అసలైన నేను ఏది?

 *రమణ మహర్షి గారు చెప్పిన "నాన్ యారు" కి దగ్గరగా వుంది*
*ప్రత్యగాత్మ అంటే ఏమిటి?*
*పరం బ్రహ్మ ప్రత్యగాత్మభూతమ్* (కఠోపనిషత్ - సంబంధ భాష్యం )
*పరమాత్మ మీ హృదయంలో ప్రత్యగాత్మ రూపంగా కలదు.*
*అసలు ఈ ఆత్మేమిటి, దానికి ప్రత్యక్ అన్న ప్రత్యయం ఎందుకు చేర్చినట్టు? ఇక్కడ ఆత్మా అంటే "నేను" అని అర్థం. ప్రత్యగాత్మ అంటే "అసలు సిసలు నేను" అని అర్థం. "కల్తీ నేను", "అసలు సిసలు నేను" అని ఉంటుందా? ఉంటుంది.*
*ప్రత్యగాత్మా = ప్రతి+అక్+ఆత్మా. ప్రతి అంటే వెనుకకు అని. అక్ అంటే వెళ్ళుట. అక్ అనేది అఞ్చ్ అనే ఒక ధాతువు నుండి వచ్చింది. అఞ్చ్ గతౌ అని ధాతుపాఠం. వెనుకకు వెళ్ళటం అంటే ఏ వెనుకకు వెళ్ళాలి?*
*సాధారణంగా "నేను" అనడిగితే ఈ దేహేంద్రియ మనస్సంఘాతాన్ని చూపిస్తాం, అలానే అనుకుంటాం కూడా. ఈ దేహమే నేనని అనుకుంటే అది అసలైన నేను కాదు. వెనక్కి వెళ్ళు - చేతులు, కాళ్ళు, వాగింద్రియము, పాయు-ఉపస్థములు అనబడే కర్మేంద్రియములు, ఇంకా వెనక్కి వెళితే ఉన్న కన్ను, చెవి, నాలుక, చర్మము, ముక్కు అనబడే జ్ఞానేంద్రియములు, ఇవేవీ అసలైన నేను కాదు. ఇంకా వెనక్కి వెళితే ఉండే ఆలోచనలు, భావావేశాలు (emotions) ఇవేవీ కూడా అసలైన నేను కాదు. ఇంకాస్త వెనక్కి వెళితే కల బుద్ధిలో పాండిత్యము, ఫిజిక్స్, వ్యాకరణం, తర్కం ఇత్యాదులు ఉంటాయి, ఇవేవీ అసలైన నేను కాదు. ఇంకా వెనకన ఈ దేహమే నేను, ఈ పని లేదా కర్మ చేస్తున్నవాడిని నేను, దాని ఫలాన్ని కోరేవాడిని నేను, పుట్టాను నేను, పోతాను నేను అని ఇన్ని రకాలుగా అనుకునే ఈ నేనుకి అహంకారము అని పేరు. అది కూడా అసలైన నేను కాదు.*
*మరి అసలైన నేను ఏది?*
*ఏదైతే దేహము కాదో, దేహానికి సాక్షియో, ఏది కర్మేంద్రియములు కాదో, కర్మేంద్రియములకు సాక్షియో, ఏది జ్ఞానేంద్రియములు కాదో, జ్ఞానేంద్రియములకు సాక్షియో, ఏది మనస్సు కాదో, మనస్సుకు సాక్షియో, ఏది బుద్ధికాదో, బుద్ధికి సాక్షియో, ఏది అహంకారము కాదో, అహంకారమునకు సాక్షిగా నిలచియున్న ఏ చైతన్యము కలదో, ఆ ఎరుక, అదియే ప్రత్యగాత్మా. ఆ ప్రత్యగాత్మయే అసలు సిసలైన నేను. అటువంటి ప్రత్యగాత్మగా, అసలు సిసలు నేనుగా విరాజిల్లుతున్నదే ఆ పరమాత్మ.*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు