సామాజిక సేవాగుణం: - జగదీశ్ యామిజాల

యాంత్రికంగా సాగిపోతున్న 
నేటి ఆధునిక ప్రపంచంలో
తడి మనసులున్న పలువురు
సామాజిక సేవకు 
తమను అంకితం చేసుకుంటున్న 
వారుండటం గణనీయం
ప్రశంసనీయం

సేవ 
అందులోనూ నిస్వార్థ సేవ
ఎటువంటీ ప్రతిఫలం ఆశించక
సామాజిక సేవకు 
పూనుకోవాలంటే
ముందుగా ఉండాల్సింది
సామాజిక స్పృహ
అప్పుడే
తగిన వారికి
తగిన రీతిలో 
సముచితరీతిలో 
సాయమందించడం 
సాధ్యమవుతుంది
అది తెలిసి
నలుగురికీ
ఆదర్శప్రాయమై
సేవాదృక్పథం
విస్తరిస్తుంది

కొందరికి
మాట సాయం ఓదార్పయితే
ఇంకొందరికి
శారీరక సాయం తప్పనిసరవుతుంది
మరికొందరికి
ఆర్థిక సాయం అందించాల్సి ఉంటుంది
ఇందులో 
ఏ సాయానికైనా ప్రధానం
సామాజిక స్పృహ

ప్రభుత్వాలు
ఒక్కటే సేవాలందించాలనుకోకుండా
విశాలమైన హృదయంతో
సామాజిక సేవకు 
పూనుకున్న వారు
మనకు తటస్థపడుతూనే ఉంటారు

ప్రజలను ఆదుకుంటున్న
ప్రభుత్వ శక్తి, రాజకీయ శక్తి మల్లే
సామాజికసేవకు 
శ్రీకారం చుట్టిన 
మనసున్న మారాజులు 
ఉంటూనే ఉన్నారు

అనాథలకూ
అనారోగ్యంతో బాధపడుతున్నోళ్ళకూ
జీవితాన్నంకితం చేసిన 
మదర్ థెరెసా నిస్వార్థ సేవే
ఎందరికో ఆదర్శం

నాకెందుకనుకోక
అందరూ నావారనే 
మనసుంటేనే 
చేయందించగలం
సేవకు పూనుకోగలం
నలుగురినీ
చైతన్యపరచగలం

కరోనా పీడిత కాలంలో
ప్రాణాలను ఫణంగా పెట్టి
సేవలందించిన వైద్యులను
కంటికి రెప్పలా చూసుకున్న నర్సులను
అన్నంపెట్టి ఆదుకున్న వ్యక్తులను
ఎరుగుదును

ప్రచారార్భాటాలకతీతంగా
సామాజిక సేవలందించే వారందరూ
ప్రత్యక్ష దేవుళ్ళే!!
మానవ సేవే
మాధవ సేవ అన్న మాటకు
ప్రత్యక్ష సాక్షులు!!
కామెంట్‌లు