సైన్స్ మాష్టారుకి పాదాభివందనం:-- యామిజాల జగదీశ్ నేను ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకూ చదువుకున్నదంతా మద్రాసులోని శ్రీరామకృష్ణా మిషనే.
ఒకటి నుంచి అయిదు వరకూ టీ.నగర్లోని మహారాజపురం సంతానం రోడ్డు (మా చిన్నతనంలో దీనిని గిరిఫిత్ రోడ్డు అనేవారు. మహారాజపురం సంతానం ప్రముఖ సంగీత విద్వాంసులు)లో ఉన్న రామకృష్ణా మిషన్ ఎలిమెంటరీ స్కూల్లో చదివాను. ఆరవ తరగతి నుంచి ఎస్.ఎస్.ఎల్. సి. వరకూ పనగల్ పార్క్ ఎదురుగా ఉన్న రామకృష్ణా మిషన్ బాయిస్ హైస్కూల్లో చదువుకున్నాను. పియుసి, డిగ్రీ మైలాపూరులో ఉన్న వివేకానందా కాలేజీలో చదివాను. 
ఒకటో క్లాసులో మా టీచర్ అన్నపూర్ణగారు. హైస్కూల్లో పైతరగతులకు సైన్స్ మాష్టారు కోరాడ రామచంద్ర శాస్త్రిగారు పాఠాలు చెప్పేవారు. చెప్పుకోవలసిన విషయమేమిటంటే, మా అయిదుగురు అన్నదమ్ములం ఆయన దగ్గరే సైన్స్ పాఠాలు చదువుకున్నాం. మా మూడో అన్నయ్య ఆంజనేయులు స్కూల్ ఫైనల్ గట్టెక్కడానికి ముఖ్యకారకులు ఆయనే. ఇంటికొచ్చి వాడికి పాఠాలు చెప్పేవారు. తిలక్ స్ట్రీట్లో ఓ చిన్న పెంకుటింట్లో అద్దెకుండే వాళ్ళం. ఆ ఇంట ఆయన నేల మీద సైన్స్ కి సంబంధించిన బొమ్మలు వేస్తూ పాఠం చెప్పడం ఇప్పటికీ నాకు గుర్తే. 
ఇక్కడే ఇంకొక ఆసక్తికరమైన విషయం... 
నా క్లాస్ మేట్ మోచర్ల ప్రభాకర్ వాళ్ళ నాన్నగారు (కీ.శే.  మృత్యుంజయ రావుగారు), ఇద్దరు బాబాయిలు (మోచర్ల రామారావు గారు, లక్ష్మీనాథ్ గారు) కూడా మేము చదువుకున్న రామకృష్ణా మిషన్ హైస్కూల్లోనే చదువుకోవడం. పైగా ప్రభాకర్ బాబాయిలిద్దరూ సైన్స్ మాష్టారు శిష్యులే. అలాగే ప్రభాకర్ తమ్ముడు రవికూడా మా స్కూల్లో విద్యార్థే. 
నాకు సైన్స్ మాష్టారంటే ఒకింత భయమే. ఆయనే కాదు, అప్పట్లో ఏ మాష్టారుని చూసినా భయమే. వాళ్ళబ్బాయి సూర్యనారాయణ నా క్లాస్ మేటే. నాకు పరిచయమైన రోజుల్లో సైన్స్ మాష్టారు మాంబళం హైరోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకుండేవారు. సూరి కోసం వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడల్లా వాళ్ళమ్మగారితోనే చనువుగా మాట్లాడేవాడిని. ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు.
ఇటీవలే సూరి వాళ్ళ పెద్దన్నయ్య మనోహర్ గారితో మాట్లాడటం మొదలుపెట్టి మాష్టారుగారి కొన్ని ఫోటోలు తెప్పించుకున్నాను. ప్రస్తుతం మనోహర్, సూరి, వాళ్ళ తమ్ముడు విశ్వనాథ శర్మ హైదరాబాదులోనే ఉంటున్నారు.  సూరి వాళ్ళ రెండో అన్నయ్య రామకృష్ణతోనూ నాకు చనువుండేది. సూరి వాళ్ళ అక్కయ్య జయంతి వాణిగారుకూడా పరిచయమే. ఆమె మా నాన్నగారి శిష్యురాలే. ఆమె ఇప్పుడు కాశీలో ఉంటున్నారు. 
