ఆకలి...అచ్యుతుని రాజ్యశ్రీ

 "అమ్మా ఆకలి!తింటానికి ఏదైనా ఇవ్వండి "ఆపిల్లాడు బస్సు స్టాప్ లో అడుగుకుంటున్నాడు. "ఇంద తీసుకో" బిస్కెట్టు పాకెట్ ఇచ్చింది తల్లి. "పాపం!ఆపిల్లాడి జుట్టు చింపిరిగా ఉంది. చిరిగిన చొక్కా లాగూ?వాడికి అమ్మా నాన్న లేరా"పదేళ్ల కూతురు అడిగింది. "పాపం!చనిపోయారో?విడిచి పెట్టారో?కిడ్నాప్ చేసి ఈబాబుని బిచ్చగాడుగా మార్చారేమో?"తల్లి మాటలు కు పాప అంది"అమ్మా!నా లంచ్ బాక్స్ లోని  చపాతీలు కూడా ఇవ్వు."అలాగే వాడికి చపాతీలు కూర కాగితంలో పెట్టి ఇచ్చింది. పాప ఆలోచిస్తోంది. బడిలో అంతా రెండు బాక్స్ లలో అన్నం చిరుతిళ్లు తెచ్చుకుంటారు. అంతా పంచుకుని తింటారు. ఎన్నో రకాల కూరలు !అలా పంచుకుని తినటం మజాగా ఉంటుంది. పాపం  ఆపిల్లాడుబడికి వెళ్లడు.మధ్యాహ్నం భోజనం దొరకదు.  ఆరోజు టి.వి.చూస్తోంది పాప. పటాసులు తయారు చేసే కర్మాగారం లో హఠాత్తుగా మంటలు చెలరేగి పదిమంది బాలలదుర్మరణం అనే వార్తతో పాటు వారి కాలిన శవాలు చూసి  కన్నీరు కార్చసాగింది.తండ్రి మధు అన్నాడు "చిన్న పిల్లలను టపాకాయలు చేసేచోట గాజుల పరిశ్రమలో ఇనపసామానుల తయారీ లో  పనికి పెట్టుకోరాదు.ఆయజమానికి శిక్ష పడుతుంది. "
ఇంతలో పక్క ఇంటి లో నుంచి  కెవ్వున కేకలు ఏడుపు వినపడసాగాయి."అమ్మా!సార్!మీకాళ్లకి మొక్కుతా!"పనిపిల్ల ఏడ్పు!మధు వెంటనే ఆఇంటితలుపు తట్టాడు.ఓ ఐదు నిముషాల తర్వాత కాలింగ్ బెల్ మోగటంతో విసుగ్గా తలుపు తెరిచాడు ఆయన.ఎదురుగా వాతలుపడ్డ వీపు మొహంతోఆపనిపిల్ల ఏడుస్తూనే ఉంది. "ఈపిల్ల మా ఆవిడ చెవిదిద్దులుకాజేసి వంటింటి గూటిలో దాచింది."నవ్వు పులుముకుంటూ అన్నాడు."సార్!అమ్మ తలస్నానం చేస్తూ గట్టుపై పెడితే స్టవ్ తుడుస్తూ నేను గూటిలో పెట్టాను అంతే!"
"మాకు ఆఫీసుహడావిడి. చేతికి ఇవ్వలేదు ఎందుకు?"ఆమె భర్తకు వత్తాసు పలికింది. "నిన్న మాఫ్రెండ్ ఇచ్చిన కాఫీకప్పు  పగలగొట్టింది.నామనసు గిలగిలలాడింది".
మధు వెంటనే అందుకున్నాడు"పిల్లా జెల్లలేనిమీరు ఇంకా ప్రేమగా ఆప్యాయంగా ఆపిల్లని చూడాలి. తండ్రి లేని పాప ని భరోసా తో ఆమెతల్లి పంపింది. మీపుట్టింటి నించి తెచ్చారు గదా అమ్మా!ఆపిల్ల ను లోపలపెట్టి తాళం వేసి ఆఫీసు కి వెళ్లుతారు.లోపల గ్యాస్ స్టవ్  ఫ్రిజ్!కరెంటు షార్ట్ సర్క్యూట్  అయితే  ఆపిల్ల గతేంటి?నేను క్రైంబ్రాంచి లో పనిచేస్తున్నాను.మీపై కేసు పెట్టి  పాపని  రెస్క్యూ హోంలో చేరుస్తా."ఆపనిపాప ఏడుపు ఆపేసి అంది"సార్!వారిని జైలుకి పంపొద్దు.నాకు తిండి  బట్ట ఇస్తున్నారు. మా అమ్మ దగ్గరకు పంపండి. "ఆమె మాటలకు అంతా సిగ్గు తో తలవాల్చారు.
కామెంట్‌లు