నా చిన్నప్పుడు మా పక్కూరు దొర ఇంట్లో జరిగిన ఘటన చుట్టూ పదూళ్ళల్లో కలకలం రేపింది. దొరసాని పదితులాల కాసులపేరు ఇంట్లోది ఇంట్లోనే మాయమయ్యిందంట! ఎంత దేవులాడినా దొరకలేదట!
దాంతో రోజూ ఇంటికొచ్చి పన్జేసిపోయే చాకలి-మంగళ్ళను , జీతగాళ్ళను ,ఎంత బెదిరించి అడిగినా వాళ్ళంతా "మాకు అర్మం కర్మం తెలవది మీ బంగ్లాల కెల్లి మీ కన్ను గప్పి బంగారం ఎత్త్కపొయ్యే తాఖత్ మాకుందా? అసలు బంగ్లా లోపల్కి మేమెందుకొస్తం దొరా! బైట బైట మా పన్లేందో మేం జేస్కోని మాతొవ్వనమేంపోతం గాని" అంటు బదులిచ్చారు
మన ఇంట్లె నగబోయిందంటే మనకెంత నామర్దా!?అనుకున్న దొర దొరసాని ఆఖరికి చిన్నప్పట్నుండి తమ ఇంట్లో నమ్మకంగా పన్జేసే నల్గురు పిల్లల తల్లి గొల్ల ఏశక్క జీవితకాల నమ్మకాన్నిగూడా విస్మరించి "మా ఇంట్లె ఎక్కడ ఏముండేది నీకుదప్ప ఎవ్వలకు తెల్వదు ఆనగ నువ్వే తీసుంట "వంటూ ఏశక్కను నిర్భందిం చారు దాంతో ఏశక్క "ఇంత పిల్లప్పటి నుంచి మీ ఇంట్లె కుక్క లెక్క ఇస్వాసంగ పన్జేస్తున్న నా గునమేందో మీకు తెల్వదా"ని లబలబ మని నెత్తీ నోరు కొట్టుకుంటు తన బిడ్డల మీద ఒట్లు పెట్టు కుంటూ వాళ్ళ కాళ్ళ మీద పడింది మనసు కరగని వాళ్ళు ఆరాత్రి ఏశక్కకు తొండలెక్కించారు ఆమె హృదయ విదారక మైన ఏడ్పుతో ఊరు ఊరే కరిగి నీరయ్యింది తప్ప వాళ్ళ రాతి గుండెలు కరగలేదు
మరునాడు పొద్దున్నే ఏశక్కను స్టేషన్ కి కొంచబోను పోలీసు లొచ్చిండ్రు! ఊరు ఊరంతా దొర బంగ్లాముందటి కొచ్చింది గాని ఇది అన్యాయమని నోరిప్పలేక పోయింది పోలీపుల వెనుక నడవలేక నడుస్తున్న తల్లిని జూసి ఘొల్లున ఏడుస్తూ ఉరికొచ్చిన పిల్లలు నలుగురూ ఆవిడ కాళ్ళకు చుట్టుకు పోయారు ఆతల్లీ పిల్లల రోదన చూసిన ఊరు మౌన దుఃఖ సంద్రంగా నిశ్చలన చిత్రమై పోయింది అంతా చూస్తుండ గానే పోలీసుల వెనుక విలవిల్లా డుతూ ఊరుదాటిన ఏశక్క మూత్రం వస్తుందంటూ పోలీసులకు సైగ జేసింది
అటు పొయ్యి రమ్మంటు దారి పక్క దొర మోటబాయి దిబ్బ దిక్కు చూపించారు వాళ్ళు
మెల్లగా బాయి గడ్డ వెనక్కి వెళ్ళిన ఏశక్క కొంగున రాళ్ళు మూటగట్టుకొని నిశ్శబ్దంగా బాయిలోకి జారిపోయింది
ఎంతసేపటికీ రాని ఏశక్కను పిల్చుకుంటూ పోలీసులు గడ్డ వెనక్కి వెళ్ళి చూస్తే ఆవిడ కన్పించక పోవడంతో... అదిరిపడిన పోలీసులు బాయి దగ్గరికి పరుగుతీశారు అప్పటికే ఏశక్క అడుగుపట్టింది
'ఊరి నుండి వచ్చిన దొరసాని తమ్ముడే ఆ కాసులపేరు దొంగిలించిన సంగతి' ఏశక్కతో పాటే సమాధి అయిపోయింది
నిజం తెలిసినా దొరసాని తన పుట్టింటివాళ్ళ గౌరవానికి భంగమొస్తుందని నోరువిప్పలే...!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి