ఎంఎల్ వసంతకుమారి సంగతులు:-- యామిజాల జగదీశ్




 మదరాస్ లలితాంగి వసంతకుమారి అనే ఎం.ఎల్. వసంతకుమారిగారు 1928 జూలై మూడో తేదీన జన్మించారు. తమిళంలో తండ్రి పేరులోని మొదటి అక్షరంగా (ఇనిషియల్) రాసుకునే ఆరోజుల్లో అందుకు బదులు తల్లి పేరుని మొదటి అక్షరంగా చేసుకున్నవారే ఎం.ఎల్. వసంతకుమారి. 
ఆమె తండ్రి పేరు అయ్యాసామి అయ్యర్. అమ్మ లలితాంగి. వీరిద్దరూ గాయకులే. అలాగని తండ్రేమీ వేదికలెక్కి పాడేవారుకాదు. నేర్పించేవారు. సేవా సదన్లో పని చేస్తుండేవారు. ఆయనకు ఉత్తర భారత దేశ సంగీతంపై మక్కువెక్కువ. ఈ కారణంగా ఆయన కలకత్తా, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్ళి హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నారు. రాజాయి, ముసిరి, అరియకుడి రామానుజం, మహారాజపురం, వంటివారు ఆయన దగ్గర కొన్ని కీర్తనలు నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన లలితాంగిని కలవడం, ఇష్టపడటం, పెళ్ళి చేసుకోవడం జరిగిపోయాయి. ఆమె కచ్చేరీలు చేసేవారు.తొలి రోజుల్లో ఆమె కోయంబత్తూరు తాయిదగ్గర శిష్యరికం చేశారు. అనంతరం ఫ్లూట్ సుబ్బరామన. దగ్గర పాటలు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆమె భర్త దగ్గరే శిక్షణ పొందారు ఆస్థ్మాతో బాధపడటంవల్ల చాలా బాధపడుతూ వచ్చిన ఆమె నలబై ఏళ్ళకే పాడలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె ఆయనకు రెండో భార్య. కనుక వారి మధ్య ఇరవై ఏళ్ళపైనే తేడా ఉండేది. ఆమె 1955లో తన 49వ ఏట మరణించారు. ఆయన 1963లో కన్నుమూశారు.
ఎనిమిదో ఏట నుంచే వసంతకుమారిగారు తన తల్లితో కలిసి పాడుతూ వచ్చారు.
అప్పట్లో చిన్నపిల్లలకోసం ఆకాశవాణిలో పాడే అవకాశం ఇవ్వడంతో వసంతకుమారి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. పదిహేను నిముషాలు పాడటానికి పదిహేను రూపాయలిచ్చేవారు.
 వసంతకుమారి తల్లిదండ్రులకు పురందరదాస్ మీద అచంచలమైన భక్తిప్రపత్తులుం డేవి. కనుక పురందర దాస్ కీర్తనలను పాడి ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి తీవ్ర కృషి చేశారు. అయితే తమ కుమార్తెను డాక్టరుగా చూడాలనుకుని తల్లిదండ్రులు ఆమెను చెన్నైలో ఓ కాన్వెంట్ స్కూల్లో చేర్చారు.  ఇంటిదగ్గర సంగీతంలో శిక్షణ కొనసాగించారు.
