ఆరనట్టి చితి మంటలు (కైతికాలు) :-- రమేశ్ గోస్కుల--కైతికాల రూపకర్త

అడుగడుగున కూపాలు
అగుతున్నవి శాపాలు
పసి మొగ్గల పైన
చేస్తున్న దాష్టికాలు
అనాగరిక మృగాలతో
అలుముకున్న అంధకారం

పుట్టుకే శాపమై
వాడుతున్నబంతులు
అమ్మ జన్మపైనేయగ
దుర్మార్గపు కత్తులు
అది దాటుకు వచ్చినాక
దారినిండ పరుచుకున్న  గోతులు

ఒక వైపు వెలుగు లీను
వేగుచుక్క లెన్నియో
మరో వైపు మంట గలుచు
మరకతము లెన్నియో
నమ్మకాలు వీడేలా
పసి నవ్వులపై గొడ్డలి పెట్టు!

శక్తి కత్తెత్తితే
ఎక్కడ బంధీయౌనో!
విద్యల కొలనున వాణికి
పద్మాలే ముండ్లౌనో!
లక్ష్మీకూడ చిన్న బోవు
చితులు చూసి సిరిమల్లెల

ఆకాశంలో అర్థం
ఆనందానికర్థం
మగాడి బతుకునిండా
పూర్ణత్వపు తీర్థం
చేరుతుంది నేడిక్కడ
చిగురులోనే చితిమంటన

అందమైన పాట నేడు
అంధకారమలుముకుంది
జలపాతం పరుగు వీడి
బండ చాటున ఇంకింది
వారేవ్వా మగవాడా
రసం పీల్చు పురుగుకన్నా రసహీనమైనావు

పంట చేరినగ్గి తెగులు
హద్దు లేకుండ యుంటే
వేగనీయకుండ చేయు
వేరుపురుగులాగుంటే
వేటు వేయు కాలమొచ్చి
బతుకు వేరు బలియగునురా

పాప భీతసలు లేని
బతుకన్నది యేలా!
గుహలను చేరేందుకెళ్ళు
కుహనా బుద్ధులేలా!
కుళ్ళనీకు యే ఫలంను
విషమించకముందు గతులు

వనం నుండొచ్చి మళ్ళీ
ఆదారిన వెళితెట్లా!
ఆధునిక యుగకత్తులు
వేయు వంతెనెక్కిట్లా!
మురికి గుంటనున్న పూవు
ముత్యమోలే మెరియు కదురా!

ఆరని  ఆర్తనాదాలు
యెదను కోయు శృతి గంటలు
నీకు నీవు కూలుస్తూ
ప్రగతి రథ చక్రాలు
యెన్నాళ్ళీ మగతనాలు
వెర్రెక్కిన కుక్కలట్లు!


కామెంట్‌లు