ్చి
తినమనేవారు!

తలకు నూనె పూసుకున్నదీ లేదు!
అద్దంలో చూసుకున్నది లేదు!
ఆయనకు తెలిసిందల్లా పనీ!పనీ! 
అందుకే నాన్నకు అరచేతిలో రేఖలు లేవు!!

అమ్మను బొమ్మలా
పదిలంగా చూసుకునేవారు!
నేను పెళ్ళి చేసుకుని 
అత్తారింటికెళ్ళిపోయిన రోజు
నాన్న కంట తడిపెట్టిన
క్షణాలు మరచిపోలేను!

జ్వరమొచ్చి పడుకున్నాసరే
మాత్ర వేసుకున్నది లేదు
 
వేడి వేడన్నం
ఒక్కరోజూ మా నాన్న తిన్నది లేదు
చేయి చాచి అడగకముందే
మనసెరిగి కొనిచ్చేవారు 
నాకు తెలిసిన శ్రమజీవి
ఇంకెవరూ లేరు మా నాన్నలా! 

నాన్న చేయి పట్టుకుని 
నడుస్తున్నప్పుడు
వీధికే కొత్త అందాలొస్తాయి! 

నాన్న ప్రేమతో 
నుదుటిపై ముద్దిచ్చినప్పుడు
మీసాలు గుచ్చుకున్నా
కోపం వచ్చేది కాదు!!

నాన్న ప్రేమా
నాన్న శ్రమా
చిరస్మరణీయం

(ఈ నాలుగు ముక్కల వెనుక ఓ నేపథ్యముంది. సీనియర్ పాత్రికేయులు తోట భావనారారయణగారు నిన్నరాత్రి తమిళంలో ఓ పాట లింక్ వాట్సప్ లో పంపుతూ మీకిది నచ్చొచ్చు అన్నారు. పాట తాలూకు స్క్రిప్ట్ కూడా పంపారు తమిళంలో. పాట విన్నాను. అది ఓ కూతురు తన తండ్రిపై పాడిన పాట. భావనారాయణగారు చెప్పినట్టే పాటెంతో నచ్చింది. ఏకాదశి అనే ఆయన పాట రాయగా రాజలక్ష్మి అనే అమ్మాయి ఆలపించారు. పాట రూపంలో నాకు రాయడం చేతకాదు. కనుక ఆ పాటలోనే అక్కడక్కడా కొన్ని మార్పులు చేస్తూ తెలుగులోకి అనువదించాను. మంచి పాట వినమని లింక్ పంపిన భావనారాయణ గారికి నమస్సులు)కామెంట్‌లు