*గణపతి*- పెద్ద కొడుకు - ముత్యాల సరాలు :---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

నలుగు పిండితొ నాతిజేసిన 
చిన్నిబొమ్మని కాపునుంచెను 
స్నాన ఘట్టము నావరించెను 
అంబ సద్గుణముల్ 

ఆమె భావన రూపునొందెను 
పాలబుగ్గల పాపడయ్యెను 
చిన్ని ఆయుధమొకటి గైకొని 
వాకిటను గాచెన్ 

పోరునందున యలసివచ్చిన 
పరమ శివునికి పాపడడ్డగ
పొంగి వచ్చెను పౌరుషమ్మును 
తొలగి పొమ్మనగా 

శూలమెత్తెను సూటిఖండన 
విగతజీవిగ శిశువు దేహము 
గౌరి చూచిన గోడుగోడున 
ఏడ్వ సాగెనుపో 

దివ్యులందరు కలతచెందిరి 
ఉపాయమ్మును సుంతతెలిపిరి 
గజము శిరసును తెచ్చియతికిరి 
బాలుడమ్మయనెన్ !

తొలుతపూజలు సుతునికిచ్చెను 
చరితభవ్యము గానునిలిచెను 
హరునిముద్దుల తనయుడాతడు 
శరణు విఘ్నేశా !!

కామెంట్‌లు