మా క్లాస్ మేట్ ఉప్పులూరి కృష్ణమోహన్  అన్నయ్యలు దత్తాత్రేయ, సీతాపతి కూడా మాష్టారుగారి దగ్గరే చదువుకున్నారు. 
నా క్లాస్ మేట్ కృష్ణమోహన్ అన్నయ్య సీతాపతి రావుగారితో మాట్లాడినప్పుడు మాష్టారు గారి గురించి కొన్ని విషయాలు గుర్తు చేసుకున్నారు.
1952 - 57 సంవత్సరాల మధ్య రామకృష్ణా మిషన్ హైస్కూల్లోనే చదువుకున్న సీతాపతిరావు గారు మాష్టారుగారికి జ్ఞాపకశక్తి ఎక్కువన్నారు. 
అందరికి ఆయన సైన్స్ మాష్టారుగానే తెలుసుకానీ, తెలియని విషయమేమిటంటే ఆయన ఎం.ఎ. తెలుగు చదివారన్నది అని సీతాపతిగారు చెప్పారు. అప్పట్లో ఒక సబ్జెక్టుకి నెలకు పది రూపాయలు ట్యూషన్ ఫీజు. అయితే నెలకు యాబై రూపాయలిచ్చి మా అన్నదమ్ములం ఆయన దగ్గర ట్యూషన్ చెప్పించుకున్నారట. వారి ఇంటికెళ్ళి పాఠాలు చెప్పేవారట. ఒకవేళ ఆయన రాలేని పక్షంలో ట్యూషన్ కోసం ఐస్ హౌస్ లో ఇంటికి రమ్మనేవారట. అలా మాష్టారు గారింటికి వెళ్ళినప్పుడు ఆయన స్నేక్స్ ఇచ్చి మరీ పాఠం చెప్పేవారట. సైన్స్ తోపాటు తెలుగు పాఠాలుకూడా చెప్పేవారట.
చాలా ఏళ్ళ తర్వాత మాష్టారు గారిని అమీర్ పేటలోని కెనరా బ్యాంకులో ఓరోజు ఆకస్మికంగా కలిసారట సీతాపతిగారు. మాష్టారుగారు బ్యాంక్ క్యాషియర్ కౌంటర్ దగ్గర నిల్చుని ఉన్నప్పుడు గుర్తుపట్టి మాట్లాడానన్నారు సీతాపతిగారు. ఆ తర్వాత ఆయన హైదరాబాదులోనే ఉంటున్న విషయాన్ని తెలిసిన వారందరికీ తెలియజేసానన్నారు సీతాపతిగారు.
ఇలావుండగా, మనోహర్ గారితో మాట్లాడినప్పుడు తన క్లాస్ మేట్ రవిశంకర్ గురించి చెప్పగా ఆయనతోనూ ఫోన్లో మాట్లా డాను. రవిశంకర్ గారు 1966 ఎస్.ఎస్.ఎల్.సి బ్యాచ్. ఈయన తమిళనాడులో పదిహేడు మంది పోలీస్ కమిషనర్ల దగ్గర పని చేసారట. రవిశంకర్, మనోహర్ మాంబళం స్టేషన్ సమీపంలో ఉన్న ఓ హిందీ విద్యాలయంలో ప్రైవేటుగా చదివారు. రవిశంకర్ ఇప్పుడు మద్రాసులోనే నంగనల్లూరులో ఉంటున్నారు. రవిశంకర్ గారు మా లెక్కల మాష్టారు గోపాలాచారిగారి పెళ్ళికి హాజరయ్యారట. అలాగే రవిశంకర్ గారి ఉపనయనానికి గోపాలాచారిగారొచ్చి ఆశీర్వదించారట. 
