పుస్తక ప్రేమ: -- యామిజాల జగదీశ్

 ప్రముఖ కవి డాక్టర్ ఎన్. గోపీగారు ఇటీవల వాట్సప్ లో ఏదో ఒక కవిత పంపుతూనే ఉన్నారు. అయితే నాకెంతో ప్రాణప్రదమైన పుస్తకాలకు సంబంధించి ఆయన రాసిన కవితలు రెండూ నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. తమిళ కవి వైరముత్తు పుస్తకాలపై రాసిన కవితొకటి చదివాను. అదీనూ నన్ను మురిపించింది. పుస్తకాలు నాకెప్పుడూ తోడే. అవి నన్నెంత వరకు ప్రేమిస్తున్నాయో నాకు తెలీదు కానీ వాటిని నేను నా తుదిశ్వాస వరకూ ప్రేమించాలనే ఆరాటపడుతున్నాను. ఈ ప్రేమ కించిత్ కూడా తగ్గకూడదు. పుస్తకాలపై ప్రేమ ప్రేమించే కొద్దీ పెరుగుతుందే తప్ప తరగదు. నిజమైన ప్రేమ కనుక. ఓ రెండు వారాల క్రితంకూడా ఓ ఆదివారంనాడు అబిడ్స్ వెళ్ళొచ్చాను పాతపుస్తకాలను చూడటానికి. ఓ మూడు గంటలుపైనే అబిడ్స్ ఫుట్ పాత్ లపై ఆనందంగా గడిపాను. హైదరాబాదులో నాకిష్టమైన ప్రాంతం ఏదని అడిగితే పుస్తకాలతో పలకరించే అబిడ్స్ ఫుట్ పాత్ లనే చెప్తాను. 
గోపీగారు తమ కవితలలో పుస్తకాలపై చెప్పిన మాటలలో కొన్నింటిని ఈ కింద పొందుపరిచాను.....
"సూర్యుడు చీకటిని
వెల్తురుతో కలిపి తాగే వేళ
నిద్ర లేస్తాన్నేను.
అటూ ఇటూ తిరుగుతూ
టీపాయి మీది పుస్తకాన్ని
ఆప్యాయంగా పలకరిస్తాను.
లేవగానే
పుస్తకాన్ని ముట్టుకోవాలి
ఫ్యాన్ గాలికి
రెప రెపల చప్పుడు వినాలి
తెల్లని కాగితం మీద
నల్లని విన్యాసాల్తో
వ్యత్యాస ప్రకాశాన్ని దర్శించాలి
గాలిలో వేళ్లు
గుణింతాల కనుగుణంగా కదలుతుండాలి.
నాలుగు మెతుకులు గతకంది
ఆకలి అణిగి పోదు
అలాగే అక్షరాలు
రెండు వాక్యాలైనా చదవక పోతే
మస్తిష్కంలో
ఒకానొక అమరిక జరగదు.
‘మూడ్’ అనేది ఒక తాడు
దానికి అల్లే తోరణాలే భావనలు....
పుస్తకాల పై పేరిన దుమ్మును
తుడువటానికి
ప్రత్యేకంగా ఓ గుడ్డ వుంది
శుద్ధి చేస్తున్నప్పుడు
మనస్సూ శుభ్ర పడుతున్న స్ఫురణ.
పుస్తకాలది
అదో రకం వాసన
బహుశా ఆదిమ కాలం నాటి
ఊపిరి పురి విప్పినట్టు....." అని రాసిన గోపీగారు మరొక కవితలో...
"మా వాడు ‘e-book చదువుతావా’ అన్నాడు
ఆజ్యం పోసిన మనసుతో
అటు వైపు తిరిగి పడుకున్నాను.
గుండె మీద పుస్తకం
ఆనించుకుంటే గాని నిద్ర పట్టదు....
ఎన్ని అనుభూతులు!
ఇచ్చి పుచ్చు కోవడాల్లో
ఎన్నెన్ని తియ్యటి అనుబంధాలు!!
వేళ్లు తాకక పోతే
‘మేరె మహబూబ్’ పాట
పుట్టి వుండేదా!
‘కృష్ణ పక్షం’ సంపుటంలో
దాచుకున్న పువ్వు
ఇప్పుడు వాడి వుండొచ్చు గాక
కాని అది జ్ఞాపకాలు పొదిగిన
మరో భావ ఖండిక.....
కొన్ని వేల పుస్తకాలు చదివాను
శుక్లాలు తేలాయి
కనులు అలిసి పోయినై గాని
అంతర్నేత్రానికి మాత్రం
అవి తాజా దృశ్యాలే....
మీరే మనుకున్నా పరవా లేదు
నా చితి పైన మాత్రం
ఓ పుస్తకం పెట్టడం
మరిచి పోకండి....." 
గోపీ గారూ, మీకు వందనాలు. మీ పుస్తకప్రేమ జన్మజన్మలకూ వర్థిల్లాలి.
నాకెంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలే మీ పుస్తక ప్రేమాభిమానాలను చదువుతుంటే. 

కామెంట్‌లు