మంచితనానికి పట్టాభిషేకం (కథ) సరికొండ శ్రీనివాసరాజు

 అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. అది అడవికి రాజు కాకపోయినా అన్ని జీవులతో స్నేహం చేస్తూ వాటికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేది. చాలా జంతువులు తమ అడవికి ఏనుగు రాజైతే బాగుండును అనుకునేది. ఇది అడవికి రాజైన సింహానికి తెలిసింది. ఏనుగును పిలిపించి ప్రత్యేకంగా అభినందించింది. ఏనుగుతో స్నేహం చేసింది. "నీ మంచితనంతో అందరినీ మెప్పించావు. నువ్వు ఈ అడవికి రాజువు కావడమే సరైనది." అన్నది సింహం. "ఆ కోరిక నాకు లేదు మహారాజా! నా చేతనైనంతలో ఈ అడవి జీవులకు సేవ చేసే భాగ్యం కలిగితే అదే చాలు." అంది ఏనుగు. "లేదు. నాకా వయసై పోతుంది. జంతువుల మనసును గెలుచుకున్న నువ్వు రాజువు అయితే బాగుంటుంది." అన్నది సింహం. "అడవి క్షేమం కోసం మీరు ఈ నిర్ణయం తీసుకుంటే కాదనేది ఏముంది? నాకు పదవి మీద కాంక్ష లేదు. కానీ ఈ విధంగా అయినా మరిన్ని సేవలు చేసే అదృష్టం కలుగుతుంది." అన్నది ఏనుగు. "ఒక మంచిరోజు చూసి నీకు అడవికి రాజుగా పట్టాభిషేకం చేస్తా." అన్నది సింహం. 

       రెండిటి స్నేహం రోజు రోజుకూ పెరుగుతుంది. ఒక దానిని విడిచి మరొకటి ఉండలేకపోతున్నాయి. ఒకరోజు సింహం, ఏనుగు అలా మాట్లాడుకుంటూ నిర్జీవ ప్రాంతానికి వెళ్తాయి. "ఓ దిక్కుమాలిన కరీ! నీకు రాజు పదవి కావలసి వచ్చిందా? దాని కోసమే జీవజాలాన్ని మంచి చేసుకుంటున్నావా? ఎప్పుడైనా అడవికి సింహమే రాజుగా ఉండటం ధర్మం. నిన్ను బ్రతకనిస్తే నా పదవికి ముప్పు వస్తుంది. చూడు. నిన్ను ఏం చేస్తానో." అని ఏనుగు మీదకు దాడికి దిగింది సింహం. హఠాత్తుగా అక్కడ అనేక జంతువులు ప్రత్యేక్షమై మూకుమ్మడిగా సింహంపై దాడి చేసి, దానిని మట్టి కరిపించాయి. ఏనుగు మీద ప్రేమతో సింహం పట్ల అనుమానంతో ఏనుగును నీడలా అనుసరిస్తున్నాయి ఆ జంతువులు. మంచితనం గెలిచింది. ఏనుగును అడవికి రాజుగా పట్టాభిషేకం చేశాయి ఆ అడవి జీవులు.

కామెంట్‌లు