గుర్తుకొస్తున్నాయి-- పెద్దమామ్మయ్య--మోగంటి సబ్బమ్మ;--సత్యవాణి

  ఈసారి నా'గుర్తుకొస్తున్నాయి'లో హీరోయిన్ మా పెదబామ్మ (పెద్దమామ్మయ్య) మోగంటి సుబ్బమ్మ.
      మా బామ్మ అదే మా చినమామ్మయ్య,అంటే మా మా నాన్నను కన్నతల్లి  పూళ్ళ బాపనమ్మగారైతే ,పెంచింది మా పెద్దమామ్మయ్యే.
     మా నాన్ననేకాదు,మా చిన్నమామ్మయ్య సంతానం  మా నాన్నతో సహా ఆరుగురితోపాటు,తన ముగ్గురి చెల్లెళ్ళ పిల్లలను పెంచి పెద్ద చేసి,బాగోగులన్నీ మా పెద్దమామ్మయ్యే చూసుకొనేది.
       ఇప్పుడు శంఖవరం మండలంలోని 'జగ్గంపేట 'మా పెదబామ్మ అత్తవారి ఊరట.మోగంటి గంగరాజు అనే బాలుడితో
ఆమెకు, ఆరేడు సంవత్సరాలకే పెళ్ళైయ్యి,పది సంవత్సరములలోపుగానే  భర్తను పోగొట్టుకొందట. మాటలమధ్యన పెద్దమనషి అయ్యేవరకూ తనను పూలు పెట్టుకోనిచ్చేరనీ,రంగుబట్టలు కట్టుకొనేదాన్ననీ చెపుతుండేది.పెద్ద మనషి అయిన తరువాత అప్పటి మూఢాచారాలలో భాగంగా  మామ్మయ్య తలను బోడిచేసి,తెల్లపంచను ముసుగేశారట.తననోట అత్యంత బాధపడుతూ,సిగ్గు పడుతూ మా పాలికాపుతో"తలమాసిపోయిందిరా!మంగలి రామదాసును తీసుకురా"అని చెప్పడం తలచుకొంటే, ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుదినాకు.
         బాల్యంలోనే భర్త చనిపోయినా,అత్తవారింటికి పెళ్ళీ, పేరంటాలకూ,పురుడు పుణ్యాలకూ వెళుతూనే వుండేది తను ఎప్పుడూ వుండడం రౌతులపూడిలో మా ఇంట్లోనే,తన తరువాత చెల్లెలు బాపనమ్మ దగ్గరే,అదే మా నాయనమ్మ దగ్గరే వున్నా,మిగతా ఇద్దరు చెల్లెళ్ళు పెమ్మరాజు నరసమ్మ,కొమ్ముచిక్కాల. పండ్రవాడ మంగమ్మ ముక్కొల్లు. వారికి ఏ అవసరం వచ్చినా సహాయానికి వెళ్ళి వచ్చేది..వాళ్ళ పిల్లలనికూడా మా అసలుబామ్మ బాపనమ్మ  ఆరుగురు పిల్లలతో అంటే ,మానాన్నా వాళ్ళతో సమానంగా చూసేది. ఈ పెంచిన పిల్లలందరూ ఆవిడను కొందరు పెద్దక్కయ్యా అని అంటే, మరికొందరు మాత్రం "అమ్మా"అనే పలిచేవారు. మామ్మయ్య సంతానమంతా అంటే, మా నాన్నలూ,అత్తయ్యలూ మాత్రం "అమ్మా "అనే పిలిచేవారు.వాళ్ళ అసలమ్మను చిన్నక్కయ్య అనేవారు. "కన్నవాళ్ళకు వాళ్ళ పిల్లలే పిల్లలు కానీ ,పెంచిన వాళ్ళకు అందరూ తమ పిల్లలే అంటూవుండేది మా పెద్దమామ్మయ్య.
        బాల్య వితంతువైనా ఆమెను మా బంధువులందరూ  ఎంతో ప్రేమతో, గౌరవంతో,ఆదరంతో చూసేవారు .
