ఉన్నదెందుకు:- సత్యవాణి

 ఎందుకు ఎందుకు ఎందుకు
అవును ఎందుకు
నోరున్నదెందుకు
తిట్టడానికీ తినడానికేనా
విప్పవా నోరు తిప్పలు 
వచ్చిమీద పడుతున్నా
ఎదిరించవా ఎలుగెత్తవా
తప్పు ఇదని ఖండించవా
తుప్పు పట్టిన కరవాలంలా
మప్పితంగా మూడుపూటలా 
తిని తొంగుంటావా
చెప్పు తీయవా
చెంపలపై వాయించవా
అన్యాయమిదని 
ఆక్రోసించవా
మరి నోరున్నదెందుకు
తిట్టడానికీ తినడానికేనా
మప్పితంగా మూడుపూటలా మెక్కడానికేనా
తమకు హాని కలుగుతుందని గుర్తిస్తే
అరచి గోలచేస్తాయి పక్షులు
పోగౌతాయి గుంపులుగా
పొడిచి పొడిచి శత్రువును చంపుతాయి 
పుట్టజోలికొస్తే పడకుట్టుతాయి చీమల గుంపులు
తేనె పట్టును తాకితేచాలు
తరిమితరిమి తుపాకీ తూటాలలాంటి 
ముళ్ళుదించుతాయి తేనెటీగలు
కుక్క ముందున్న కూటిగిన్నెను తాకితే
చెడగరచి చేటు చేస్తుంది
మరి మనిషివి నువ్వు
ఏంచేస్తున్నావు ఇంతింత
అన్యాయాలు జరుగుతుంటే
ఇప్పవా నోటిని
తిట్టడానికీ తినడానికి తప్ప
ఎత్తవా చేయి
ముద్ద నోటపెట్టడానికి తప్ప
నూరవా కత్తిని
పళ్ళనుతప్ప
చిత్తు చేసి తరిమేయవా
శత్రువన్నవాడిని
మత్తులోనే మునిగుటావా
మాటలతోనైనా ఎదరించవా
మహా వినాశనాన్ని
జాతినే నాశనం చేసుకొంటావా
జనాన్ని కూడగట్టి ఎదరించలేక
జవాబు చెప్పవలసి వుంటుంది
రేపటి తరానికి నువ్వు
                
కామెంట్‌లు