న్యాయమూర్తి...అచ్యుతుని రాజ్యశ్రీ

 పూనా రాజధానిగా రఘునాధరావు పరిపాలిస్తున్నరోజులవి.ఒకసారి సభలో ఇలా అన్నాడు"సైనికులతోపాటు రాజులంతా అప్రమత్తంగా ఉండాలి. మైసూర్ నవాబు హైదరాలీ పొగరు అణచాలి.ఈ ధరిత్రిపై పాపపుభారం రోజు రోజుకీ పెరిగిపోతోంది. "అంతే అతిస్వల్ప కాలంలోనే 80వేలమంది సైనికులు సిద్దంగా ఉన్నారు. ప్రతి పల్లె పట్టణంనించి వేలాది యువకులు తమ రాజ్యరక్షణకై నగరానికి ఉరుకులు పరుగులతో వచ్చారు.శంఖారావం తో స్త్రీలుతమ భర్తలు కొడుకులు సోదరులకు వీరతిలకం దిద్ది మంగళహారతులు పట్టారు.
తన గుర్రంపై ఎక్కి రాజు  ముందుకి సాగుతున్నాడు.వీరులంతా జయజయధ్వానాలు చేస్తూ సముద్రపు కెరటాలు లాగా విరుచుకు పడసాగారు. నగరప్రవేశద్వారం దగ్గరకు రాగానే  రాజు తటాలున  గుర్రం దిగి భక్తి శ్రద్ధలతో ఒక వ్యక్తి కి  అభివాదం చేశాడు. ఇంత భారీ సైన్యాన్ని  ఒక్క ఉదుటున ఆపిన ఆమహానుభావుడు ఎవరా అని అంతా కుతూహలంగా  కళ్ళు విప్పార్చుకుని చూడసాగారు. ఆయనే న్యాయమూర్తి రామశాస్త్రి. తన రెండు చేతులు పైకెత్తి "జయహో మహారాజా!మీ అపరాధంకి శిక్ష అనుభవించకుండా నగరం నించి ఎందుకు బైటికి వెళ్లుతున్నారు?"అని నిలదీశాడు. ఆయన మేఘగర్జనకు అంతా నిశబ్దం అలుముకుంది.యుద్ధభేరీలు ఆగాయి.సైనికులు  ఏమిజరగబోతోంది అని ఊపిరి బిగబట్టి చూడసాగారు. రాజు అన్నాడు "న్యాయానికే పతి ఐన మీకు ఇవే నా నమోవాకములు.ఈరోజు యవనులపీచం అణచాలని బైలుదేరాను.నన్ను ఎందుకు  అడ్డగిస్తున్నారు?" "రాజా!మీరు ఇంత పెద్దసైన్యానికి అధిపతి.కానీ న్యాయసింహాసనం ముందు  అంతా సమానమే!న్యాయ దేవత ముందు మీరు నేరస్తులు. మీపై మేనల్లుడిని  హత్య చేసిన నేరారోపణ ఉంది. ఆనేర విచారణ  తీర్పు వచ్చేదాకా ఈ రాజ్యం లో బందీగా ఉండి తీరాలి. ఈనగరాన్ని విడిచి వెళ్లే నైతిక హక్కు మీకు లేదు. "
 రాజు నవ్వుతూ అన్నాడు"మహామాన్యా! నేను రాజ్యసుస్థిరతకై  ప్రయత్నం చేస్తున్నాను. ఈసమయంలో నన్ను ఆటపట్టించటం భావ్యమా?"  "ప్రభూ!ఆటపాట సమయంకాదు.ఆవిధాతయే మనల్ని  అపహసిస్తాడు." రాజు కోపంతో రంకెలేయసాగాడు."మీరు నారాజ్యంలో ఒక ఉద్యోగి.మీప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిన పని నాకు లేదు. " పీష్వా తన గుర్రంని ముందుకి  పోనిచ్చాడు.రామశాస్త్రి  నిర్భయంగా అన్నాడు "నేను కూడా  మీకోసం  నటించలేను.కానీ భవిష్యత్తులో మీ ఆత్మ  మిమ్మల్ని నిలదీస్తుంది. న్యాయాధీశునిగా నేను ఈ పదవిలో ఉండలేను.మీరాజ్యం మీ ఇష్టం"అనేసి తన పల్లెలోని చిన్న కుటీరం లో శేషజీవితం గడిపాడు.అదీ నిబద్ధత అంటే!
కామెంట్‌లు