ఏమని రాయను?:-త్రిపురారి పద్మ జనగామ

అక్షరాలు అరిగిపోతున్నాయి.
పదాలు పలిగిపోతున్నాయి.
భావాలు భస్మమవుతున్నాయి.
కలాలు కమిలి పోతున్నాయి.

ఏమని రాయను?
అతివలపై అరాచకానికి అంతులేదని రాయనా?
అరిచి అరిచి ఘీ పెట్టినా
మగువలకు రక్షణ కరువని రాయనా.

ఏమని రాయను?

అంతరిక్షం అంచులు తాకినా
అవనిపై వనితకు మిగిలేది వగపే అని చెప్పనా.

ఎలా తెలుపను?

మహిళలపై జరిగే అమానుషాలకు అంతులేదన్న విషయం 
విషంకన్నా ప్రమాదకరంగా
పలుమార్లు ఋజువవుతుంటే,
అభం శుభం తెలియని చిన్నారులు అకృత్యాలకు బలవుతుంటే
మూగబోయి రోదిస్తున్న
హృదయాల అంతరాంతర అగాధాల ఆవేదనను ఎలా తెలుపను?

ఏమని తెలుపను?

కవితలు కదన కాళికలై
అక్షర సమరం చేసినా
మారని మనుషుల తీరు
చూసి విసిగి విసిగి వేసారిన
మనసులు విరిగి తరిగి అరిగిపోతున్నాయని తెలుపనా.

ఎలా చెప్పను?

రాయవలసింది జరుగుతున్న సంఘటనలపై నిరసన సరులు మాత్రమే కాదు.
నిషేధించవలసినది పెడదారుల చిత్రాల
చిత్తరువుల లోకాన్నని.

ఎలా?ఎలా?ఎలా?ఎలా చెప్పాలి?

సంస్కారం నడయాడిన నేలపైన
కుసంస్కారం తాండవించడమే సకల అనర్ధాలకు మూలమని.


ఏమని?ఏమని?ఏమని?ఏమని చెప్పాలి?

అమానవీయ అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే,
బాధ్యతగల పౌరులను తయారు చేసే
సంస్కారవంతమైన
సమాజం బాధ్యత
మరింత పెరిగే
 చర్యలు పటిష్ఠం కావాలని.


(మానవ మృగాలకు బలైపోయిన మహిళలకు,పసిపాపలకు ఆత్మశాంతి చేకూరి,వారి ఆత్మ శక్తి,శక్తిస్వరూపిణిగా మారి సమాజ సంస్కారానికి నడుం బిగించాలని ఆశిస్తున్నాను.)


           .
కామెంట్‌లు