ఆదరణ ఆప్యాయత కమ్మని గళం ఆమె సొంతం!:- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 నిగర్వం ఆప్యాయత ఆదరణ అద్భుత మేధాశక్తి ఆమె సొంతం. ఆమె మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.ఆమెయే ఆల్రౌండర్ హైమవతి భీమన్న గారు. ఫోన్ ద్వారా  ఆమె బాల్య స్మృతులు సేకరించాను.
------------------------------------------------------------------------------
ఏడుగురు అన్న దమ్ముల మధ్య  అపురూపం గా పెరిగిన రాకుమారి.అమ్మ వెంకటలక్ష్మి నాన్న సుబ్బయ్య దీక్షితులు గారి  గారాలపట్టి.నిప్పులు కడిగే వేదపండిత కుటుంబం. నాన్న గారి వద్ద పద్యాలు విని నేర్చుకునే వారు.తమ ఇంటి కి  ఎంతో మంది సాహితీ వేత్తలు వచ్చి పోతుండేవారు.ఆటలాడుతూ యధాలాపంగా చెవినపడిన వాటిని  ఆచిన్నారి  బుర్రలో పదిలంగా దాచుకునే వారు.
ఒకసారి అన్నంతిన్నాక కంచంతీసి శుద్ధి పెట్టలేదు అని మేనత్త  బిందెడు నీళ్ళు ఈచిన్నారి తలపై కుమ్మరించింది.విపరీతమైన మడి ఆచారం తో మేనత్త  కుంపటిలోని నిప్పులు కడిగి  ఆరబోసేది.ఈచిన్నారి మాత్రం  అబ్బాయిలాగానే ఆడుతూ పాడుతూ పెరిగింది. అన్న తమ్ముల చొక్కాలు వేసుకుని చెట్లు ఎక్కేది.ఎవరైనా "నీవు  అమ్మాయివా అబ్బాయివా?"అని అడిగితే  అబ్బాయిని అని చెప్పి  గలగలా నవ్వేది.ఆరోజుల్లో  మద్రాసు లోని మైలాపూర్ లో ఉన్న చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్లో తెలుగు మీడియం  అప్పర్ ప్రైమరీ బడిలో చదివారు.ప్రిన్సిపాల్ శ్రీ వి.ఎన్.శర్మ గారు  ఆయన జర్మన్ భార్య  ఈమెను ఎంతో  ప్రోత్సహించారు. ఆయన ముగ్గురు కూతుళ్లు గీత రుక్మిణి  శకుంతల కూడా  స్నేహితులు. ఆటపాటలు నాటకాలు అన్నిటిలో చురుగ్గా పాల్గొనేది చిన్నారి హైమ.ఇక సినిమా నటుల పిల్లలు బాపూగారి తమ్ముడు జమున గారి తమ్ముడు నిప్పాణి గిరిధర్ రేలంగి గారి కొడుకు  అంతా క్లాస్మేట్స్. ఒకసారి  నాటకంలో పాత్ర కోసం  తల్లి రెండు పేటల బంగారు గొలుసు వేసుకుని డ్రామా ఐనాక అక్కడ ఆమె మర్చిపోతే  శర్మగారు గుర్తించి  వెంటనే ఇంటికి  తీసుకుని వచ్చి ఇచ్చారు. అదో మరపురాని అనుభవం.ఆనాడు తమటీచర్లు రామలక్ష్మి ఆరుద్ర  మాలతీచందూర్ గారి అక్క శారదాంబగారు.చదువు సంగీతం డాన్స్  చేతిపనులు బొమ్మల తయారీ తో ఆబడి పిల్లల పూలతోటలా ఉండేది. ఇప్పటికీ  నూరేళ్ల పండగ చేసుకున్న ఆబడిఉంది.4వక్లాస్ లో ఉన్న తనచేత శారదాంబగారు భర్తృహరి పద్యాలు కృష్ణ నిర్యాణపద్యాలు వల్లెవేయించారు అని చెప్పారు హైమవతిగారు. 1953లో శారదాంబగారికి జబ్బు చేస్తే  ఆకబురు తెలిసిన హైమ రామేశ్వరం నించి  ఆమెను చూడాలని వెళ్లటం ఆమె గురు భక్తి కి నిదర్శనం. అప్పుడుఆమె అన్నల దగ్గర ఉన్నారుట. తమిళ హిందీ ఉర్దూ కన్నడ ఆంగ్ల భాషల్లో  ప్రవేశం ఉంది. హైస్కూల్ చదువు కేసరికుటీరంలో కొనసాగించారు.ఎస్.ఎస్.ఎల్.సి.దాకా  ఎంతో మంది హేమాహేమీల పిల్లలు తనసీనియర్ జూనియర్  క్లాస్మేట్స్  అని చెప్పారు.రేలంగి గారు  వారి అబ్బాయిని తీసుకుని వెళ్లటానికి కారులో రాగానే హైమ పాతాళ భైరవి సినిమాలోని ఆయన పాట వినవే బాలా నా ప్రేమగోల అని పాడితే  ఆయన నవ్వేవారు.అంత చిలిపిచేష్టలు హైమవతి  ఆంధ్ర బాలానందసంఘం రేడియో అన్నయ్య కి మహా ముద్దు  ఇష్టం కూడా. న్యాయపతి రాఘవరావు అన్నయ్య గారి వల్ల రేడియో పిల్లల ప్రోగ్రాంలో తరచు ఈమె పాల్గొని రేడియో కళాకారిణి గా డ్రామాఆర్టిస్ట్ గా ఇప్పటికీ  పాల్గొంటున్నారు. ప్రోగ్రాం కాగానే టిఫిన్ పెట్టించి వ్యాన్ లో దింపేవారు అన్నయ్య. మద్రాసు బీచ్ లో అబ్బాయిలతో కలిసి పతంగులు ఎగరేయటం గోళీలు  బొంగరాలు వాలీబాల్  తో సహా ఆడేవారు.70వ ఏటకూడా మామిడి కుదురులో వాలీబాల్  ఆడారు.లేనిది వయసు  ఉన్నది మనసు అని శ్రీమతి హైమవతి గారు  చెప్తుంటే  ఇంకా వినాలని అనిపించింది.కానీ అవన్నీ  పుస్తకంగా వస్తే  బాగుంటుంది అని నా ఉద్దేశం.

కామెంట్‌లు