       చెపితే ఆశ్చర్య పోతారుకానీ,మా ఇళ్ళలో పెళ్ళిళ్ళు,వడుగులూ మొదలైన ఏ వేడుకలు జరిగినా, మా పెదబామ్మే వినాయకుడికి మీదుకట్టాలి.పెళ్ళికొడుకైనా,,పెళ్ళి కూతురికైనా ఈమే నెత్తిన  చమురెట్టాలి .అలాగే పుట్టినరోజులకూ,బారసాలలకు కూడా ఆవిడ నె త్తిన చమురెట్టి దీవించేకానే ,మిగతా కార్య క్రమం జరిగేది.ఆదీవెన భలేవుండేది." నీ అమ్మకడుపు చల్లగా,నీ అత్తకడుపు చల్లగా,లక్క లేని సొమ్ములెట్టుకొని,నీ ఒక్కిల్లూ ,వందిళ్ళకు మొదలై అంటూ ఒక పదినిముషాలపాటు ఏమేమో ఆపకుండా దీవించేది.తలంటుల్లో కంట్లో కుంకుడుకాయ పులుసు పడుతుందని తెలిసినా,మా పెదబామ్మ దీవెనలకోసం పరుగు  పరుగున వచ్చి తలమీద నూనె పెట్టించుకోడానికి పోటీలు పడేవారం మా పిల్లలందరం.అలా నెత్తిన చమురెట్టి ,దీవనలచ్చేవారెవరీనాడు.
   అలాగే   కొత్తగా పెళ్ళైన జంట ఇంట కాలు పెడుతున్నా , కోడళ్ళు చంటిపిల్లలను పుట్టిళ్ళనుండి తీసుకొనివచ్చినా, బండి దిగేసరికి  మా పెద్దమామ్మయ్య ఎదురెళ్ళి ,ఎర్రనీళ్ళు దిగదుడిచి,దిష్టితీసి లోపలకు తీసుకొని రావడం
మా ఇళ్ళలో ఆచారం .అంటే మా పెద్దమామ్మయ్య అదే మోగంటి సుబ్బమ్మగారంటే మావాళ్ళందరికీ ఎంత గౌరవమో, ఎంతటి ఆప్యాయతో మనం ఈవిషయంలో గుర్తించాలి.అదీ ఆనాడు మూఢనమ్మకాలు అధికంగా గల ఆరోజుల్లో.కొత్త బంధువర్గం విస్తుపోయి చూడడమేకాదు,వింతగా చెప్పుకొనేవారు వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో..ఈ విషయాల గురించి.
            చదువు సంద్యలు లేకపోయినా అఖండమైన తెలివితేటలుకలది మా పెదనాయనమ్మ. దూరంగా వున్న మా అవతలి దొడ్డిలోనూ..,దివిలాళ్ళ దొడ్డిలోనూ వున్న కొబ్బరిచెట్లకాయలు మా పాలికాపులు తీస్తుంటే,
వంట ఇంట్లో పొయ్యిదగ్గర కూర్చుని,ఎన్ని పండిన కాయలు తీసాడో, ఎన్ని ముప్పేట కాయలు,ఎన్ని లేతకాయలూ తీసేడో లెక్కపెట్టి మరీచెప్పేది.లెక్కకు ఒక్క కాయ తక్కువ వచ్చినా,పాలికాపు వెదుకులాడి, దాన్ని పట్టుకు తీసుకొచ్చేవరకూ వదిలిపెట్టేదికాదు.బాగా ముదురు కాయలు ఎగిరి బాగా దూరంగా చెదిరి పడతాయనీ,ముప్పేట కాయలైతే ఒకసారి ఎగిరి చెట్టుకు దగ్గరగా పడతాయనీ,అదే లేత కొబ్బరికాయలైతే,దిబ్బుమని, చెట్టుకిందే పడతాయనే సిధ్ధాంతం కూడా చెప్పేది.