ఓమారు లలితాంగి కచ్చేరీలో పాడుతుండగా వసంతకుమారి కూడా కలిసి పాడారు. ఆమె స్వరం మధురంగా ఉండటంతో నాటి ప్రముఖ సంగీత విద్వాంసుడు జి.ఎన్. బాలసుబ్రమణ్యన్ వసంతకుమారిని తన శిష్యురాలిగా చేసుకోవాలనుకున్నారు. ఈ విషయమై ఆవిడ తల్లిదండ్రులతో మాట్లాడారు. వాళ్ళు సరేననడంతో వసంతకుమారి జీవితంలో అది ఓ గొప్ప మలుపే అని చెప్పుకోవచ్చు. జీ.ఎన్.బికి శిష్యురాలై సంగీతంలోని మెకువలన్నింటినీ తెలుసుకున్నారు. అంతేకాదు, జీఎన్బీకి మొట్టమొదటి శిష్యురాలైన ఘనత వసంతకుమారిగారికి దక్కింది.
 1940లో తల్లితో కలిసి సిమ్లాలో కచ్చేరీ చేసిన ఎం.ఎల్.వి ఆ తర్వాత బెంగళూరులో విడిగా పాడే అవకాశం దక్కింది. ఆ వెంటనే ఆవిడ పాడిన గ్రామ్ ఫోన్ రికార్డుకూడా విడుదలైంది. స్వాతితిరునాళ్ తోడి రాగంలో కృతి అయిన సరసిజనాభ సోదరి....అని ఆమె లలితంగా పాడి అందరి మన్ననలు పొందారు. 
గురువుగారి ద్వారానూ అనేక అవకాశాలు పొందిన ఎంఎల్వీ ఓ గొప్ప గాత్రవిద్వాంసురాలిగా ప్రత్యేక స్థానాన్ని సంతరించుకోవడానికి దాదాపు పదేళ్ళు పట్టింది. సినిమాలో పాడే అవకాశాలూ వచ్చాయి. ఆవిడ గానమాధుర్యానికి ముగ్ధుడై ఎం.కె. త్యాగరాజ భాగవతార్ తాను నటించిన రాజముఖి చిత్రంలో పాడే అవకాశం కల్పించారు ఎంఎల్వీకి. 
నటి వి.ఎన్. జానకికి పాట పాడటం ద్వారా తమ సినీ జీవితానికి శ్రీకారం చుట్టినప్పుడు ఎంఎల్వీ వయస్సు ఇరవై ఏళ్ళు. అనంతరం అనేక అవకాశాలు వచ్చినప్పటికీ తనకిష్టమైన పాటలు మాత్రమే పాడుతూ వచ్చిన ఎంఎల్వీ భావానికి తగినట్లు పాడటం ద్వారా తనకో ప్రత్యేక గుర్తింపు పొందారు. 
రాజా దేశింగ్ అనే సినిమాలో షణ్ముఖప్రియ, కేదారగౌళ, అఠాణా, మోహనం, బిలహరి, కానడా, కాపీ తదితర ఎనిమి రాగాలలో "పార్కడల్ అలైమేలే .... " అనే దశావతార పాటను పాడగా దానికి విశేష ఆదరణ లభించింది.  తర్వాతికాలంలో పలు భరత నాట్య వేదికలపై కృడా ఈ పాట తప్పనిసరిగా వినిపించేది. అలాగే కచ్చేరీలలో ముగింపు పాటగా ఆమె ఈ పాటను పాడేవారు.
1951లో ఆమె వివాహం కృష్ణమూర్తితో జరిగింది. ఎంఎల్వీ పురోభివృద్ధిలో ఆయన పాత్ర అడుగడుగునా ఉండేది. ఓవైపు సినిమాలలో పాడుతూ వస్తున్నా శాస్త్రీయ కచ్చేరీలలో పాడటానికే ఆమె ఎక్కువ మక్కువ చూపడం విశేషం.
 మధురమైన గొంతు, స్పష్టమైన ఉచ్చారణ, భావ ప్రకటనకు పెట్టింది పేరైన ఎంఎల్వీ గారు ఓమారు పాడిన పాటను మరోసారి పాడేటప్పుడు కొత్త కొత్త సంగతులతో ప్రేక్షకులను అలరించేవారు. సభలలో ఎక్కువ పాడని రాగాలను తన స్వరంలో వినిపిస్తూ సంగీతప్రియులను ఆకట్టుకునేవారు. ఆలాపనప్పుడు విస్తారమైన కల్పనా స్వరాలతో ఆ రాగాన్ని, ఇతర రాగాలకూ ఉన్న తేడాలను వీనులవిందుగా ఆలపించేవారు.
 
