నిర్ణయాలు :-మంగారి రాజేందర్ జింబో

 (18 March 2018)

ఆ మధ్య ఓ మిత్రుడు భోజనానికి పిలిస్తే వెళ్లాను. నగరానికి దూరంగా ఖాజాగూడలో అతను ఉంటున్నాడు. అది కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ప్రతి నెలకి దాని రూపురేఖలు మారిపోతున్నాయి. 
ఒకసారి గతంలో వచ్చినప్పటికీ అతని ఇల్లు వెతుక్కోవటంలో ఇబ్బంది ఎదురైంది. గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నా అతని ఇంటిని సరిగ్గా తెలుసుకోలేక పొయ్యాను. అందుకని అతనికి ఫోన్ చేశాను. వాళ్ల డ్రైవర్‌ని నేను వున్న ప్రదేశానికి పంపించాడు. అతని సహాయంతో అతని ఇంటికి చేరుకున్నాను.
అప్పటికే అక్కడ ఓ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో ఓ వ్యక్తి జర్నలిస్ట్, మరో ఇద్దరు యూనివర్సిటీ ప్రొఫెసర్లు. నా తరువాత మరో వ్యక్తి కూడా ఫోన్ చేశాడు. డ్రైవర్‌ని పంపిస్తే అతనూ వచ్చాడు.
అందరూ యాభై సంవత్సరాలు దాటిన వ్యక్తులే. మా సంభాషణ సమాచార యుగంవైపు మళ్లింది. గతంలో మనుషులు ఎలా కలిసేవాళ్లు అనే విషయం మీద సంభాషణ జరిగింది.
అక్కడున్న అందరూ టెలిఫోన్లు, పేజర్లు, మొబైల్స్, స్మార్ట్ ఫోన్లు  చూసిన వ్యక్తులే. చిన్నతనంలో టెలిఫోన్లు చూడని వ్యక్తి కూడా అందులో ఒకరున్నారు.
‘ఈ ఫోన్లు లేని కాలంలో మనుషులు ఎలా జీవించారో’ అన్నాడు ఆ ఐదుగురిలో ఓ వ్యక్తి.
నాకు నవ్వొచ్చింది.
ఆ దశలన్నీ చూసిన వ్యక్తులే. ఆ దశల గురించి ఇలా మాట్లాడుతుంటే నాకే కాదు అక్కడున్న అందరికీ నవ్వొచ్చింది.
ఆయన వేసిన ప్రశ్నకి ఎవరికి తోచిన జవాబుని వాళ్లు ఇచ్చారు.
చాలా ముందుగా ప్లాన్ చేసుకొని కలిసేవాళ్లు. అందరికీ తెలిసిన ప్రదేశంలో కలుసుకొని ఇంటికి వచ్చేవాళ్లు. ఇలాంటి జవాబులు చాలా వచ్చాయి.
ప్రతి కాలంలో అప్పుడు వున్న పరిస్థితులను బట్టి ప్రజలు మసలుకుంటారు. ఇప్పుడున్న సౌకర్యాలనుబట్టి గతాన్ని ఊహించుకొని అయ్యో అని అనుకోవడం సమంజసం కాదు. అందులో ఆ కాలాన్ని చూసిన వ్యక్తులు.
ఈ విషయం ఫోన్లకే కాదు. చాలా విషయాలకు వర్తిస్తుంది. కన్యాశుల్కం నాటకాన్ని ఇప్పటి పరిస్థితులకి అన్వయించుకోకూడదు. 
నిర్ణయాలు కూడా అదే విధంగా ఉంటాయి. అప్పుడున్న పరిస్థితులనుబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అవి ఆ తరువాత అవి సరైనవని అన్పించకపోవచ్చు. అన్పించనూ వచ్చు.

కామెంట్‌లు