       చదువు అసలు రాకపోయినా,మాచెల్లాయి ప్రకాశి సంస్కృత పాఠాలు చదవుతుంటే,ఆ పాఠానికి సంబంధించిన కథలు వివరించి చెప్పేది.
       మారుమూలనున్న పల్లెటూరు రౌతులపూడినుంచి బంధువర్గంతో కలసి,  ఏ ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజులలో పద్దెనిమిది సార్లు కాశీ విశ్వేశ్వరుని ,రామేశ్వరంలోని రామలింగేశ్వరుని దర్శించుకొందంటే మా పెద్దమామ్మయ్య  శక్తిని ,నిశ్చయాన్నీ తలచుకొని ఈరోజుకూ మేము ఆశ్చర్యపోతుంటాము.అలాగే బంధువర్గాన్ని అచ్చిరాజు బామ్మగారూ,గంగరాజు దొడ్డా,శేషమ్మ బామ్మగారూ మొదలైన బంధువర్గాన్ని కూడగట్టుకొని రెండుసార్లు శ్రీశైలయాత్ర కూడా చేసింది.అలాగే తాను చూసిన తిరుపతీ ,పూరీ మొదలైన యాత్రా విశేషాలెన్ఫో చెప్పేది. పెద్దమామ్మయ్య. అల్లూరి సీతారామరాజు మా రౌతులపూడి వచ్చి ,ట్రావెలర్స్ బంగ్లాలో దిగినప్పుడు మానాన్న కొండ్రాజు ఆరోగ్యం కోసం ఆయననడిగి, తాయెత్తు తెచ్చి కట్టింది.మానాన్న అనంతరం ఆ తాయెత్తు మా తమ్ముడి దగ్గర రౌతులపూడిలో మా ఇంట్లోనేవుంది.
        తనకంటూ సంతానం లేకపోయినా,ముగ్గురు చెల్లెళ్ళ పిల్లలనూ అమితంగా ప్రేమించేది.అందులో ఆఖరి చెల్లెలు  పండ్రవాడ మంగమ్మ మామ్మగారి పిల్లలను మరింతగా ఆదరించేది.ఎందుకంటే  మంగమ్మ మామ్మగారు చాలా చిన్న వయసులో పోవడం,ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకోవడంతో,  వారి ఏడుగురు పిల్లలనూ తల్లిలా సాకేది.అలాగే మరో చెల్లెలు పెమ్మరాజు నరసమ్మగారి ఎనమండుగురు పిల్లలనూ కంటికి రెప్పలా కాచేది.మాపెద్దమామ్మయ్య. .మా రౌతులపూడిలో మా నాయనమ్మ బాపనమ్మ దగ్గర వుండడంతో, వీరందరూ మా ఇంటికి వస్తూ పోతూ వుండడం వలన, మా చినబామ్మల పిల్లతో నాకూ,మా అన్నయ్య వెంకటేశ్వర్లుకీ,మా ప్రకాశి చెల్లెలికీ పరిచయాలు ఎక్కువ.చిన్న నాయనమ్మల పిల్లలతో ,మనవలతో రాకపోకలూ,మాటామంతులూ ఈనాటికీ వున్నాయంటే ,ఈనాటివాళ్ళకు ఆశ్చర్యంగా వుంటుంది.కానీ ఇది నిజం.
     మా మంగమ్మ బామ్మగారి ఆఖరి అబ్బాయి చిట్టిపంతులు చిన్నాన్నతో అయితే నాకు అనుబధం మరింత ఎక్కువ.ఎందుకంటే ,"నా మనవరాలిని ఎత్తుకు ఆడిస్తే,నీకు మావిడి పండిస్తా "అనేదిట మా మామ్మయ్య.ఆ మావిడిపండుకోసం దుక్కలా వుండే నన్ను మోయలేక మోయలేక ఎత్తుకొని తీసికెళ్ళి,కరుప్రోలు పల్లయ్యగారి అరుగుమీద కుదేసి,తను చీకిన మావిడి టెంకను నాకు ఇచ్చి ఆడించేవాడుట.1985లో నేను బెంగుళూరు వెళ్ళినప్పుడు మా చిట్టిపంతులు చిన్నాన్నా,పిన్నీ,వాళ్ళ పిల్లలూ చూపిన ఆదరణ ఈనాటికీ మరవలేనిది.
