వర్షం వస్తే బడి బంద్!:-- దోర్బల బాలశేఖరశర్మ

 అప్పట్లో (1968-73) రామాయంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నేను చదివే రోజుల్లో వర్షాకాలం కొంచెం జల్లులు ఎక్కువైనాయంటే, స్కూలు బంద్ పెట్టేవారు. మా 'గవర్నమెంట్ ప్రైమరీ స్కూలు' పట్టణంలోని బస్టాండు మార్గంలో మిషన్ దవాఖాన రోడ్డుకు ఎదురుగా వున్న మరో రోడ్డు పక్కన వుండేది. అందులో నేను వరుసగా ఒకటి నుంచి అయిదో తరగతి వరకు చదివాను.
అదొక పాత, విశాలమైన ఇల్లు. అందులోనే స్కూలు నడిపేవారు. పాతదే అయినా ఎంతో విశాలంగా వుండేది. స్కూలుకు రెండు వైపులా తలుపులు వుండేవి. తూర్పు వైపు వున్న మెయిన్ ద్వారం నుంచి లోపలికి వెళ్ళేవాళ్ళం. మొదట పెద్ద వరండా, దాని ముందు ఖాళీ ప్రదేశం. ఈ వరండానే మూడు, నాలుగు భాగాలు చేసి మూన్నాలుగు తరగతుల గదులుగా మార్చారు. ఎదురుగా, లోపలి వైపు కొన్ని గదులు వుండేవి. ఆ గదుల పక్క వున్న చిన్న సందులోంచి ముందుకు వెళితే, మరో విశాలమైన స్థలం. అక్కడే హెచ్.ఎం. గది వుండేది. ఈ ప్రదేశంలోనే ప్రార్థన జరిగేది. 
వర్షం ఎక్కువై, జోరుగా పడితే, వరండా గదులు సగం వరకు తడిసి పోయేవి.  పిల్లలు కూర్చునే బెంచీలపైకి నీళ్ళు వచ్చేవి. అందుకే, పిల్లలకు సెలవు ప్రకటించేవారు. మా ఇంటినుంచి ఈ స్కూలు అర కిలోమీటరు దూరమైనా వుంటుంది. మామూలు ముసురు వర్షంలో నేను పుస్తకాలు తడవకుండా అంగి లోపల దాచుకొని స్కూలుకు వెళ్లిన రోజులు ఎన్నో. అప్పట్లో వర్షాకాలం అంటే ముసురు పట్టి, అదే పనిగా రోజుల తరబడి వానలు కురిసేవి. అప్పుడప్పుడు పెద్దవాన పడేది. ఇప్పటిలా అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి వానలు వుండేవి కావు. నాకు తెలిసి, మా రామాయంపేట మల్లె చెరువు ఇటీవలి భారీ వర్షాలకు నిండినంతగా ఎప్పుడూ నిండలేదు. అంతగా కరువు తాండవం చేసేది. ప్రత్యేకించి మా ఊరు భౌగోళికంగా ఎంతో ఎత్తులో వుండటం వల్ల చుట్టుముట్టు కురిసే సాధారణ వర్షాలకైనా నోచుకోవడం లేదని పెద్దలు అనడం నేను చిన్నప్పుడే విన్నాను.
నేను చదువుకున్న పై ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన భవనం ఇప్పుడు అక్కడ లేదు. దానిని కొన్నెండ్ల కిందటే కూల్చేసినట్టున్నారు. దాని స్థానంలో కొత్త ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్సులు వెలిశాయి. బస్సు దిగి ఆ ప్రాంతం మీదుగా వెళుతున్నప్పుడల్లా నాకు అప్పటి స్కూలు జ్ఞాపకాలే గుర్తుకు వస్తుంటాయి.

కామెంట్‌లు