1918 జూన్ 15వ తేదీన అమలాపురంలో జన్మించిన రామచంద్ర శాస్త్రిగారి తల్లిదండ్రులు అన్నపూర్ణ, రామకృష్ణయ్యగారు. మాష్టారుగారి చదువుసంధ్యలు  అమలాపురం, బందరు, విజయనగరం, మద్రాసులలో కొనసాగాయి.  మద్రాసు పచ్చయ్యప్ప కళాశాలలో డిగ్రీ చదివారు. 
మాష్టారుగారి తండ్రిగారు కీ.శే. శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారుగారు మద్రాసు విశ్వవిద్యాలయంలో  తెలుగు విభాగం అధిపతిగా పని చేశారు. 
1943 లో విజయవాడలో కమర్షియల్ టాక్సస్ శాఖలో చేరడంతో తమ ఉద్యోగ జీవితానికి శ్రీకారం చుట్టారు.  కొంత కాలం ఢిల్లీలో తపాలా శాఖలోనూ, అనంతరం సిమ్లాలో కార్మిక శాఖలోనూ ఉద్యోగాలు చేసిన మాష్టారుగారు  రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సిమ్లాలో ఉద్యోగాన్ని విడిచిపెట్టి మద్రాసుకి చేరుకున్నారు.  
అధ్యాపక రంగానికి సంబంధించి ఆయన మాస్టారుగా చేసిన తొలి ఉద్యోగం 1945 లో గూడూరు మునిసిపల్ హైస్కూల్లో.
1946-47 లో సిఎస్ఎం హైస్కూలు (అరక్కోణం) లో అధ్యాపకులుగా భూగోళ శాస్త్రంలో పాఠాలు చెప్పారు. ఇది క్రిస్టియన్ మిషనరీ స్కూలు. క్రిస్టియన్ గా మారితే జీతం పెంచుతామని యాజమాన్యంవారు  చెప్పగా "ససేమిరా" అంటూ మాష్టారుగారు అక్కడ ఉద్యోగం మానేసారు.
మరుసటి ఏడాది (1947-48) మద్రాసు హిందూ హైస్కూలులో సైన్స్ మాష్టారుగా పాఠాలు చెప్పారు.  
ఇక 1948-49లో మెస్టన్ ట్రైనింగ్ కాలేజీలో (మద్రాసు)  బీ.టీ. (Bachelor of Training) అభ్యసించాక  1949 లో శ్రీ రామకృష్ణమిషన్ స్కూలులో సైన్స్ మాష్టారుగా చేరారు. ఆయన జీవితంలో ఇదొక ముఖ్యమైన అధ్యాయంగా చెప్పుకోవాలి. అప్పట్లో స్వామి చిన్మాత్రానంద మహరాజ్ శ్రీ రామకృష్ణామిషన్ అధిపతిగా ఉండేవారు. 
మాస్టారుగారు స్కూల్లో ఉద్యోగం చేస్తూనే పైచదువులు  ప్యాసయ్యారు. 
1970 లో మాస్టారుగారి ప్రోద్బలంతోనే శ్రీరామకృష్ణమిషన్ స్కూలు విద్యార్ధులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సైన్స్ ప్రదర్శనలో  పాల్గొని ప్రశంసలందుకోవడం విశేషం. 
మాస్టారు 1978 లో శ్రీ రామకృష్ణమిషన్ స్కూల్ నుంచి పదవీ విరమణ చేసారు. 
ఆయన సతీమణి (అనసూయ దేవిగారు)  2015 లో తనువు చాలించారు. మాష్టారు గారు 1989లో మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి స్ధిరపడ్డారు.