        మళ్ళీ మా పెద్దమామ్మయ్య దగ్గరకు వస్తే,కొన్ని సంవత్సరాల తరువాత మా చిట్టత్తయ్య కాకినాడలో స్థిరపడ్డాకా,మా అత్తయ్య దగ్గరకు చేరింది మా పెద్దమామ్మయ్య.మా చిట్టత్తయ్య ఇంటికి వచ్చే చుట్టాలకీ,బంధువులకూ,చదువులకోసం వచ్చివున్న తనచెల్లెళ్ళ మనవలకూ విసుగన్నది లేకుడా పొయ్యలపై వండి వార్చి పెట్టేది.
       మా మామ్మయ్య వయసుడిగి చుట్టుకున్న పొట్లకాయలా వంగి పోయినా,ఈపని నువ్వు చేసిపెట్టు అని ఏనాడూ ఎవరినీ అడగనేలేదు.గోవిందనామాలు,కృష్ణుని విశ్వరూప సందర్శనం,చిట్టి రామాయణం మొదలైన ఎన్నెన్నో ,ఏవేవో పాటలు  పాడుకొంటూ పనులు చేసుకొనేది. వానలుకురిసి మూడేసిరోజులు పొద్దు కనిపించకపోయినా ముద్ద ముట్టేది కాదు.ఆరోజుల్లో అదేమిటో, ఈ ఇంటిమీద కాకి ఆ ఇంటిమీద వాలడానికి కూడా లేకుండా, మూడు నాలుగురోజులవరకూ ,వదలని ముసురు పట్టేది.సూర్యుడన్నవాడు కనిపించేవాడేకాదు.మా మామ్మయ్యలాంటివారు ,ఆరోజులలో పొద్దు కనిపిచేవరకూ మద్ద మట్టరాదన్న నియమాన్ని  ఖచ్చితంగా పాటించేవారు.అలాంటి నియమం వుండేవారిలో మా చిట్టత్తయ్య అత్తగారు చల్లపల్లి శేషమ్మ అమ్మమ్మగారు కూడా వుండేవారు.
         అలా ముసురు పట్టిన మూడు నాలుగు రోజులలో "పెద్దపాపా!పొద్దు కనిపీస్తోందేమో చూడు అని అడిగేవారు.పెద్దపాప అంటే నేనే.నాతరవాత పుట్టినదాని పేరు చిన్నపాప.కనుక నేను పెద్ద పాపనన్నమాట.
         ఒకసారి మూడు రోజుల తరువాత పొద్దు చూసి మా పెద్దమామ్మయ్య భోజనం చేస్తుండగా ,సమయం సందర్భం చూసుకోకుండా,"మామ్మయ్యా!లక్ష్మింపతి తాతగారు పోయారట"అంటూ పెద్ద గొప్పగా టీ.వీ న్యూస్ రీడరులాగ వార్త పట్టుకొచ్చి విడుదల చేసాను.
      "ఆసి! నీబొడ్డు పొక్క" (అదే ఆవిడ తిట్టే పెద్ద తిట్టు. ఇంతమంది పిల్లలనూ ఒక్క తిట్టు కూడా తిట్టకుండా పెంచిది)అంటూ ఆకు ముందునుంచి లేచిపోయింది.మరి ఆ లక్ష్మింపతి తాతగారు మా మామ్మయ్యకు పెతండ్రి కొడుకని,పక్షిణీ అదీ వుంటుందని అప్పుడు నాకేం తెలుసు.నేనప్పుడు అలాగే తింగరిగా వుండేదాన్ననుకొంటా.
