అదొక మూడంతస్తుల మేడ. మూడో అంతస్తు వేరే గానీ అక్కడొక రేకుల షెడ్డు మాత్రమే ఉంటుంది. అందులో వాళ్ళ పాత సామాన్లు పెట్టుకునేవారు. ఈ మధ్యనే వాచ్ మెన్ కుటుంబానికి ఇచ్చారు. వాచ్ మెన్ కు ఇద్దరు పిల్లలున్నారు చిన్నవాళ్ళు. ఏడేళ్ళ కొడుకు నేలుగేళ్ళ కూతురు ఉన్నారు.
ఆ చిన్న రేకుల షెడ్డు తప్పించి మిగతా అంతా ఖాళీనే. పిల్లలిద్దరూ ఆ ఖాళి ప్రదేశమంతా చక్కగా ఆడుకుంటున్నారు. కింద నుంచీ పొడవుగా పెరిగిన కొబ్బరి చెట్లు ప్రహరి గోడను తాకుతూ ఉంటాయి. అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ కొబ్బరి బూరలు చేసుకొని ఊదుకుంటారు. కొబ్బరి ఆకులతో వాచీలు, ఉంగరాలు తయారు చేసి చేతికి పెట్టుకొని మురిసి పోతారు. ఆ ఖాళీలో దొంగ పోలీస్,తొక్కుడు బిళ్ళ లాంటి ఎన్నో ఆటలు ఆడుకుంటారు. అంత పెద్ద సితిలో వాళ్ళకు ఇలాంటి వాతావరణం దొరకడం అదృష్టం. అంత పెద్ద భవంతిలో ఉండే ఓనర్ల పిల్లలకు ఇటువంటి అవకాశమే లేదు. ఆ ఇంటికి వాచ్ మెన్ గా పని చేసే వాళ్ళ పిల్లలకు ఎంత అదృష్టమో !
ఆ బుజ్జి పిల్లలకు తోడుగా పెద్ద ప్రాంగణం కొబ్బరి చెట్లు మాత్రమే కాదు చెట్టు మీద వాలే కాకులు, పిచ్చుకలు, ఉడుతలు ఎన్నో వచ్చి పిల్లలతోను స్నేహం చేసేవి అందులో ఒక ఉడుత దైర్యంగా కిందకు దిగి పిల్లల దగ్గరకు వచ్చేది. పిల్లలు వాళ్ళు తినేదేదో పెట్టేవారు. అది తినేది పరి పోయేది కాదు వాళ్ళతో స్నేహం చేసేది.
పిల్లల స్నేహం చూసి వాళ్ళ తల్లీతండ్రి, అన్నం మెతుకులు, మొక్కజొన్న పొత్తులు తెచ్చి ప్రహరి గోడ మీద పెట్టేవారు. ఉడుత కొబ్బరి చెట్టు నుంచీ దిగి వచ్చి అవి తిని తోక ఊపేది పిల్లలు సంబరంగా చప్పట్లు కొట్టేవారు కిలకిలమని నవ్వేవారు. వాళ్ళ నవ్వులు దానికి ఆనందాన్ని ఇచ్చేవేమో. మాటి మాటికి కొబ్బరి చెట్టు మీద నుంచీ దిగడం, ఎక్కడం చేసేది. అలా చూస్తూ పిల్లలు నవ్వులు పూయించే వాళ్ళు.
ఒకరోజు పిల్లలు నిద్రలేచేసరికి అక్కడ చెట్లు లేవు. కిందికి చూస్తే కొట్టేసిన చెట్లను డోన్లలో తీసుకు వెళ్తున్నారు కూలీలు. “ ఈ ఇల్లు అపార్టు మెంట్లకు ఇస్తున్నారంట మనమూ ఖాళీ చేయాలి” తండ్రి దిగులుగా చెప్పాడు. పిల్లల మొహాల్లో ఏడుపు దైన్యం కనిపించాయి. “ ఉడుత ఎక్కడకు వెళ్లి ఉంటుంది నాన్నా”? అడిగింది చిన్ను. “ఏమోనమ్మా! అది కూడా మనలాగే కొత్త ఇల్లు వెతుక్కుంటూ వెల్లుంటుంది” తండ్రి దిగులుగా చెప్పాడు. అప్పటి నుండి పిల్లల మొహాల్లో నవ్వులు కరువయ్యాయి.
చిన్నూ – ఉడుత: --డా.. కందేపి రాణీప్రసాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి