కవితలు : పెద్ది సాంబశివ రావు
తెలుగు భాష కొరకు తెలిపినారు సరళ
నూత్న రీతి రాసినారు కవులు
గొప్ప కారె చలము, గురజాడ, శ్రీశ్రీ లు
జంక దగునె కొత్తదారి చూచి. 
 
కవితకు ప్రాణమొస్తే
మదిలో మెదిలిన భావనలు
ధరించెను అక్షర రూపములు.
అక్షరాలు పదములై, పదములే కవితలై
మిగిలిపోయె నెన్నాళ్లో
కాగితాల మడతలలో.
అక్షరాలు స్వరములై
పదములు పల్లవులై
గాయక గళమున వెలువడ
పొంగి పోవు కవి హృదయము
తన కవితకు ప్రాణము రాగా.
తోటమాలి
ఏ మాలి పెంచెనో ఈ లేత అంట్లను
ఏమిచ్చి సాకెనో ఈ పండ్ల మొక్కలను
గారాల నీడలో స్వేదాల నీరోసి
ప్రేమానురాగాల ఎరువులే వేసెనా?
త్యాగాల తెరగట్టెనా తెగుళ్లేవీ సోకకుండా.
నలుగురికీ నీడను, పదిమందికీ పండ్లను పంచే
ఈ లేత అంట్లను ఏ మాలి పెంచెనో?
ఇంత సుందరంగా, ఇంత సుకుమారంగా
ఏ తల్లి పెంచెనో ఈ చిన్ని పాపలను? 
స్నేహం
ఇద్దరు వ్యక్తుల్లో
ఒకరి బాధ ఇంకొకరి బాధగా 
ఒకరి హాయి మరొకరి హాయిగా 
అనిపిస్తే వారే మిత్రులు, 
విరుద్ధంగా అనిపిస్తే వారే శత్రువులు.
యాత్ర
స్థిరమైన రహదారిపైన
చరమైన వాహనంతో
జడమైన చెట్లను దాటుతూ
చేతనుడైన మనిషి
సాగించేది జీవనయాత్ర.
దారివెంట మైలు రాళ్లు
కాలానికి కొలరాళ్లు.

ఇంజనీరు
ఎండే గుండెలు తడపటానికి
మండే కడుపులు నింపటానికి
కట్టే వారధికి సారధి ఇంజనీరు.
అతని నిజాయితీ నీరుగారితే
కారే కన్నీళ్లకు కాల్వలు చాలవు.

పరిమితి
 ఎందుకోయ్ సాగరుడా
అహంకారం నీకు?
నదుల శీలాన్ని బలి గొన్నాననా?
ఆ జీవితాలను నల్లగా మార్చినందుకా?
తీపి మనసులను ఉప్పగా చేశాననా?
ఎందుకు నీకీ అహంకారం?
నీ బలానికి పరిమితులు ఉన్నాయి గుర్తుంచుకో.
నిరంతరం ప్రయత్నిస్తూ, నీ అలలతో హింసిస్తూ
ఆ బండరాతిని ఒక్క వీసం కదిలించలేక పోయావు.
ఇంకా ఎందుకు గర్జిస్తావ్?
తల వంచి వెనక్కు పోవోయ్...


కామెంట్‌లు