        పగలంతా గెంతుతూ, దుముకుతూ ఆట్లాడుతూ,రాత్రి అయ్యేసరికి కాళ్ళు వేళ్ళాడేస్తే,పాపం నా కాళ్ళు పట్టేది కానీ,ఒక్క రోజుకూడా అంత పద్ద వయసులోవున్న ఆవిడ కాలిమీద నేను చెయ్యన్నా వెయ్యలేదు.దిష్టిలూ ,దిరుగుండాలు తీయించుకొన్నాను కానీ తనకేమీ చెయ్యలేకపోయేను. ఇప్పుడు పశ్చాత్తాప పడుతుంటాను కానీ, మా పెద్దమామ్మయ్యకోసం రౌతులపూడిలో అయితే ఏటి దగ్గర చెలమనుండీ,కాకినాడలో అయితే, ఇప్పుడు భానుగుడి ఏరియలో  వున్న ఆనంద్ టాకీస్ దగ్గర వుండే కుళాయినుండీ స్నానంచేసి,తడి గౌనో,తడి పరికణీయో కట్టుకొని మడిగా మంచినీళ్ళు పట్టుకొచ్ఛి కొంతలో కొంత ఋణం తీర్చుకొన్నాను. అయితే ఇప్పుడు మా రౌతులపూడిలో  ఏటిలో చెలమలూ లేవు ,చెలమలేమిటి,పారే ఏరే లేదు .ఆనాడు జన సంచారమే లేని ఈనాటి ఆనంద్ టాకీస్ దగ్గర ఇప్పుడు ఎంతరద్దీగా వుంటుందన్నది చూడాలి తప్ప, చెప్పడానికిలేదు.
    ఇక మా పెద్దమామ్మయ్య
 రాత్రులపుడు,"పెద్దపాపా నాదగ్గర పడుకోవా?" అని అడిగేది.
తనదగ్గర పడుకోవాలని వున్నా,తను కప్పుకొనే రగ్గు సూదుల్లా గుచ్చుకొనేది.అందుకని పడుకొన్నట్టే పడుకొని,పక్కకు  దొర్లిపోయేదాన్ని."ఆవున్లే నాదగ్గరెందుకు పడుకొంటావు ,నేను ముసలి కంపు కొడతాను."అంటూ పాపం నిష్టూరమాడేది .
     ఇక్కడ ఒక సరదాగా ఒకవిషయం చెపుతాను. ఏ సంవత్సరమో గుర్తులేదుగానీ,'కాళిదాసు' (పూర్వపు)సినీమా వచ్చింది. ఎపుడూ  సినీమా చూడని మా మామ్మయ్యకు ఆ సినీమా చూడాలనిపించి నన్ను తీసుకొని బయలుదేరింది.సినీమలో ఎంతసేపటికీ కాళిదాసు రాడు.రమ్మంటే  ఎలా వస్తాడూ,ఆకాళిదాసు సినీమా ఆరోజే వెళ్ళిపోయి,'రాణీ రత్నప్రభ'సినీమా వచ్చింది.
రామరావూ,అంజలీదేవి ఆధ్భుతంగా, ప్రేమ గీతాలు పడేసుకొంటున్నారు అస్తస్తమానూ.చాలాసేపుచూసేకా ,"పద పెద్దపాపా!"అంటూ సినీమానుంవచి లేవతీసుకొచ్చింది.సినీమా మొదలుపెట్టేముందు 'రాణీ రత్నప్రభ'అని వాడి తప్పులేకుండా టైటిల్ వేయనే వేసేడు.అది తడుముకొంటూ నేను చదవనే చదవేను.కానీ ఏదైతేనేంలే ఏదో ఒక సినీమా చూద్దాం అనే ఆశతో.ముందుగా చెపితే,వెంటనే సినీమా చూడకుండా బయలుదీర తీస్తుందనీ, ఏమీ తెలియనట్టు ఊరుకొన్నాను.ఆవిడ  ఈ సినీమా ,ఆ సినీమా కాదని  చిటికెలో గ్రహిస్తుందన్న విషయం నాచిన్న బుర్రకు ఆనాడు తట్టనేలేదు.