మాష్టారుగారి తండ్రి కోరాడ రామకృష్ణయ్యగారు తెలుగు - సంస్కృత భాషా పండితులు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో అమ్మమ్మ ఇంట 1891 అక్టోబర్ 2 వ తేదీన జన్మించిన రామకృష్ణయ్య గారి జననీజనకులు సీతమ్మ, లక్ష్మీమనోహరం. ఈయన ప్రాథమిక విద్యానంతరం మచిలీపట్నం నోబుల్ కళాశాలలో 1915లో బీ.ఏ. పూర్తి చేసారు. లెక్చరర్ గా కొన్ని విద్యా సంస్థలలో ఉద్యోగం చేసి, ఆపై 1921లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ పూర్తి చేసారు. విజయనగరం మహారాజాకళాశాలలో తెలుగు, సంస్కృతం బోధించిన ఈయన 1927లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో రీడర్ గా చేరారు. 1950లో పదవీ విరమణ చేసాక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాచ్య పరిశోధనాలయంలో రీడర్ గా ఆరు సంవత్సరాలు పనిచేసారు. ఆయన 1962, మార్చి 28 న కాలధర్మం చెందారు. 
మా మాష్టారుగారికి ఇద్దరు తమ్ముళ్ళు (మహదేవశాస్త్రిగారు. నాగేశ్వరరావుగారు), ఇద్దరు చెల్లెళ్ళు (సీతాదేవిగారు, కమలాదేవిగారు). 
మాష్టారుగారి పెద్ద తమ్ముడు డాక్టర్‌ కోరాడ మహాదేవ శాస్త్రిగారు 1921లో జన్మించి 95 ఏళ్ళు జీవించారు. విద్యావంతుడిగా సాహిత్యసేవ చేస్తూ, మిత్రులను శిష్యులను హృదయపూర్వకంగా పలకరించే వారు. తండ్రికి తగ్గ తనయులనిపించుకున్న మహదేవ శాస్త్రిగారు సంస్కృతం, తెలుగు, ఆంగ్లం మొదలైన భాషల్లో గొప్ప పండితులు. ‘హిస్టారికల్‌ గ్రామర్‌ ఆఫ్‌ తెలుగు’ అనే గ్రంథానికి డి.లిట్‌ పట్టం పొందిన ఈయన  అణ్ణామలై, శ్రీ వెంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా పనిచేశారు. 1976-78లో జర్మనీలోని కొలోన విశ్వవిద్యాలయంలో విజిటింగ్‌ ప్రొఫెసరుగా ఉండిన శాస్త్రిగారు  ఇంగ్లీషు ద్వారా తెలుగు నేర్చుకోవడానికి వీలుగా ‘‘ఆధునిక తెలుగు కరదీపిక’’ పుస్తకం రాశారు. ఈ కరదీపిక తెలుగు నేర్చుకోవాలనుకునే విదేశీయులకు అత్యంత ఉపయుక్తమైన గ్రంథం. ‘ఆంధ్ర వాఙ్మయ పరిచయము’, ‘వ్యాకరణ దీపిక’, ‘తెలుగుదేశ్యవ్యుత్పత్తి నిఘంటువు’, ‘నన్నెచోడుని కుమార సంభవము’ వంటి గ్రంథాలు రాసిన మహాదేవ శాస్ర్తి గారికి భాష, సంస్కృతిలపై ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. 
మొత్తంమీద కోరాడ వారి కుటుంబం సరస్వతీ నిలయమే అనడం అతిశయోక్తి కాదు. 
ఆయన దగ్గర చదువుకుని 1971లో ఎస్ ఎస్ ఎల్ సి ప్యాసైన మా మిత్రబృందం హరి నాగభూషణం, పిల్లలమర్రి శివప్రసాద్, ప్రభాకర్, రంగారావు, భాస్కరరామమూర్తి, భాస్కరరాజు, రవిశంకర్, చిలకలపూడి సురేష్, కరుణాకర్, దిలీప్, చల్లా సుబ్బారావుల తదితరుల తరఫున ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని మాష్టారుగారికి ఈ నాలుగు మాటలతో పాదాభివందనం చేస్తున్నాను. 

కామెంట్‌లు