ఇద్దరు మిత్రులు - బాలల కథ :--ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

 ఒకరింట్లో కోడిపుంజు, పిల్లి పెరుగుతున్నాయి. రెండూ ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు యజమాని కుటుంబం ఇల్లు తాళం పెట్టి ఊర్లోనే ఉన్న బంధువుల ఇంట్లో శుభకార్యంలో హాజరు కావడానికి వెళ్లారు. పిల్లికి, కోడికి ఆహారం, నీళ్ళు ఏర్పాటు చేసి వెళ్లారు. పిల్లి వాళ్ళతో వీధి మలుపు వరకు వెళ్లి వెనక్కు వచ్చింది. కోడి చెట్ల పాదుల్లోనూ, పిల్లి తన స్థానంలోను కునుకు తీశాయి. సాయంత్రం అయ్యాక మెలుకువ వచ్చింది పిల్లికి. కోడి కూడా లేచి చెట్ల లో షికారు చేస్తున్నాది. అంతలో ఇంట్లోనుండి శబ్దాలు వచ్చాయి. పిల్లి ముందు యజమానులు వచ్చేసారేమో అనుకుంది.కానీ తలుపుకు తాళం వేసే ఉంది. కోడిని పిల్చి విషయం అడిగింది. దొంగలేమో నండోయ్ అంది కోడి.ఇద్దరూ కలిసి ఇంటికి వెనుక వైపు ద్వారం దగ్గరకు వెళ్లి చూసాక చప్పుడు సంగతి నిజమే అని అర్ధం అయింది. మెల్లగా కిటికీ దగ్గర కు పోయి, పంజా తో కిటికీని ఆపకుండా కొట్టింది పిల్లి.కోడి గారేమో కొక్కో రోకో అని అరవడం మొదలెట్టారు. 
దాంతో లోపలున్న దొంగలు ఇద్దరు ఎవరో వచ్చేశారని భయం తో, బీరువాలు తెరిచే ప్రయత్నం ఆపేసి,  ఇంకో పెద్ద కిటికీ గుండా పారిపోయారు. 
అలా తమ ప్రయత్నం ఫలించినందుకు కోడి పుంజు, పిల్లి సంతోషపడ్డాయి. రాత్రికి వచ్చిన యజమాని కుటుంబం లోపల చోరీ ప్రయత్నం జరిగిందని,ఏమి పోలేదని దైవానికి కృతజ్ఞతలు చెప్పు కున్నారు. 
   (  సమాప్తం ) 
 
నీతి- సమిష్టి కృషి తో ఏదైనా సాధించగలరు. 

కామెంట్‌లు