        
  ఆ తర్వాత  చాలా రోజులకు    నా పెళ్ళి అయిన తరువాత, మేముకూడా చిట్టత్తయ్య ఇంటికి దగ్గరలోనే, ఆ శ్రీరామనగర్లోనే వుడేవారము.ఒకరోజు మా మాఆయనమీద అలిగి, అన్నం తినకుండా చిట్టత్తయ్యింటికి వచ్చి,కోపం తగ్గాకా తిరిగి వెళ్ళాను.అయితే ఆవిషయం తనకు తర్వాత తెలసింది. ఆ తర్వాత ఎప్పుడు,ఏ సమయంలో వెళ్ళినా "పెద్దపాపా !అన్నంతిను"అంటూ "వద్దు మామ్మయ్యా!నేనన్నంతినే వచ్చేనన్నా ,"ఒకముద్దేనా తిను లేకపోతే నామీద ఒట్టే"అంటూ కలిపి ముద్దలు పెట్టేది.  లేదంటే,ప్లేటునిండా కరకరలూ,పరపరలూ పెట్టేది.
      మా పెద్దమామ్మయ్య ప్రేమకు అంతూ దరీ లేదు. ఆమె ప్రేమమయి.అనురాగమయి.త్యాగమయి అని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయి.
మా చిట్టత్తయ్య భర్త ,మా బుల్లి మావయ్యగారు జలోదరం జబ్బుతో మంచం పడితే,మలమూత్రాలు ఎత్తింది.మాబుల్లిమావయ్యగారంటే,తన చెల్లెలికి కూతురుకి భర్త.ఇటువంటి ప్రేమలను,ఇటువంటి ప్రేమ గల మనుషులనూ,ఈనాడు ఊ
హించగలమా మనం?
     మా పెద్దమామ్మయ్య ధర్మశీలి,కర్మశీలి,త్యాగశీలి.
1974లో మా మామ్మయ్య ఎత్తి పెంచిన,ప్రాణంలో ప్రాణంగా చూసుకొనే, తన చెల్లలి కూతురు మా చిట్టత్తయ్యకు ప్రాణాంతకమైన జబ్బు చేసి, నాలుగైదు నెలలు  మంచం పట్టింది. చాలా నెలలు కాకినాడ పెద్దాసుపత్రిలో వుంది.ఏ క్షణానికి ఎలా వుంటుందో అని అందరం కంగారు పడుతున్నాం.అలాంటి ఆందోళన కరమైన పరిస్థితిలో అత్తయ్య గురించి బెంగపెట్టుకొని, ఒకరోజు చిన్న జ్వరం వచ్చి, తనువు చాలించింది మా పెద్దమామ్మయ్య.
         చిత్రంగా ఆమర్నాడే మా చిట్టత్తయ్యకు వ్యాధి నిర్ధారణ జరిగి, ఆపరేషన్ జరిగి కోలుకొని,ఆ తర్వాత చిట్టత్తయ్య సుమారుగా 34-35 సంవత్సరాలపాటు బ్రతికింది.
      మేమందరం మా చిట్టత్తయ్య కోసం మా పెద్దమామ్మయ్య ఫ్రాణం త్యాగం చేసింది అనుకొంటాం ఈరోజుకీ.. ప్రతిరోజూ ఏదోవిషయంలో ఆమెను తలుచుకొంటూనే వుంటాము.కాదు తనే మా తలపుల లోనికి వస్తూనే వుంటుంది.
తన జ్ఞాపకార్థం మా రౌతులపూడి రామలింగేశ్వరస్వామివారి గుడి ప్రాంగణంలో ఆమె తవ్వించిన బావిపై ఆమె పేరు  'మోగంటి సుబ్బమ్మ' అన్న ఆవిడ పేరు చెరిపించేసినా,ఆ బావిలో నీరు నిండుగా వుండి,ఆ గుడి దైవము రామలింగేశ్వరుణ్ణి ఆ బావి నీటితో అభిషేకించుకొంటున్నంత వరకూ ,మనుష్యులం మనం మోగంటి సుబ్బమ్మ గారిని మరచిపోయినా, రామలింగడు మాత్రం మరువనే మరువడు.
       
కామెంట్‌లు