దానగుణం.: -తాటికోల పద్మావతి గుంటూరు.

 మానసికంగా ఎదగడానికి కూడా కొన్ని అలవాట్లను నేర్చుకోవాలి. వాటిల్లో దాన గుణం 1. చిన్న వయస్సులోనే నేర్వ దగిన మరొక అలవాటు మనకు ఉన్న దానిలోనే కొంత మరొకరికి దానం చేయడం. ఈ భావన పిల్లల్లో సహజంగా ఉండదు. ఒక పిల్లవాడి వద్ద రెండు చాక్లెట్లు ఉంటే 2 తనకే కావాలంటాడు. అప్పుడు తల్లిదండ్రులు అందులో ఒకదాన్ని తమ్ముడికి ఇవ్వమని ప్రోత్సహించాలి. ఇంత మాత్రం చాలు. ఈ వయసులో మనం దానగుణాన్ని ప్రోత్సహించ కపోతే వాళ్లు పెరిగి పెద్దయ్యాక దుర్యోధనుడు తయారై ఆస్తిలో భాగం ఇవ్వ నంటారు. అప్పుడు తల్లిదండ్రులు తలలు పట్టుకొని లాభం లేదు. అలాగే కష్టంలో ఇతరులు ఉన్నప్పుడు అయ్యో పాపం, అనే అనుభూతిని పిల్లల్లో కలిగించాలి తప్ప, వాళ్లు ఎలాగైనా పాడైపోయిన నీ బ్రతుకు నువ్వు చూసుకో అని తల్లిదండ్రులు అనకూడదు. అలాగే పేదవారికి, అంగవైకల్యం ఉన్నవారికి, ఇరుగుపొరుగు లో వారికి ఏదో ఒక రీతిగా సాయం చేయటాన్ని తప్పకుండా నేర్పాలి. ఈ చిన్న పనులు పిల్లల్ని ఆదర్శమైన వ్యక్తిత్వం కలవాడుగా తీర్చిదిద్దటంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు అపకారం చేసిన వాళ్లను కూడా క్షమించడం, అలాంటి వాళ్లకు కూడా ఉపకారం చేయడం నేర్పితే ఆ పిల్లల్లో మహాత్ములు కొడతారు.
ఉపకారికి ఉపకారము,
విపరీతము కాదు సేయ వివరింపంగా,
అపకారికి ఉపకారము,
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.
ఇతరులు అపకారం చేశారని, మళ్లీ వాళ్లకు అదే అపకారాన్ని చేయాలనే దుర్బుద్ధి పిల్లల్లో చిన్న వయసులోనే తుడిచి వేయాలి. మహాభారతం బోధించిన గొప్ప ధర్మం ఇదే.

కామెంట్‌లు