తన తల్లిలాగే పురందరదాస్ కీర్తనల వ్యాప్తికి ఆవిడకూడా తన వంతు కృషి చేసారు.
తమిళ కీర్తనలకుకూడా అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు.
 
ఆవిడ పాడిన తిరుప్పావై, తిరువెంబావై పాటలు తమిళ సంగీతాభిమానుల ఇళ్ళల్లో ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి.
 
సమకాలికులైన ఎంఎస్. సుబ్బులక్ష్మి, ఎం.ఎల్. వసంతకుమారి, డి.కె. పట్టమ్మాళ్ లను సంగీత రాణులని, సంగీత ముమ్మూర్తులనీ, ముప్పెరుం దేవియర్ అనీ  వ్యవహరించేవారు.
 
హిందుస్తానీ సంగీత విద్వాంసుడు బడే గులాం అలీ ఖాన్ వంటివారు వసంతకుమారి గాత్రాన్ని ప్రశంసించేవారు.
 ప్రముఖ మృదంగ విద్వాంసుడు పాలక్కాడు మణి అయ్యర్ వంటి ప్రముఖులెందరో ఎంఎల్వీగారి కచ్చేరీలలో వాయిద్య సహకారం అందించారు.
 మామూలుగా సీనియర్ సంగీత విద్వాంసులకు మాత్రమే ప్రదానం చేసే కర్నాటక సంగీత ప్రపంచంలోని అత్యున్నత బిరుదైన సంగీత కళానిధిని ఎంఎల్వీకి నలభై తొమ్మిదో ఏట లభించడం విశేషం. మైసూర్ విశ్వవిద్యాలయం ఆవిడను డాక్టరేట్ పట్టాతో గౌరవించింది. ఇక భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో ఆవిడను సత్కరించింది.
 ఆవిడ సంగీత ప్రజ్ఞ గురించి శిష్యులలో ఒకరైన ప్రముఖ వయోలిన. విద్వాంసురాలైన ఎ. కన్యాకుమారి మాటలో....
 అక్కయ్య గారి ప్రతిభాపాటవాలు సాటి లేనివి. ఏ కచ్చేరీకైనాసరే ముందుగా ఆమె రిహార్సల్ చేసేవారుకాదు. అది రాగం తానం పల్లవి అయినా సరే రిహార్సల్ లేకుండానే వేదికపైకి వెళ్ళి పాడటం మొదలుపెట్టేవారు. ఎక్కడా తడబడేవారు కాదు..." అని చెప్పారు.
ఆవిడ శిష్యులలో మరొక ప్రముఖ గాయని సుధా రఘునాథన్. 
ఆమె మాట్లాడుతూ, తాను పన్నెండేళ్ళు ఆమె దగ్గర శిష్యరికం చేశానన్నారు. ఏ కచ్చేరీకైనా ముందుగా ఆమె రిహార్సల్ చేసే వారు కాదని, ఒక్కొక్కప్పుడు కారులో వెళ్తూ వెళ్తూ కూడా పల్లవిని సృజించడం ఎరుగుదునని అన్నారు. ఆమెకు సంగీతం మీద ఉన్న పట్టు ఆశ్చర్యమేస్తుందని చెప్పారు.
 తిరుచ్చూర్ రామచంద్రన్, చారుమతి రామచంద్రన్, యోగం సంతానం, శుభా గణేశన్, జ్యోతి మోహన్, జయంతి సుబ్రమణ్యం, వనజా నారాయణన్, టి.ఎం. ప్రభావతి, మీనా మోహన్, రోస్ మురళి కృష్ణన్, భామా విశ్వేశ్వరన్ అని పలువురు ఆమె దగ్గర శిష్యరికం చేసిన వారిలో ఉన్నారు.  పక్షపాతమనేది లేకుండా తనకు తెలిసింది నలుగురికీ చెప్పడం ఆమె సద్గుణం. 
పలువురు వాయిద్య కళాకారులకు ఆమె అనేక అవకాశాలు ఇచ్చారు. మన్నార్గుడి ఈశ్వరన్, కారైక్కుడి కృష్ణమూర్తి, శ్రీ ముష్ణం రాజారావు, తిరువారూర్ భక్తవత్సలం, జి. హరిశంకర్ వంటి కళాకారులంటే వసంతకుమారి గారికి ఎంతో అభిమానం. వారి భవిష్యత్తు కోసం ఎంతగానో దోహదపడ్డారు. దాదాపు ఆరు వందల సంగీత కార్యక్రమాలలోను, పలు గ్రామ్ ఫోన్ రికార్డులకు పాటలు పాడిన వసంతకుమారి గారు జె. కృష్ణమూర్తి ప్రారంభించిన రుషీవ్యాలీ స్కూల్ విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇచ్చారు.
 దాదాపు యాభై ఏళ్ళపాటు సంగీతమే శ్వాసగా జీవించిన వసంతకుమారిగారు తన జీవితాన్ని సంగీతానికి అర్పించారనడం అన్ని విధాలా సముచితం. ఆమె 1990 అక్టోబర్ 31వ తేదీన తమ 63వ ఏట కాలధర్మం చెందారు. ఆమె కుమార్తె, సినీ నటి శ్రీవిద్య క్యాన్సర్ తో చనిపోయారు.  తల్లి దగ్గర సంగీతం నేర్చుకున్నప్పటికీ సినిమా రంగానికి వెళ్ళిపోయారు. వసంతకుమారి కుమారుడు శంకరరామన్ తల్ని స్మృత్యర్థం అనేక మంచి కార్యక్రమాలు చేశారు.
ఇలా వసంతకుమారి గారి గురించి చెప్పుకోవడానికి ఎన్నో విషయాలున్నాయి.


కామెంట్‌లు