వల్లువర్, తిరుక్కురళ్: -- యామిజాల జగదీశ్






 అగర ముదల....అంటూ మొదలుపెట్టి 1330 శ్రీసూక్తులను రాసిన తిరువల్లువర్ తమిళులకు ఓ మహత్తర కావ్యాన్ని అందించాడు. తమిళులు దీనిని దక్షిణ వేదంగా భావిస్తారు. మనిషి అనే అతను జీవితంలో ఎలా ప్రవర్తించాలో చాటి చెప్పిన సూక్తులివి. మానవజాతికి ఎప్పటికీ అవసరమైన పుస్తకమని వారి మాట.
తిరువల్లువర్ పేరు, తల్లిదండ్రుల పేర్లు, జన్మస్థలం ఇప్పటివరకూ ఎవరూ రూఢీగా చెప్పలేకపోతున్నారు. అయినప్పటికీ క్రీ.శ. రెండవ శతాబ్దంలో వల్లువర్ జన్మించినట్టు పరిశోధకులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆయన చెన్నైలోని మైలాపూరులో జన్మించారని అంటుంటారు. కావేరిపాక్కం ప్రాంతంలో నివసించిన మార్గశియన్ అనే అతను వల్లువర్ కవితా పాండిత్యాన్ని గ్రహించి నేరుగా కలిసి తన కుమార్తె వాసుకినిచ్చి పెళ్ళి చేసినట్టు కొన్ని అధ్యయనాలబట్టీ తెలుస్తోంది.
వల్లువర్ శ్రీసూక్తులను ఇంగ్లీషుతోసహా అనేక భాషలలో అనువదించిన వారున్నారు. ఇంగ్లీషులో ఈ కావ్యానికి జి.యు. పోప్ అనువదించడం విశేషం. తెలుగులో నాకు తెలిసి ఓ పది మందిపైనే దీనిని అనువదించారు. ఒకానొకప్పుడు ఆ వివరాలు కూడా ఎక్కడో రాసుకున్నాను కూడా. కానీ అది కనిపించకపోవడంతో తెలుగులో రాసిన వారి పేర్లు ఇవ్వలేకపోతున్నాను. ఆరుద్రగారు, చల్లా రాధాకృష్ణ శర్మగారు, యామిజాల పద్మనాభస్వామిగారు (ధర్మకాండం మాత్రం) తదితరులు రాశారు. అలాగే ప్రభాకర్ గారని ఒకాయన మా ఇంటికొచ్చి తిరుక్కురళ్ కి తమ తెలుగు అనువాద పుస్తకాన్ని నాకిచ్చారు. అదీ ఎవరో తీసుకుని నాకు తిరిగివ్వలేదు.
తిరుక్కురళ్ లో మొత్తం మూడు కాండలున్నాయి. అవి ధర్మం, అర్ధం, కామం.
ధర్మ కాండలో 38 అధ్యాయాలు, అర్ధ కాండలో 70 కాండలు, కామ కాండలో 25 కాండలు ఉన్నాయి. 
ధర్మ కాండలో ధర్మం మొదలుకుని గృహస్థు జీవితం వరకు అనేక భావాలున్నాయి. ధర్మబద్ధంగా ఎలా జీవించాలి అనేది సుస్పష్టంగా ఇందులో తెలుసుకోవచ్చు.
అర్ధకాండలో రాజకీయం, సాధువుగా ఎలా ఉండాలి వంటి తెలుసుకోవచ్చు.
కామకాండంలో ప్రేమ తదితర అంశాలను సూచించారు.
ఈ మూడు కాండలతో వల్లువర్ మానవజాతికి తరగని సంపదను గొప్ప కానుకగా ఇచ్చాఠన్నది తమిళుల అభిప్రాయం. ఇదొక ఆణిముత్యమని అభివర్ణిస్తారు. ఈ కావ్యాన్ని తమిళులు ఉళగ పొదుమురై, ముప్పాల్, ఈరడి నూల్, ఉత్తరవేదం, దైవ నూల్, పొదుమురై, పొయ్యామొళి, ఇలా రకరకాల పేర్లతో మహత్తర గ్రంథంగా తమిళులు చెప్పుకుంటారు.
ఈ కావ్యాన్ని ఇంతలా చెప్పుకుంటున్న ప్పటికీ దీని గ్రంథకర్త తిరువల్లువర్ మరణం గురించి అధికారపూర్వకంగా ఇదీ ఫలానా తేదీ అని వారు చెప్పలేకపోతున్నారు. కానీ మైలాపూరులో పుట్టి పెరిగారని, అవ్వయార్ సహకారంతో మదురైలోని తమిళ సంఘంలో వల్లువర్ తిరుక్కురళ్ ని సమర్పించారని భావిస్తున్నారు. 
వల్లువర్ ని పులవర్, దైవప్పులవర్, ముదర్ పావలర్, నాన్ ముగనార్, దేవనాయనార్, పెరునావలర్ పేర్లతో పిలిచే వారున్నారు.
చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న వల్లువర్ కోట్టంలో వల్లువర్ స్మృత్యర్థం నిర్మితమైనదే. ఇందులో వల్లువర్ కోసం ఓ మండపం ఉంది. అందులోని గోడలపై ఆయన రాసిన 1330 శ్రీసూక్తులు  చెక్కారు. ఈ కోటను తమిళనాడు ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటోంది.
తమిళనాడుకీ, మన భారత దేశానికి చివరి ప్రాంతమైన కన్యాకుమారిలో తిరువల్లువర్ నిలువెత్తు విగ్రహాన్ని తమిళనాడు ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇది 133 అడుగుల విగ్రహం. దీని శిల్పి సుప్రసిద్ధ గణపతి స్థపతి.
వల్లువర్ పుట్టినట్టు భావిస్తున్న మైలాపూరులోని ముండక్కణ్ణి అమ్మన్ గుడి సమీపంలో ఆయన కోసం ఓ ఆలయం కూడా నిర్మించారు. ఇప్పటికీ ఈ ఆలయాన్ని మద్రాసులో చూడవచ్చు. ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో నిర్మించారు. 1970లలో దీనిని పునర్నిర్మించారు. ఈ ఆలయ ఆవరణలో నవగ్రహ సన్నిధి,  శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, మురుగన్, సన్నిధులున్నాయి. తిరువల్లువర్ విగ్రహం నల్లరాతితో చేసినదే. గర్భాలయంలోనే ఉత్సవ విగ్రహాలూ ఉన్నాయి. రాయపేట రోడ్డుకి తిన్నగా ఉంటుందీ ఆలయం. వల్లువర్, ఆయన భార్య వాసుకి దంపతులకోసం ప్రత్యేకించి ఓ సన్నిధి కూడా ఈ ఆలయ ఆవరణలో దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రతీ రోజు సాయంత్రంపూట పిల్లలకు తిరుక్కురళ్ నేర్పిస్తారు. 1897లో జె. ఎం. నల్లసామి పిళ్ళై రాసిన పుస్తకంలో ఈ ఆలయం గురించి వివరాలున్నాయి.
విదేశాలలోనూ వల్లువర్ కీర్తిని ప్రశంసిస్తూ విగ్రహాలు ప్రతిష్టించారు.

కామెంట్‌లు