*గురువు*:-వురిమళ్ల సునంద ఖమ్మం

 అక్షరాలు నేర్పించును గురువు
అమ్మఒడిని మరిపించును గురువు
నాన్నంత బాధ్యతరా  గురువు
బామ్మంత సూక్తి సుధరా గురువు... 
చ1:-
శిలవంటి చిన్నారుల శిల్పంగా చెక్కుతాడు
జ్ఞాన మనే ప్రాణ మిచ్చి వెలుగు దివ్వె అవుతాడు
అక్షర నక్షత్రాలను దోసిళ్ళలో నింపుతాాడు
ధృవతారగ నిలవాలని దీవెనలు ఇస్తాడు...
 !! అక్షరాలు!!
2:-
అమ్మ నేర్పు మాటలకు నగిషీలు దిద్దుతాడు
నాన్న చూపు బాధ్యతకు భరోసాగా నిలుస్తాడు
బామ్మ చెప్పు సూక్తులకు భాష్యమేదో చెబుతాడు
తాత చెప్పు కథలకు రంగులను అద్దుతాడు
!! అక్షరాలు!! 
3:-
భాషలోని మాధుర్యపు రుచులను తినిపిస్తాడు
పౌరునిగా  విధులేమిటో చక్కగ వివరిస్తాడు
లెక్క తప్పితే వచ్చు ఫలితమేంటో చెబుతాడు
సైన్స్ లోని గొప్పతనం నిరూపించి చూపుతాడు
!! గురువు!! 
4:-
మానవతా విలువలను మదితో వినమంటాడు
జాలి దయ ప్రేమ కరుణ అర్థమే
తానవుతాడు
విలువలకు పాదులేసి తోటమాలి అవుతాడు
సమాజంలో గురువెప్పుడు గురుస్థాన మంటాడు.. 
!! గురువు!!
కామెంట్‌లు