తగిన శాస్తి (కథ) -- సరికొండ శ్రీనివాసరాజు


  ఆ అడవికి రాజైన సింహం తన పరిపాలనలో సౌలభ్యం కోసం వివిధ జంతువులకు వివిధ శాఖలు కేటాయించింది. నక్కను మంత్రిగా చేసింది ‌ అడవిని మానవుల నుంచి రక్షించేందుకు రక్షణ శాఖను పెద్దపులికి అప్పగించింది. అడవి జీవులకు విద్య నేర్పడానికి విద్యాశాఖను ఎలుగుబంటికి అప్పజెప్పింది. ఇలా చాలా రకాల శాఖలను కేటాయించి, వాటిని వివిధ జంతువులకు అప్పజెప్పింది. మొదట్లో సింహం పరిపాలన చాలా బాగుండేది. రాను రాను సింహంలో స్వార్థం పెరిగింది. తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. విచక్షణా రహితంగా వేటను మొదలు పెట్టింది. అడవి జీవులలో భయం పెరిగింది. ఏ రోజు ఏ జీవులు సింహానికి ఆహారం అవుతాయో తెలియదు. సింహానికి తగ్గట్లు సింహం దగ్గర మంత్రులు కూడా అలాగే తయారయ్యారు. విచక్షణా రహితంగా వేటను కొనసాగిస్తున్నాయి. 


       ఆ అడవి రక్షణ బాధ్యతను మేధావి ఏనుగు స్వీకరించింది. యథాశక్తి అడవి అంతా తిరుగుతూ జంతువులను రక్షిస్తుంది. వాటికి ఏ సహాయం కావాలన్నా చేస్తుంది. అడవి జీవులను కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూస్తుంది. అడవి జీవులన్నీ ఏనుగు తమ రాజైతే బాగుంటుంది అనుకుంటున్నాయి. అంతకు ముందు సింహాన్ని కూడా అడవి జీవులే ఎక్కువ మంది కోరిక మేరకు రాజును చేశాయి. ఆ అడవిలో నిబంధనల ప్రకారం ఏ రాజు పరిపాలన కాలం అయినా మూడు సంవత్సరాలే. ఆ తరువాత జంతువుల, పక్షుల సమావేశం ఏర్పాటు చేసి ఎక్కవ జీవుల కోరిక మేరకు కొత్త రాజును ఎన్నుకోవాలి. 


       సింహం పరిపాలన కాలం ముగియబోతుంది. రాబోయే ఎన్నికలలో ఏనుగు గెలవబోతుందని సింహం దగ్గర మంత్రులుగా పని చేస్తున్న నక్క, పులి, ఎలుగుబంటి తదితర జీవులకు అర్థం అయింది. అన్నీ తమ పదవులను వదిలిపెట్టి ఏనుగు వైపు చేరాయి. అంత వరకు సింహంలా క్రూరంగా ప్రవర్తించిన ఆ జంతువులు సాధు జంతువుల్లా ప్రవర్తిస్తూ అడవి జీవులకు సేవలు చేస్తున్నాయి. సింహం పరిపాలనలో లోపాలను చెబుతూ, ఏనుగు రాజైతే ఎంత బాగుంటుందో ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికలు వచ్చాయి. మేధావి ఏనుగును రాజుగా ఎన్నుకున్నాయి అడవి జీవులు. ఏనుగు తన పరిపాలనలో సింహం లాగా వివిధ జంతువులకు వివిధ శాఖలు కేటాయించింది. అయితే ఏనుగు అడవి అంతా తిరుగుతూ వివిధ జంతువులతో అనుబంధాన్ని ఏర్పరచుకుంది కాబట్టి వాటి క్రమశిక్షణ, మంచితనం ఆధారంగా వాటికి అర్హమైన శాఖలను అప్పగించింది. ఇది అన్యాయమని, మేము జంతువులకు ఎన్నో సేవలు చేస్తున్నామని సింహం వద్ద పనిచేసి, ఎన్నికల సమయంలో ఏనుగు వైపు వచ్చి, ఏనుగును పొగిడిన జంతువులు అన్నాయి. ‌‌‌‌‌"ఈ మూడేళ్ళలో మీరు చేసిన సేవలు ఏమిటో మొత్తం నాకు తెలుసు. కేవలం ఎన్నికల సమయంలో ఎవరు గెలిస్తారో అని అంచనా వేసి, పదవుల కోసం వాళ్ళ వైపు రావడం సరికాదు. జీవులకు సేవ చేసే అవకాశం ఒక అదృష్టం. ఈ మూడేళ్ళూ మీరు అలా సేవ చేస్తే మీరు సింహం దగ్గర ఉండి నా వైపు రాకున్నా మీకు బాధ్యతలు అప్పగించేది. కాబట్టి ఇక నుంచైనా మంచిగా మారండి. ఇన్నాళ్ళూ నాకేం పదవి ఉందని సేవలు చేశాను? ఇది మీకు కనువిప్పు కావాలి." అన్నది కరిరాజు. అవి నిరాశగా వెనుదిరిగాయి.


కామెంట్‌లు